IPL 2025 : స్థిరమైన ప్రదర్శనతో.. బలమైన జట్లను పడగొట్టి సమర్థవంతంగా కనిపిస్తోంది బెంగళూరు జట్టు. అందువల్లే పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. విరాట్ కోహ్లీ తిరుగులేని ఫామ్ కనబరచడం.. ఓపెనర్ సాల్ట్ దుమ్ము రేపే స్థాయిలో ఆడుతుండడం.. ఇక బౌలర్లు కూడా సత్తా చాటుతున్న నేపథ్యంలో బెంగళూరు జట్టు టైటిల్ ఫేవరెట్ గా కనిపిస్తోంది. బలమైన కోల్ కతా, ముంబై లాంటి జట్లను ఓడించిన బెంగళూరు.. లక్నో, ఢిల్లీ, పంజాబ్ వంటి జట్లను కూడా మట్టికరిపించింది. మొత్తంగా చూస్తే ఈసారి అత్యంత బలంగా బెంగళూరు జట్టు కనిపిస్తోంది. గత సీజన్లో చివరి దశలో పుంజుకుని ప్లే ఆఫ్ వెళ్లిన బెంగళూరు.. ఈసారి ప్రారంభం నుంచి స్థిరమైన ఆట తీరు ప్రదర్శిస్తోంది. ఆటగాళ్లలో సమష్ఠితత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అందువల్లే ఈసారి సగటు బెంగళూరు అభిమాని కప్ మాదే అంటూ సగర్వంగా ప్రకటిస్తున్నారు. మీమ్స్, వీడియోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఇక ప్లే ఆఫ్ ముందు బెంగళూరు జట్టు కీలకమైన మ్యాచులు ఆడనుంది. శనివారం చిరకాల ప్రత్యర్థి చెన్నైతో తలపడనుంది. ఈ సీజన్లో ఇప్పటికే చెన్నైతో జరిగిన ఓ మ్యాచ్లో బెంగళూరు విజయం సాధించింది. చెన్నై వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో అన్ని విభాగాలలో పై చేయి సాధించి.. విజేతగా నిలిచింది. ఇక ప్రస్తుతం చెన్నై జట్టుతో శనివారం బెంగళూరు కీలక మ్యాచ్ ఆడనుంది. ఇటీవల సొంత మైదానంలో పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు విక్టరీ సాధించింది. సొంత మైదానంలో గెలవలేరు అనే అపవాదును పోగొట్టుకుంది. మరోవైపు ఈ సీజన్లో ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్త్ నుంచి చెన్నై జట్టు వైదొలిగింది. తొలి ఎలిమినేటర్ గా నిలిచింది. ఈ మ్యాచ్లో గెలిచినా.. ఓడిపోయినా చెన్నై జట్టుకు పెద్దగా ఒరిగేదేం ఉండదు.. అదే బెంగళూరు జట్టుకు ఈ మ్యాచ్ అత్యంత ముఖ్యం. ఈ మ్యాచ్లో గెలిస్తే బెంగళూరుకు ప్లే ఆఫ్ ఆశలు మరింత పటిష్టమవుతాయి.
Also Read : గెలిచేదే.. ఈ తప్పులు చేసింది కాబట్టే హైదరాబాద్ ఓడింది
వర్షం ముప్పు
కీలకమైన ప్లే ఆఫ్ ముందు ఆడుతున్న మ్యాచ్లో బెంగళూరు జట్టుకు వర్షం ముంపు పొంచి ఉంది. శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని తెలుస్తోంది.. గత రెండు రోజులుగా బెంగళూరు నగరంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. శనివారం కూడా అక్కడ వర్షం కురిసేందుకు 70% అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో బెంగళూరు అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుత సీజన్లో బెంగళూరు 10 మ్యాచ్లు ఆడింది. ఏడు విజయాలు సొంతం చేసుకుంది.. బెంగళూరు ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి.. శనివారం జరిగే చెన్నై మ్యాచ్ తో పాటు.. లక్నో, హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో బెంగళూరు తదుపరి మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది.. ఈ మూడింటిలో కనీసం రెండు మ్యాచ్ లో నైనా బెంగళూరు విజయం సాధించాలి.. అప్పుడే ప్లే ఆఫ్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది.