IPL 2025: ఇక టి20 ఫార్మాట్ లో విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మకు అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. ఐపీఎల్ లో అయితే వీరిద్దరూ వేరువేరు జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ సింహతాండవం చేశారు. పరుగుల వరద పారించారు. ఏ సీజన్లో కూడా నిరాశ జనకమైన ఆట తీరు ప్రదర్శించలేదు. అందువల్లే విరాట్ కోహ్లీ, రోహిత్ ఆడుతుంటే రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చేవి. ప్రేక్షకులతో మైదానాలు కిక్కిరిసిపోయేవి. ఇక సోషల్ మీడియా, ప్రధాన మీడియాలో జరిగే చర్చ మాములుగా ఉండేది కాదు. ప్రస్తుత సీజన్లో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయే విరాట్ అదే తీరుగా ఆడుతున్నాడు. రోహిత్ మాత్రం తడబడుతున్నాడు. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది? వీరాధివీరుల లాంటి ఈ ఆటగాళ్లలో ఒకరు ఉప్పెనలాగా విరుచుకుపడుతుంటే.. మరొకరు ఎందుకు చల్లబడ్డారు.. ఇప్పుడు ఈ ప్రశ్న సగటు అభిమాని మెదడును తొలిచేస్తోంది.
Also Read: తిలక్ వర్మ రిటైర్డ ఔట్‌పై హార్ధిక్ అసహనం.. ఏమన్నాడంటే?
దారుణాతీదారుణం
ప్రస్తుత సీజన్లో రోహిత్ శర్మ దాదాపు 5 మ్యాచ్ లు ఆడాడు. అతడు చేసిన మొత్తం పరుగులు కలిపితే 38. చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ.. ఇది ముమ్మాటికి నిజం. చెన్నై జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో నాలుగు బంతులు ఎదుర్కొన్న రోహిత్ డక్ అవుట్ అయ్యాడు. గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో నాలుగు బంతులు ఎదుర్కొని ఎనిమిది పరుగులు చేశాడు. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్లో 12 బంతుల్లో 13 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన మ్యాచ్లో 9 బంతులు ఎదుర్కొని 17 పరుగులు చేశాడు. వాస్తవానికి బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టి మంచి ఊపు మీద కనిపించిన రోహిత్ శర్మ.. యష్ దయాళ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో అతడి అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక ఇదే సమయంలో విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 67 పరుగులు చేశాడు. బెంగళూరు భారీ స్కోరు చేయడంలో తోడ్పడ్డాడు. ఇప్పుడే కాదు కోల్ కతా జట్టు తో జరిగిన తొలి మ్యాచ్లో 59, చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో 31, గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 7, పరుగులు చేశాడు. ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్లలో విరాట్ కోహ్లీ 164 పరుగులు చేశాడు. ఒక్క గుజరాత్ మినహా మిగతా అన్ని జట్లపై తనదైన స్థాయిలో ఇన్నింగ్స్ ఆడాడు. అయితే రోహిత్ మాత్రం విరాట్ లాగా ఆడ లేకపోతున్నాడు. చివరికి జట్టులో స్థానం కూడా కోల్పోతున్నాడు.. మరి ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే రోహిత్ కు జట్టులో స్థానమే కరువయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రోహిత్ ఒక మ్యాచ్లో ఆడలేదు కూడా.
Also Read: తన వికెట్ తీసిన యష్ దయాళ్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన రోహిత్..