Ravi Shastri: వన్డే క్రికెట్ కు ప్రమాదం పొంచి ఉందా..? భవిష్యత్తులో ఈ ఫార్మాట్ మనుగడే ప్రశ్నార్థకంగా మారనుందా..? అంటే అవునన్న సమాధానమే క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్ల నుంచి వస్తోంది. తాజాగా టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి చేసిన వ్యాఖ్యలు.. దీనికి మరింత బలం చేకూరుస్తున్నాయి.
ఒకప్పుడు వన్డే క్రికెట్ అంటే అభిమానులు పిచ్చెక్కిపోయేవారు. రోజంతా మ్యాచ్ చూసేందుకు ఆసక్తి చూపించేవారు. వేలాదిగా వచ్చే అభిమానులతో స్టేడియాలు కిక్కిరిసి కనిపించేవి. గత కొన్నేళ్లుగా వన్డే క్రికెట్ కు ఆదరణ తగ్గుతోందన్న భావన క్రికెట్ వర్గాల నుంచి వినిపిస్తోంది. పొట్టి ఫార్మాట్ కు అలవాటు పడిన అభిమానులు రోజంతా మ్యాచ్ చూసేందుకు ఆసక్తి చూపించడం లేదన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు, మాజీ కోచ్ రవి శాస్త్రి చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి. భవిష్యత్తులో వన్డే క్రికెట్ ప్రమాదంలో పడిపోబోతుందని ఆయన హెచ్చరించారు.
ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం కష్టమేనన్న రవి శాస్త్రి..
టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి ఒక మీడియా ఛానల్ తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వన్డే క్రికెట్ ప్రమాదంలో పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా టి20 లీగ్ లు వస్తుండడంతో ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం కష్టంగా మారుతోందని పేర్కొన్నారు. ప్రాంచైజీలు ప్లేయర్స్ తో ఒప్పందం చేసుకుంటుండడంతో క్రికెట్ ఫుట్బాల్ బాటలో పయనిస్తుందని పేర్కొన్నారు. మున్ముందు ఇదే జరుగుతుందని స్పష్టం చేశారు. బీసీసీఐతో కాంట్రాక్టు లేని ఆటగాళ్ళు ఇతర దేశాల్లో జరిగే లీగుల్లో పాల్గొనే అవకాశం ఉందని రవిశాస్త్రి వివరించారు.
ఎంతోమంది నిపుణులది అదే మాట..
ఒక్క రవి శాస్త్రి మాత్రమే కాకుండా క్రికెట్ నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని గత కొన్నాళ్లుగా వ్యక్తం చేస్తున్నారు. పొట్టి ఫార్మాట్ చూసేందుకు అలవాటు పడిన అభిమానులు ఒక రోజు మొత్తం జరిగే వన్డే క్రికెట్ ను చూసేందుకు ఇష్టపడడం లేదని పేర్కొంటున్నారు. దీనివల్ల వన్డే క్రికెట్ చూసే అభిమానుల సంఖ్య తగ్గిపోతుంది అని, వీక్షకులు లేనప్పుడు వన్డే క్రికెట్లో మార్పులు చేయాల్సిన అవసరం ఐసీసీకి ఏర్పడుతుందని పలువురు చెబుతున్నారు. తాజాగా రవి శాస్త్రి చేసిన వ్యాఖ్యలను పలువురు మాజీ క్రికెటర్లు కూడా సమర్థిస్తున్నారు. ఇప్పటికే అనేక దేశాల్లో ఐపీఎల్ తరహా లీగ్ లు పుట్టుకు వచ్చాయని, భవిష్యత్తులో మరిన్ని పురుడు పోసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ లీగ్ లు ఖచ్చితంగా వన్డే ఫార్మాట్ పై ప్రభావం చూపుతాయన్న భావనను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. లీగ్ ల్లో ఆడితే భారీగా ఆదాయం వస్తుండడంతో.. చాలా మంది క్రికెటర్లు దేశానికి ఆడడం కంటే.. లీగుల్లో ఆడేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు.
Web Title: Is odi cricket in danger why did ravi shastri say that
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com