IPL 2025 Bangalore Win Bet : లోగడ మూడు పర్యాయాలు కన్నడ జట్టు ఐపిఎల్ ఫైనల్లోకి వెళ్ళింది. కానీ ఒక్కసారి కూడా ట్రోఫీ అందుకోలేకపోయింది. కానీ ఈసారి ట్రోఫీ గెలుస్తామని కన్నడ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్లేయర్లు కూడా అదే ఉత్సాహంలో కనిపిస్తున్నారు. పంజాబ్ జట్టును ఓడించి ట్రోఫీని గెలిచి.. కన్నడ అభిమానుల కరువును తీర్చుతామని ఆటగాళ్లు ధైర్యవచనాలు పలుకుతున్నారు. ఇక సోషల్ మీడియాలో కన్నడ జట్టుకు అనుకూలంగా జరుగుతున్న చర్చ ఒక రేంజ్ లో ఉంది. పంజాబ్ జట్టుకు కూడా ఇదే స్థాయిలో జరుగుతున్నప్పటికీ.. బెంగళూరు కాస్త ఒక మెట్టు పైన ఉంది. హార్దిక్ జట్టుపై దిగ్విజయం సాధించిన నేపథ్యంలో పంజాబ్ మీద కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అనేక సామాజిక మాధ్యమాలలో పంజాబ్ జట్టు ఐపిఎల్ ఫైనల్లో గెలవడానికి 51 శాతం అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి స్టార్ స్పోర్ట్స్ ఒక పోస్ట్ కూడా సోషల్ మీడియాలో చేసింది. అది విపరీతమైన చర్చకు కారణమైంది.
Also Read : 17 సంవత్సరాలుగా ఎదురుచూపు.. ఎవరు గెలిచినా చరిత్రే!
ఇటువంటి ఊహాగానాలు.. ముందస్తు అంచనాలు కొంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. అవి వాస్తవ ఆటను ప్రభావితం చేయలేదు. ఇక క్రికెట్ అంటేనే రకరకాల వ్యవహారాలు దాని చుట్టూ తిరుగుతుంటాయి. ఇందులో ప్రధానమైనది బెట్టింగ్. వాస్తవానికి బెట్టింగ్ అనేది విష సంస్కృతి. కాకపోతే కొంతమంది దుర్మార్గులు డబ్బును సంపాదించడానికి ఇలాంటి వ్యవహారాలను కొనసాగిస్తుంటారు. అయితే ఇలాంటి దిక్కుమాలిన వ్యవహారాలు మనదేశంలోనే కాదు.. ఇతర దేశాల్లోనూ భారీగా సాగుతుంటాయి. విదేశాలలో ఎక్కువగా ఫుట్ బాల్ మ్యాచ్ లు జరుగుతున్నప్పుడు బెట్టింగ్లు ఎక్కువగా కాస్తుంటారు. అయితే మనదేశంలో ఐపీఎల్ జరుగుతున్నప్పుడు బెట్టింగ్ సర్వసాధారణంగా సాగుతూనే ఉంటుంది. ఇక ఇప్పుడు స్మార్ట్ కాలం లో ఉన్నాం కాబట్టి.. బెట్టింగ్ అనేది రెండవ కంటికి తెలియకుండా సాగిపోతుంది. అయితే చీకటి శక్తులు భారీగానే సంపాదిస్తున్నప్పటికీ.. అమాయకులే ఈ వ్యవహారంలో నిండా మునిగి అప్పుల పాలవుతున్నారు.
ఇక బెట్టింగ్ అనేది ఇతర దేశాల్లో కూడా సాగుతూనే ఉంటుంది.ఐపీఎల్ వల్ల కొంతమంది సెలబ్రిటీలు కూడా బెట్టింగ్ కాస్తున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు కెనడా రాపర్ డ్రేక్ కూడా చేరిపోయాడు. ఐపీఎల్ ఫైనల్ నేపథ్యంలో పంజాబ్ జట్టు పై బెంగళూరు గెలుస్తుందని అతడు ధీమా వ్యక్తం చేస్తున్నాడు. బెంగళూరు కప్ సాధిస్తుందని ఏకంగా 7.50 లక్షల డాలర్లు మన కరెన్సీలో 6.4 కోట్లు అతడు బెట్ పెట్టాడు. ఒకవేళ బెంగళూరు గనుక ఫైనల్ మ్యాచ్లో విజయం సాధిస్తే డ్రేక్ 1.312 మిలియన్ డాలర్లు సొంతం చేసుకుంటాడు. అది మన కరెన్సీలో దాదాపు 11 కోట్లు. ఇక ఇతడు గత ఏడాది కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పై 2.50 లక్షల డాలర్లు బెట్ కట్టాడు. అప్పుడు ఆ జట్టు విజయం సాధించింది. బెట్ నెగ్గిన నేపథ్యంలో అతడు ఎంత డబ్బు పొందాడనేది బయటికి వెల్లడించలేదు.. ఇక గత సీజన్లో కోల్ కతా జట్టుకు అయ్యర్ నాయకత్వం వహించాడు. అయితే ఈసారి పంజాబ్ జట్టుకు అయ్యర్ సారధిగా ఉన్నప్పటికీ.. డ్రేక్ బెంగళూరు వైపు మొగ్గు చూపించడం విశేషం.