Ishan Kishan: ఇషాన్ కిషన్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇతడి పేరు మారు మోగిపోతోంది. గతంలో బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేసి వార్తల్లోకి ఎక్కాడు ఇషాన్ కిషన్. ఆ తర్వాత టీమ్ ఇండియాలో కీలకమైన ఆటగాడిగా మారిపోయాడు . అయితే మేనేజ్మెంట్ సూచనలను అతడు పట్టించుకోకపోవడంతో జట్టుకు దూరమయ్యాడు.
ఒకసారి జట్టులో స్థానం కోల్పోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఇషాన్ కిషన్ కు అర్థమైంది. అందువల్లే అతడు డొమెస్టిక్ క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. ఎక్కడైతే పోగొట్టుకున్నాడో.. అక్కడే వెతుక్కోవాలని అనుకున్నాడు. దానికి తగ్గట్టుగానే తన ఆట తీరు పూర్తిగా మార్చుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఏకంగా ఝార్ఖండ్ జట్టును విజేతగా నిలిపాడు. అంతేకాదు ఫైనల్ మ్యాచ్లో వీర విహారం చేశాడు. తద్వారా సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. అనంతరం న్యూజిలాండ్ సిరీస్ కు ఎంపిక అయ్యాడు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ గాయపడిన నేపథ్యంలో.. అతని స్థానాన్ని ఇషాన్ కిషన్ ఆక్రమించాడు .
న్యూజిలాండ్ జట్టుతో జరిగిన సిరీస్లో ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో.. ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారిపోయాడు. తద్వారా టి20 వరల్డ్ కప్ లో కూడా అదే స్థాయి సత్తా చాటుతానని సంకేతాలు ఇచ్చాడు. ఆ సంకేతాలకు తగ్గట్టుగానే ప్రస్తుతం ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. పాకిస్తాన్ జట్టుతో జరిగిన కీలక మ్యాచ్లో ఇషాన్ కిషన్ మెరుపు వేగంతో బ్యాటింగ్ చేశాడు. చూస్తుండగానే హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టాడు. తద్వారా టీమిండియా భారీ స్కోరు చేసింది. పాకిస్తాన్ జట్టును ఓడించింది.
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో జార్ఖండ్ జట్టును గెలిపించిన కిషన్.. ఇప్పుడు టీమ్ ఇండియా సాధిస్తున్న వరుస విజయాలకు కూడా ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు . అతడు ఇదే దూకుడు కొనసాగిస్తే సెంట్రల్ కాంట్రాక్టులో మెరుగైన స్థానాన్ని సంపాదించుకునే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే ఊపులో హైదరాబాద్ జట్టుకు అతను సారధిగా మారే అవకాశాలను కూడా కొట్టి పారేయలేమని వారు వివరిస్తున్నారు. ఎందుకంటే కమిన్స్ గాయపడిన నేపథ్యంలో .. అతడి స్థానాన్ని ఇషాన్ కిషన్ ద్వారా భర్తీ చేయాలని హైదరాబాద్ యజమాని కావ్య మారన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే గనుక జరిగితే 2026 ఐపిఎల్ లో హైదరాబాద్ జట్టు కిషన్ ఆధ్వర్యంలో ప్రత్యర్థులతో పోటీపడుతుంది.