IPL 2024 : ఐపీఎల్ లో భాగంగా ఆదివారం రాత్రి ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్ లో చెన్నై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా మైదానంలోకి దిగిన చెన్నై బ్యాటర్లు 206 పరుగులు చేశారు. చెన్నై కెప్టెన్ రుతు రాజ్ గైక్వాడ్(69), శివం దూబె(66) రాణించడంతో ఆ జట్టు భారీ స్కోర్ చేసింది. మూడో వికెట్ కు వీరిద్దరూ 90 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నిర్మించారు. వీరిద్దరూ ఔట్ అయిన తర్వాత మహేంద్ర సింగ్ ధోని మైదానంలోకి వచ్చాడు. కేవలం 4 బంతుల్లోనే 20 పరుగులు చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అతడు ఆడిన తుఫాన్ ఇన్నింగ్స్ వల్ల చెన్నై జట్టు స్కోరు మెరుపు వేగంతో దూసుకెళ్లింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఓపెనర్ రోహిత్ శర్మ 63 బంతుల్లో 11 ఫోర్లు, ఐదు సిక్సర్ల సహాయంతో 105* పరుగులు చేసినప్పటికీ ముంబై జట్టుకు ఉపయోగం లేకుండా పోయింది. ఇషాన్ కిషన్ (23) భారీ స్కోరు చేసే క్రమంలో ఔట్ అయ్యాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్న సూర్య కుమార్ యాదవ్ ఈ మ్యాచ్లో తేలిపోయాడు. రెండు బంతులు ఎదుర్కొన్న అతడు గోల్డెన్ డక్ గా వెను తిరిగాడు. తిలక్ వర్మ 31 పరుగులు చేసి టచ్లోకి వచ్చినప్పటికీ.. కీలక సమయంలో అవుట్ అయ్యాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరుకున్నాడు. అత్యవసర సమయంలో టిమ్ డేవిడ్, రుమారియో షెఫర్డ్ నిలబడకపోవడంతో ముంబై జట్టు ఓటమి ఖాయమైంది.
ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ఒక్కడే వీరోచితంగా బ్యాటింగ్ చేశాడు. వాస్తవానికి మైదానం బ్యాటింగ్ కు పెద్దగా సహకరించకపోయినప్పటికీ.. మరో ఎండ్ లో ఇతర ఆటగాళ్ల నుంచి సపోర్టు లభించకపోవడంతో అతడు సెంచరీ చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఫలితంగా ముంబై జట్టు ఓడిపోయింది. రోహిత్ శర్మ సెంచరీ చేసినప్పటికీ కొంతమంది అభిమానులు సెల్ఫీష్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో రకరకాల విమర్శలకు దిగారు. మరికొందరేమో రోహిత్ శర్మకు అండగా నిలుస్తున్నారు.. “జట్టులో ఇతర ఆటగాళ్లు సహకరించకపోతే అతను మాత్రం ఏం చేస్తాడు” అంటూ కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానికి రోహిత్ శర్మ సెంచరీ చేసినప్పటికీ కొంతమంది అదే పనిగా విమర్శలు చేస్తుండడం విశేషం.