Team India: అచ్చొచ్చిన స్టేడియం కావడంతో టీమిండియా అదరగొట్టింది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించి ఔరా అనిపించింది. సూర్యకుమార్ యాదవ్, కోహ్లి రెచ్చిపోయి ఆడి ఆస్ట్రేలియాను పతనం అంచుల్లోకి నెట్టారు. భారీ లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి టీమిండియా ఛేదించి సిరీస్ ను 2-1తో చేజిక్కించుకుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా టీమిండియా రెచ్చిపోయింది. అభిమానులకు కనువిందు చేసింది. నిర్ణయాత్మక మూడో టీ20లో టీమిండియా విజయం సాధించి కప్ సొంతం చేసుకుంది. దీంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

స్టేడియంలో ఎటు చూసినా ఫోర్, సిక్సులే కనిపించాయి. ప్రపంచ చాంపియన్ ఆస్త్రేలియాను అద్భుతమైన బ్యాటింగుతో పైచేయి సాధించింది. టీమిండియా విజయంతో సిరీస్ చేజిక్కించుకుంది. దీంతో ఆస్ట్రేలియాకు ఓటమి తప్పలేదు. టీమిండియా ఆట తీరుకు అందరు ఫిదా అయ్యారు. ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. టీమిండియాలో ఆత్మస్థైర్యాన్ని నింపిన మ్యాచుగా నిలిచింది. బలమైన ఆస్ట్రేలియాను ఎలా ఎదుర్కొంటుందో అనే ఉత్కంఠ అభిమానుల్లో ఉన్నా దాన్ని పటాపంచలు చేసింది టీమిండియా. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్ లో నెగ్గి సిరీస్ వశం చేసుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కామెరూన్ గ్రీన్ 52, టిమ్ డేవిడ్ 54, భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 33 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. చాహల్ 22 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి ఓ బంతి మిగిలి ఉండగానే విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సూర్యకుమార్ 69 పరుగులతో రాణించగా, కోహ్లి 63 పరుగులు చేసి జట్టును గెలిపించారు. సిరీస్ లో 8 వికెట్లు పడగొట్టిన అక్షర్ పటేల్ కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకోవడం విశేషం.

ఓపెనర్లు రోహిత్, రాహుల్ 34 పరుగులకే కోల్పోవడంతో జట్టు కష్టాల్లో పడినట్లు కనిపించింది. ఈ దశలో జట్టు ఏం చేస్తుందనే ఆందోళన అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ కు దిగిన సూర్య కుమార్ యాదవ్, విరాట్ కోహ్లి స్కోరు బోర్డును పరుగులెత్తించారు. వీరి భాగస్వామ్యాన్ని విడదీయడం కంగారులకు సాధ్యం కాలేదు. దీంతో పరుగుల వరద పారించారు. విధ్వంసకర బ్యాటింగ్ తో ఇద్దరు రెచ్చిపోయి ఆడారు. ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించారు. మూడో వికెట్ కు 104 భాగస్వామ్యం అందించారు. దీంతో విజయం నల్లేరు మీద నడకే అయింది.
ఉప్పల్ స్టేడియంలో విరాట్ కోహ్లి తన బ్యాట్ కు పనిచెప్పాడు. విమర్శకుల నోళ్లు మూయించాడు. కొద్ది కాలంగా పేలవ ఫామ్ తో బాధపడుతున్న విరాట్ కు ఉప్పల్ స్టేడియం కలిసొచ్చింది. దీంతో పరుగులు వరదలా పారించాడు. ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని మరోమారు తన సత్తా చాటాడు. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో బ్యాట్ ఝుళిపించాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. జట్టుకు అవసరమైన సమయంలో తన సేవలు అందించి ముందుకు నడిపించాడు.
టికెట్ల విక్రయంలో వచ్చిన వివాదాల నేపథ్యంలో టీమిండియా విజయం సాధించడంతో అన్ని తెరమరుగైపోయాయని అభిమానులు సంతోషపడుతున్నారు. టీమిండియా విజయంతో అందరిలో ఎంతో మురిసిపోయారు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో టీమిండియా విక్టరీ సాధించడం సమయోచితం. కప్ గెలవాల్సిన సమయంలో మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంది. బ్యాటింగుతో మన వారు అందరిని అబ్బురపరచారు. మొత్తానికి మన క్రికెటర్లు సమష్టిగా రాణించి గెలుపు సాధించడం తెలిసిందే.
ఇన్నాళ్లుగా జట్టు సమన్వయం దెబ్బతినడంతో ఓటములు చవిచూశారని తెలుస్తోంది. ప్రస్తుతం జట్టు గాడిన పడిందని చెబుతున్నారు. మన వారి ప్రతిభ కొట్టొచ్చినట్లు కనబడింది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో అందరు సమయోచితంగా బ్యాటింగ్ చేసి అందరిని మెప్పించారు. ఇదే విధంగా మన వారు భవిష్యత్ లో విజయాలు సాధించాలంటే ఇంకా సఖ్యతతో ఆడుతూ ముందుకు సాగాల్సిన అవసరం ఏర్పడింది. బ్యాటింగ్, బౌలింగ్ లో టీమిండియా ఎక్కడా లోటు కనిపించలేదు. ఆటగాళ్ల సమష్టి కృషితోనే ఇది సాధ్యపడింది.