IPL 2025
2023 నుంచి 2027 వరకు ఐపీఎల్ ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా రూ. 48,390 కోట్లకు కొనుగోలు చేశాయంటే ఇది ఎంత ఖరీదైన లీగ్ అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రతి సంవత్సరం రూ.12,097 కోట్లు సంపాదిస్తుంది. ఈ టోర్నమెంట్ అతిపెద్ద ఆదాయ వనరు మీడియా, ప్రసార హక్కులు కూడా. దీని ద్వారా వచ్చే ఆదాయాన్నిబీసీసీఐ, ఫ్రాంచైజీ మధ్య 50-50గా విభజించారు. ఇది కాకుండా ఇతర లాభాలు ఉంటాయి. మరి ఈ ఆట వల్ల భారత ప్రభుత్వానికి ఏం లాభమో తెలుసుకుందాం.
ఐపీఎల్ ద్వారా వచ్చే భారీ ఆదాయాలపై భారత ప్రభుత్వం కొంత పన్ను విధిస్తుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ తప్పు. నిజం ఏమిటంటే వేల కోట్లు సంపాదిస్తున్నప్పటికీ బీసీసీఐ ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 2021లో BCCI ఒక విజ్ఞప్తి ద్వారా IPL ద్వారా చాలా డబ్బు సంపాదిస్తున్నప్పటికీ, క్రికెట్‌ను ప్రోత్సహించడమే తన లక్ష్యం అని, అందువల్ల ఈ లీగ్‌ను పన్ను రహితంగా ఉంచాలని కోరింది. ఈ అప్పీలును టాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఒప్పుకుంది. ఐపీఎల్ నుంచి వచ్చే ఆదాయంపై BCCI ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
ఐపీఎల్ పన్ను రహితంగా ఉన్నప్పటికీ భారత ప్రభుత్వం ఈ టోర్నమెంట్ ద్వారా వచ్చే కోట్లాది రూపాయలతో తన ఖజానాను నింపుకుంటుంది. ప్రతి సంవత్సరం ఐపీఎల్ కోసం నిర్వహించే మెగా వేలం ద్వారా ప్రభుత్వానికి భారీ మొత్తంలో డబ్బు వస్తుంది. ఈ ఆదాయం ఆటగాళ్ల రెమ్యునరేషన్ల ద్వారా వస్తుంది. వారు చెల్లించే టీడీఎస్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. ఐపీఎల్ 2025 మెగా వేలం ద్వారా భారత ప్రభుత్వ ఖజానాకు రూ. 89.49 కోట్లు వచ్చింది.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో 10 జట్లు ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి మొత్తం రూ.639.15 కోట్లు ఖర్చు చేశాయి. ఇందులో 120 మంది భారత ఆటగాళ్లు, 62 మంది విదేశీ ఆటగాళ్లు వేలంలో పాల్గొన్నారు. 10 జట్లు భారత ఆటగాళ్ల బిడ్డింగ్‌లో రూ.383.40 కోట్లు, విదేశీ ఆటగాళ్ల బిడ్డింగ్‌లో రూ.255.75 కోట్లను ఫ్రాంచైజీలు ఖర్చు చేశాయి. భారత ఆటగాళ్ల ఐపీఎల్ జీతంలో 10 శాతం టీడీఎస్, విదేశీ ఆటగాళ్ల జీతంలో 20 శాతం టీడీఎస్ కట్ చేస్తారు. దీని ప్రకారం, భారత ప్రభుత్వం దీని నుంచి రూ. 89.49 కోట్ల లాభాన్ని ఆర్జించింది.