Virat Kohli’s Son : ఫిబ్రవరి 15న తనకు కొడుకు పుట్టాడని, అతని పేరు అకాయ్ అని పెట్టామని నిన్న సోషల్ మీడియాలో టీం ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పోస్ట్ చేసిన నాటి నుంచి ఒకటే హడావిడి. సోషల్ మీడియా లో చర్చ మొత్తం అతడి చుట్టే తిరుగుతోంది. తమకు మొదటి సంతానంగా కూతురు పుట్టిన నేపథ్యంలో ఆమెకు విరాట్, అనుష్క దంపతులు వామిక అనే పేరు పెట్టారు. దుర్గాదేవి రూపం కాబట్టి తమ కూతురికి వామిక అనే పేరు పెట్టామని అప్పట్లో విరాట్ ప్రకటించాడు. ఇప్పుడు రెండవ సంతానంగా కుమారుడు పుట్టడంతో అతడికి అకాయ్ అని పేరు పెట్టారు. ఇంతకీ ఈ పేరు వెనుక ఉన్న చరిత్ర ఏంటంటే..
అకాయ్ అనే పేరు టర్కీష్ మూలానికి చెందినది. టర్కీ భాష ప్రకారం అకాయ్ అంటే ప్రకాశించే చంద్రుడు అని అర్థం.. అమావాస్య తర్వాత వచ్చే పౌర్ణమిలో చంద్రుడు ఎలాగైతే నిండుగా ప్రకాశిస్తాడో.. ఆ రూపాన్ని టర్కీలో అకాయ్ అని పిలుస్తారు. తన కుమారుడు జీవితం మొత్తం అలాగే ప్రకాశించాలని కోరుకుంటూ అకాయ్ అనే పేరును విరాట్ పెట్టి ఉంటాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. టర్కీ వాసులు కూడా రంజాన్ నెల తర్వాత పుట్టిన తన పిల్లలకు ఇదే పేరు పెట్టుకుంటారట..అకాయ్ అంటే దేవుడి కుమారుడిగా భావిస్తారట.
రెండవ సారి తండ్రి అవుతున్నాననే విషయం తెలుసుకున్న విరాట్ కోహ్లీ.. అప్పటినుంచి యాక్టివ్ క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు. వరల్డ్ కప్ ముందు తన భార్యకు వైద్య పరీక్షలు చేయించే నిమిత్తం ముంబై వెళ్లాడు. అనంతరం దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ టోర్నీలకు దూరంగా ఉన్నాడు. ముంబైలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో ఫిబ్రవరి 15న అకాయ్ కి అనుష్క జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ బిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఇదే విషయాన్ని విరాట్ కోహ్లీ సామాజిక మాధ్యమాల వేదికగా మంగళవారం ప్రకటించాడు. ఈ సమయంలో తమ వ్యక్తిగత గోప్యత కు సహకరించాలని అభిమానులను కోరాడు.