IPL Franchise: ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్)కు చెందిన ఓ ప్రముఖ ఫ్రాంచైజీ గోల్డెన్ ఆఫర్ ఇచ్చినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్, ఓపెనర్ ట్రావిస్ హెడ్‌కు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుతో కాంట్రాక్టు రద్దు చేసుకుని అంతర్జాతీయ క్రికెట్‌ను వదిలేస్తే ఒక్కొక్కరికి రూ.53 కోట్లు ఇచ్చేందుకు ఆ ఫ్రాంజైజీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఫ్రాంచైజీకి పూర్తికాల క్రికెటర్లుగా కొనసాగాలని కండీషన్ పెట్టింది.
‘ఫ్రాంచైజీ క్రికెట్ యుగం’ ఆరంభమా?
ఈ ప్రతిపాదన ప్రపంచ క్రికెట్‌లో విప్లవాత్మక మార్పుకు సంకేతమని నిపుణులు భావిస్తున్నారు. లీగ్‌ల సంఖ్య పెరగడం, ఫ్రాంచైజీల ఆర్థిక శక్తి విస్తరించడం కారణంగా ఆటగాళ్లు ఇప్పుడు దేశ జట్టు కంటే కమర్షియల్ కాంట్రాక్ట్‌ల వైపు ఆకర్షితులవుతున్నారు. ఐపీఎల్ గతంలో ఎన్నో దేశాల క్రికెటర్లకు ఆర్థిక భద్రతను ఇచ్చినప్పటికీ, ఇప్పుడు అది పూర్తి–సమయ ఉపాధిగా మారే పరిస్థితి ఏర్పడుతోంది.
ఆఫర్ వెనుక ఆర్థిక లెక్కలు
ప్రస్తుతం పాట్ కమిన్స్ సన్‌రైజర్స్ హైదరాబాదు తరపున ఏడాదికి రూ.18 కోట్లకు రిటైన్ అయ్యాడు. క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి సెంట్రల్ కాంట్రాక్ట్ రూపంలో రూ.8–9 కోట్లు అదనంగా పొందుతున్నాడు. అన్నీ కలిపి అతని వార్షిక ఆదాయం రూ.35–40 కోట్ల వరకు ఉంటుంది. ఇక ట్రావిస్ హెడ్ కూడా ఎస్‌ఆర్‌హెచ్‌లోనే ఉన్నాడు. రూ.14 కోట్ల రిటెన్షన్‌తోపాటు బోర్డు కాంట్రాక్ట్ ద్వారా దాదాపు రూ.25–30 కోట్లు సంపాదిస్తున్నాడు. ఈ ఆదాయంతో పోలిస్తే ప్రముఖ ప్రాంచైజీ ఇచ్చిన రూ.58 కోట్ల ఆఫర్ మెరుగా ఉంది. ఇద్దరికీ లాభదాయకం అవుతుంది.
క్రికెట్ ఆస్ట్రేలియాకు సవాల్
ఫ్రాంచైజీల నుంచి ఇలాంటి భారీ ఆఫర్లు రావడం జాతీయ జట్లకు తలనొప్పిగా మారుతోంది. కమిన్స్, హెడ్ వంటి ప్రైమ్ ప్లేయర్లు టెస్టులు, వన్డేలకు దూరమైతే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఇబ్బందులో పడుతుంది. అందుకే ఈ అంశాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా, ప్లేయర్స్ అసోసియేషన్, రాష్ట్ర క్రికెట్ సంఘాలు చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
భవిష్యత్ లీగ్‌లదేనా?
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సంవత్సరం పొడవునా టీ20 టోర్నీలు జరుగుతున్నాయి. ఫ్రాంచైజీలు తమ జట్ల ద్వారా ఐపీఎల్, బిగ్ బాష్, సౌత్ ఆఫ్రికా లీగ్‌ల్లో ఒకే ఆటగాళ్లను ఉపయోగించుకునే అవకాశాలను పరిశీలిస్తున్నాయి. ఈ వ్యూహం ఫ్రాంచైజీలకు లాభదాయకమైనప్పటికీ, అంతర్జాతీయ క్రికెట్ స్థాయిపై దీర్ఘకాల ప్రభావం చూపే అవకాశం ఉంది.
పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్‌లు ఈ ప్రతిపాదనను అంగీకరిస్తారా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఈ ఆఫర్ వాస్తవమైతే, ఇది కేవలం ఇద్దరు ఆటగాళ్ల నిర్ణయం మాత్రమే కాదు.. క్రికెట్‌లో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికినట్లు అవుతుంది.