Dhoni IPL 2026: ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. టీమ్ ఇండియా క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యయాలను సృష్టించిన ఘనత అతడి సొంతం.. క్రికెట్లో గెలవాలంటే ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవడం కాదని… కూల్ గా ఉండి కూడా సత్తా చూపించవచ్చని నిరూపించాడు. టీమిండియాకు టి20, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలను అందించి సరికొత్త చరిత్ర సృష్టించాడు.
భారత జాతీయ జట్టులోనే కాదు, ఐపీఎల్ లో కూడా ధోని అనేక సంచలనాలను సృష్టించాడు. చెన్నై జట్టుకు ఏకంగా ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీలు అందించి.. ఆ జట్టుకు అద్భుతమైన గౌరవాన్ని అందించాడు. అందువల్లే చెన్నై జట్టు యాజమాన్యం ఇప్పటికి కూడా ధోనిని గౌరవిస్తుంది. ఇంటి సభ్యుడిగా భావిస్తుంది. ధోనికి ప్రస్తుతం 40+ వయసు ఉన్నప్పటికీ.. ఏమాత్రం పట్టించుకోకుండా చెన్నై జట్టు యాజమాన్యం జట్టులో స్థానం కల్పిస్తోంది. చివరికి ఇటీవల సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ గాయం వల్ల తప్పుకున్నప్పటికీ.. తాత్కాలిక సారధిగా ధోనిని నియమించింది చెన్నై జట్టు యాజమాన్యం.
వచ్చే సీజన్లో ధోని ఆడతాడా? లేదా? అనేది మొన్నటిదాకా చర్చ జరిగేది. కానీ ఇప్పుడు ఆ చర్చ ఆగిపోయింది. ఎందుకంటే వచ్చే సీజన్లో ధోని ఆడతాడని చెన్నై యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. కీపింగ్ మాత్రమే కాకుండా, గైక్వాడ్ కు అతడు సలహాలు, సూచనలు కూడా ఇస్తాడు. ఎనిమిదవ నెంబర్ లో బ్యాటింగ్ చేయడానికి వస్తాడు. అయితే ఇప్పుడు ధోనికి సంబంధించి ఒక వార్తను టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై జట్టు మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప చెప్పాడు. ఇది ధోని అభిమానులకు గుండె పగిలే వార్తలాగా మారిపోయింది. ఎందుకంటే ధోనికి వచ్చే ఐపీఎల్ సీజన్ చివరిదని ఊతప్ప ప్రకటించాడు. ” ప్రస్తుతం జట్టు ను రూపొందించిన విధానం చూస్తుంటే తలాకు 2026 సీజన్ చివరిదని అర్థమవుతోంది. యువ క్రికెటర్ల పై చెన్నై జట్టు భారీగా ఖర్చు చేసింది. గైక్వాడ్, సాంసన్ భవిష్యత్తు నాయకులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ధోని జట్టు నుంచి తప్పుకునే అవకాశం కొట్టి పారేయలేనిది. అతడు మెంటర్ గా చెన్నై జట్టుకు సేవలు అందించే అవకాశం ఉందని” ఊతప్ప ప్రకటించాడు.
వాస్తవానికి ధోని మైదానంలో బ్యాటింగ్ చేసే సమయంలో అంత చురుకుగా కదల లేకపోతున్నాడు. అతడు మోకాళ్ళకు శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అందువల్లే చురుకుగా కదల లేక పోతున్నాడు. అయితే చెన్నై మేనేజ్మెంట్ తో తనకున్న అనుబంధం వల్ల ధోని ఆడుతున్నాడని ప్రచారం జరుగుతోంది.