IPL Auction 2024 : టీ20 క్రికెట్‌లో సంచలనంగా మారిన ఇండియన్∙ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్ సమీపిస్తోంది. ఈ మెగా టోర్నమెంట్ ఆరంభం కావడానికి ఎంతో సమయం లేదు. ఇంకో రెండు నెలల్లో ఐపీఎల్ 2024 మొదలు కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి/మార్చి నెలల్లో ఐపీఎల్ 2024లో మొత్తం 10 జట్లు తలపడనున్నాయి.
74 రోజులు క్రికెట్ పండుగ
రెండున్నర నెలల పాటు అంటే 74 రోజులపాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే బిగ్గెస్ట్ టోర్నమెంట్ ఇది. దీని కోసం ఇప్పటి నుంచే సన్నాహకాలు సాగుతున్నాయి. అన్ని ఫ్రాంఛైజీలు తమ జట్లను సరికొత్తగా రూపుదిద్దుతున్నాయి. గెలుపు గుర్రాలను జట్టులోకి తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తోన్నాయి.
దుబాయ్ వేదికగా వేలం..
ఈ నెల 19వ తేదీన ఐపీఎల్ 2024 మెగా ఆక్షన్ జరుగనుంది. దుబాయ్ దీనికి వేదిక. మధ్యాహ్నం ఒంటిగంటకు వేలం ఆరంభమవుతుంది. ఇందులో పాల్గొనడానికి ఇప్పటికే కొన్ని ఫ్రాంఛైజీల ప్రతినిధులు దుబాయ్‌కు బయలుదేరి వెళ్లారు. రేపు ఉదయానికి అన్ని ఫ్రాంఛైజీల ఓనర్లు దుబాయ్‌లో ల్యాండ్ కానున్నారు.
వేలం.. ప్రత్యక్ష ప్రసారం..
స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. భారత్‌లో జియో సినిమా దీన్ని స్ట్రీమింగ్ చేయనుంది. ఈ రెండు ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఐపీఎల్ 2024 మెగా ఆక్షన్ కార్యక్రమాన్ని చివరి వరకూ తిలకించవచ్చు. మెగా వేలం పాట కోసం మొత్తంగా 333 మంది ప్లేయర్లు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. క్రికెట్ ఆడే అన్ని జట్లకు చెందిన స్టార్ ప్లేయర్లందరూ ఈ జాబితాలో ఉన్నారు. వీరిలో 214 మంది భారత్, 119 మంది విదేశీ ప్లేయర్లు. 116 మంది క్యాప్డ్, 215 మంది అన్ క్యాప్డ్ ఉన్నారు.
వేలంలో స్టార్ క్రికెటర్లు..
హ్యారీ బ్రూక్, ట్రవిస్ హెడ్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, కరుణ్ నాయర్, మనీష్ పాండే, రౌమన్ పావెల్, స్టీవ్ స్మిత్, పాట్ కమ్మిన్స్, వనిందు హసరంగ, రచిన్ రవీంద్ర, కేఎస్ భరత్, కుషాల్ మెండిస్, ట్రిస్టన్ స్టబ్స్, లోకీ ఫెర్గూసన్, అల్జారీ జోసెఫ్, దిల్షాన్ మదుశంక.. వంటి స్టార్ ప్లేయర్లందరూ తమ అదృష్ణాన్ని పరీక్షించుకోనున్నారు.
అందుబాటులో 77 స్లాట్లు..
మొత్తం 10 ఫ్రాంఛైజీలు వేలంలో పాల్గొననున్నాయి. అన్ని ఫ్రాంఛైజీలకు కలిపి మొత్తం 77 స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 30 స్లాట్లు విదేశీ ప్లేయర్ల కోసం కేటాయించారు. ఫ్రాంఛైజీల యాజమానులు ఈ 77 మందిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
ఫ్రాంఛైజీల వారీగా బడ్జెట్..
గుజరాత్ టైటాన్స్– రూ. 38.15 కోట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్– రూ. 34 కోట్లు, కోల్‌కతా నైట్ రైడర్స్– రూ. 32.7 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్– రూ. 31.4 కోట్లు, పంజాబ్ కింగ్స్ – రూ. 29.1 కోట్లు, ఢిల్లీ కేపిటల్స్– రూ. 28.95 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు– రూ. 23.25 కోట్లు, ముంబై ఇండియన్స్ – రూ. 17.75 కోట్లు, రాజస్థాన్ రాయల్స్– రూ. 14.5 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్– రూ. 13.15 కోట్ల మొత్తం ఉంది.