US open 2024 : సెమీఫైనల్ లో జాక్ డ్రేపర్(బ్రిటన్) పై సినర్ విజయం సాధించాడు.. డ్రేపర్ పై సినర్ వరుస సెట్లలో విజయం సాధించాడు. 7-5, 7-6(7/3), 6-2 తేడాతో మట్టి కరిపించాడు.. అంతేకాదు యూఎస్ ఓపెన్ ఫైనల్స్ వెళ్లిన తొలి ఇటలీ క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. ఇక మరోవైపు ఫ్రాన్సిస్ టియాపో (అమెరికా) పై ఫ్లేట్జ్ గెలుపును దక్కించుకున్నాడు.. దీంతో అతడు ఫైనల్ చేరుకున్నాడు. ఫ్లేట్జ్ ఫైనల్ వెళ్లడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాడు. గత పది సంవత్సరాలుగా గ్రాండ్ సలాం టోర్నమెంట్ ఫైనల్లోకి అమెరికా ప్లేయర్లు వెళ్లలేదు. అయితే తన అద్భుతమైన ఆట తీరు ద్వారా ఫ్లేట్జ్ ఆ అపప్రదను తుడిచి వేశాడు. 2009 నుంచి ఇప్పటివరకు అమెరికా క్రీడాకారులు ఫైనల్స్ కు అర్హత సాధించలేకపోయారు. 2009 వింబుల్డన్ టోర్నీలో అండి రాడిక్ ఫైనల్స్ కు అర్హత సాధించాడు. కాగా, ఫ్లేట్జ్ కు ఇదే తొలి గ్రాండ్ స్లామ్ ఫైనల్.
ఆదివారం ఫైనల్స్
ఆదివారం యూఎస్ ఓపెన్ ఫైనల్స్ పోటీ జరగనుంది. ఈ పోటీలో సినర్ ఒకవేళ ఓడిపోతే.. 2003 తర్వాత యూఎస్ ఓపెన్ లో మెన్స్ సింగిల్స్ టైటిల్ గెలిచిన తొలి అమెరికా ఆటగాడిగా ఫ్లేట్జ్ ఘనత సొంతం చేసుకుంటాడు. ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో 2003 లో అమెరికా ఆటగాడు అండి రాడిక్ యూఎస్ ఓపెన్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఇంతవరకు ఆ ఘనతను ఏ అమెరికన్ ఆటగాడు అందుకోలేకపోయాడు. అయితే స్వదేశంలో మ్యాచ్ జరుగుతోంది కాబట్టి ఫ్లేట్జ్ కు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో సినర్ ను తక్కువ అంచనా వేయలేమని అంటున్నారు..” ఇద్దరు హోరాహోరిగా ఆడుతున్నారు. ఎవరికి విజయావకాశాలు ఉన్నాయనేది చెప్పలేము. రెండు కొదమసింహాల్లాగా వారిద్దరూ ఫైనల్స్ లో పోటీ పడటం ఖాయం. చూసే ప్రేక్షకులకు కూడా అద్భుతమైన క్రీడా వినోదం లభిస్తుంది. యుఎస్ ఓపెన్ లో వారిద్దరిలో ఎవరు గెలిచినా సరికొత్త చరిత్ర నమోదవుతుంది. సినర్, ఫ్లేట్జ్ తమ జోరును నూటికి నూరు శాతం ప్రదర్శిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదని” క్రీడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు..
అంచనాలు తప్పాయి
అయితే ఈసారి జకోవిచ్ టైటిల్ గెలుస్తాడని అందరూ భావించారు. అల్కా రాస్ సంచలన ప్రదర్శన చేస్తాడని అనుకున్నారు. అయితే వారిద్దరూ తమ స్థాయి ఆట తీరు ప్రదర్శించకుండా నిరాశపరిచారు. రౌండ్ దశలోనే ఓటమిపాలయ్యారు. దీంతో ఒక్కసారిగా యూఎస్ ఓపెన్ లో పెను సంచలనాలు నమోదయ్యాయి. సినర్, ఫ్లేట్జ్ ఫైనల్ వెళ్లడంతో అందరి అంచనాలు తలకిందులయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే ఫైనల్స్ లో కొత్త విజేత పుట్టుకు రావడం ఖాయమని క్రీడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.