IPL 2024 కప్ ఈసారి ఎలాగైనా దక్కించుకోవాలని ఆరాటపడుతున్న జట్లలో.. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఒకటి. ఇందుకోసం గ్రౌండ్ వర్క్ మొత్తం పూర్తి చేసింది. ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. మైదానంలో చెమటలు చిందిస్తున్నారు. అలాంటి వేళ హైదరాబాద్ జట్టుకు ఆటగాడు కోలుకోలేని షాకిచ్చాడు. దీంతో ఆ జట్టు యాజమాన్యం ఒక్కసారిగా ఆందోళనలో కూరుకుపోయింది.
వేలంలో కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఓ ఆటగాడు టోర్నీ ప్రారంభానికి ముందే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు షాక్ ఇచ్చాడు. 17వ సీజన్లో హైదరాబాద్ జట్టు ఆడే మూడు మ్యాచ్ లకు ఆ టీం స్టార్ ఆటగాడు, శ్రీలంక t20 కెప్టెన్ హసరంగ దూరమయ్యాడు. అతడు తన టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.. అందువల్లే బంగ్లాదేశ్ జట్టుతో జరగబోయే రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కు శ్రీలంక క్రికెట్ బోర్డు హసరంగను ఎంపిక చేసింది. ఐపీఎల్ ప్రారంభమయ్యే మార్చి 22న
.. బంగ్లాదేశ్ – శ్రీలంక మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 3న ఈ సిరీస్ ముగుస్తుంది. ఫలితంగా హైదరాబాద్ జట్టు ఆడే తొలి మూడు మ్యాచ్లకు హసనంగా దూరమవుతాడు. అయితే ఈ నిర్ణయాన్ని అతడు హైదరాబాద్ జట్టుకు ముందే తెలిపినట్టు ప్రచారం జరుగుతోంది. హసరంగ గత ఏడాది సీజన్లో హైదరాబాద్ జట్టులో కీలకమైన ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. ఆ టీం కప్ దక్కించుకోలేకపోయింది. అయితే ఈసారి ఎలాగైనా కప్ సాధించాలని ఆ టీం తీవ్రంగా శ్రమిస్తోంది.
హసరంగ అటు బంతి, ఇటు బ్యాట్ తో అద్భుతాలు చేయగలడు. తనకు మాత్రమే సొంతమైన స్పిన్ బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టగలడు. ఇటీవల బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన టి20 సిరీస్లో హసరంగ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఫలితంగా లంక జట్టు సిరీస్ దక్కించుకుంది. ఇక బ్యాట్ తోనూ హసరంగ మెరుపులు మెరిపించగలడు. బౌలర్ల బంతులను పరుగులు పెట్టించగలడు. అయితే ఇలాంటి కీలక ప్లేయర్ మూడు మ్యాచ్ లకు దూరం కావడం అంటే హైదరాబాద్ జట్టుకు పెద్ద దెబ్బే. మరి అతడి స్థానాన్ని హైదరాబాద్ జట్టు ఎవరితో భర్తీ చేస్తుందో? అప్పట్లో జరిగిన వేలంలో ఇతడిని హైదరాబాద్ జట్టు 1.5 కోట్లకు కొనుగోలు చేసింది..