IPL valuation: ఇండియన్ ప్రీమియర్ లీగ్.. టి20 లలో ఒక అద్భుతమైన చరిత్ర సృష్టించింది. పొట్టి ఫార్మాట్ కు తిరుగులేని ఆదాయాన్ని అందించింది. ప్రపంచ క్రికెట్ గతిని మొత్తం పూర్తిగా మార్చేసింది. ఐపీఎల్ సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత అనేక లీగ్ లు తెరపైకి వచ్చాయి. ఆటగాళ్లకు కాసుల పంటను పండించడం మొదలుపెట్టాయి. వాస్తవానికి పొట్టి ఫార్మాట్ వృద్ధిని ఐపీఎల్ ముందు, తర్వాత అని వర్గీకరించుకోవచ్చు.
ఐపీఎల్ 2008లో మొదలైంది. ఆ తర్వాత అంతకుమించి అనే స్థాయిలో ఎదిగిపోయింది. ప్రతి ఏడాది తన బ్రాండ్ వాల్యూను పెంచుకుంటూ పోయింది. మొదట్లో వందల కోట్లకు పరిమితమైన ఐపిఎల్ బ్రాండ్ విలువ.. కొంతకాలానికే వేల కోట్లకు చేరుకుంది. ఒకానొక దశలో లక్ష కోట్లను మించిపోతుందని వార్తలు వచ్చాయి. పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలు ఐపీఎల్లో జట్లను కొనుగోలు చేశాయి. ప్లేయర్లకు భారీగా డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టాయి. ఒకరకంగా స్వదేశీ, విదేశీ ఆటగాళ్లకు ఐపీఎల్ ద్వారా కాసుల పంట పండుతోంది. పైగా ప్రైజ్ మనీ, ప్రకటనలు, టికెట్ల విక్రయాలు, ఇతరత్రా ఒప్పందాల ద్వారా జట్ల యాజమాన్యాలకు దండిగా ఆదాయం రావడం మొదలుపెట్టింది. అందువల్లే ఐపిఎల్ లో జట్లను సొంతం చేసుకోవడానికి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు క్యూలో ఉన్నాయి.
ఐపీఎల్ విలువ అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు మొత్తం బీసీసీఐ మీద పడింది. అయితే గడిచిన రెండు సంవత్సరాలుగా ఐపిఎల్ ప్రభ తగ్గిపోవడం మొదలుపెట్టింది. వాస్తవానికి ఇది క్రికెట్ అభిమానులకు ఇబ్బందికరమే అయినప్పటికీ.. వాస్తవం అలాగే ఉంది. 2023లో ఐపీఎల్ విలువ 93,500 కోట్లు ఉంది. 2024 సీజన్ వరకు అది ఏకంగా 82,700 కోట్లకు తగ్గిపోయింది. ఆ తర్వాత 2025లో 76,100 కోట్లకు పడిపోయింది. ఒక ఏడాదిలోనే దాదాపు ఐపిఎల్ విలువ 6600 కోట్లకు తగ్గిపోయింది. గత ఏడాదితో పోల్చి చూస్తే ఏకంగా 8 శాతం డ్రాప్ నమోదయింది.
ఐపీఎల్ నిర్వహణకు ప్రధాన ప్రయోజన కర్తగా ఉన్న సంస్థ కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల మూతపడింది. బెట్టింగ్ యాప్స్ పై కేంద్రం నిషేధం విధించింది. దీంతో ఐపీఎల్ ను ప్రమోట్ చేస్తున్న డ్రీం 11 కంపెనీ మూతపడింది. ఇదిలా ఉంటే టీవీని డిజిటల్ మీడియా మొత్తం పూర్తిగా ఓవర్ టాక్ చేయడం ప్రారంభించింది. ఫలితంగా ఐపీఎల్ విలువ పడిపోయిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ విలువను పెంచడానికి బీసీసీఐ అనేక రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఉపయోగం ఉండడం లేదని తెలుస్తోంది. మరి వచ్చే ఏడాదైనా ఐపీఎల్ విలువ పెరుగుతుందా.. లేక మరింత పతనమవుతుందా.. చూడాల్సి ఉందని విశ్లేషకులు అంటున్నారు.