Virat Kohli career: చాలా కాలం తర్వాత టీమిండియాలోకి వచ్చాడు లెజెండ్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత ఐపీఎల్ లో అదరగొట్టాడు. ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ కు ముందు అతడు సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. అప్పటినుంచి అతడు తన కుటుంబంతో లండన్ లోనే ఉంటున్నాడు.. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న వన్డే సిరీస్ కోసం అతడిని జట్టుకు ఎంపిక చేశారు. దీంతో విరాట్ కోహ్లీ నేరుగా లండన్ నుంచి వచ్చాడు. ఎటువంటి ప్రాక్టీస్ చేయకుండానే టీమ్ ఇండియాతో జాయిన్ అయ్యాడు. ఆస్ట్రేలియా గడ్డమీద ప్రాక్టీస్ చేసిన అతడు.. అభిమానులను అలరించాడు.
ప్రాక్టీస్ లో పర్వాలేదు అనిపించినప్పటికీ.. సిరీస్ లో మాత్రం విరాట్ కోహ్లీ ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇప్పటివరకు జరిగిన రెండు వన్డే మ్యాచ్లలో అతడు 0 పరుగులకే అవుట్ కావడంతో అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో అతడి నుంచి గట్టి ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు. ముఖ్యంగా అడిలైడ్ వన్డేలో 0 పరుగులకు అవుట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ అత్యంత నిరాశతో మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు. అతడు ఆవుటై వెళ్లిపోతుంటే అభిమానులు స్టాండింగ్ ఓ వేషన్ ఇచ్చారు. తనకు అలాంటి గౌరవం ఇచ్చిన అభిమానులకు చెయ్యి ఊపుతూ విరాట్ కోహ్లీ శుభాకాంక్షలు తెలియజేశాడు. విరాట్ కోహ్లీ అలా చేయడం వెనక ఏదైనా కారణం దాగి ఉందా? విరాట్ కోహ్లీ ఉన్నట్టుండి అలా ఎందుకు చేశాడు? అనే ప్రశ్నలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇటీవల కాలంలో విరాట్ కోహ్లీ ఇండియాకు రావడం మానేశాడు. ఐపీఎల్ ఆడిన తర్వాత.. బెంగళూరు విజేతగా నిలిచిన తర్వాత విరాట్ కోహ్లీ ఒక్కసారిగా తన మకాం మొత్తాన్ని లండన్ కు మార్చేశాడు. భార్య అనుష్క, పిల్లలతో కలిసి అతడు లండన్ వీధులలో తిరుగుతున్నాడు. తన స్వేచ్ఛాయుత జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. కుటుంబానికి అత్యంత దగ్గరగా ఉండడానికే విరాట్ టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకున్నట్టు ఇటీవల వెల్లడించాడు. ప్రస్తుతం అడిలైడ్ వన్డే లో విరాట్ సున్నా పరుగులు చేసి ఔట్ కావడం సగటు అభిమానిని నిరాశపరిస్తే.. అతడు మాత్రం అభిమానులకు చెప్పుకుంటూ వెళ్లిపోయాడు. తన కెరియర్ లో విరాట్ చివరి మ్యాచ్ ఆడేసాడని.. అందువల్లే అభిమానులకు థాంక్స్ చెప్పుకుంటూ వెళ్లిపోయాడని సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఈ సిరీస్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్ నుంచి కూడా తప్పుకుంటాడని.. దానికోసమే సంకేతాలు ఇచ్చాడని అభిమానులు పేర్కొంటున్నారు. అన్నట్టు ఈ సిరీస్లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఒక్క పరుగు కూడా చేయలేదు.