IPL 2023 Final CSK Vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ అత్యంత ఆసక్తికరంగా సాగింది. అభిమానులను మునివేళ్లపై నిలబెట్టిన ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు అద్భుత ప్రదర్శన చేసి విజయం సాధించింది. చివరి రెండు బంతుల్లో విజయానికి 10 పరుగులు అవసరం అయిన దశలో.. జడేజా వరుసగా 6, 4 కొట్టి జట్టుకు గొప్ప విజయాన్ని అందించి పెట్టాడు. ఒకరకంగా చెప్పాలంటే ఈ మ్యాచ్ లో గుజరాత్ జట్టు అద్వితీయమైన ప్రదర్శనతో ఓడి గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమలోని పోరాటంతో ఓటమి అంచులకు వెళ్లి విజయాన్ని సాధించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ ముగిసింది. సుమారు రెండు నెలల పాటు అభిమానులను ఉర్రూతలూగించిన ఈ టోర్నీ ఎట్టకేలకు ముగిసింది. ఫైనల్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు అత్యంత ఆసక్తికరంగా సాగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫైనల్ మ్యాచ్ కు వరుణుడు అనేకమార్లు అంతరాయం కలిగించడంతో పలుమార్లు మ్యాచ్ ఆగి, ప్రారంభమై ఎట్టకేలకు పూర్తయింది. జడేజా అద్భుతమైన ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో చెన్నై జట్టు గొప్ప విజయాన్ని నమోదు చేసింది.
అదరగొట్టిన గుజరాత్ బ్యాటర్లు..
రెండో ఏడాది టైటిల్ గెలిచి తమ సత్తాను చాటాలని చూసిన గుజరాత్ జట్టు ఆటగాళ్లు ఫైనల్ మ్యాచ్ లో కూడా అదే విధమైన ప్రదర్శన కనబరిచారు. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. చెన్నై జట్టు బౌలర్లను చెడుగుడు ఆడేశారు. వృద్ధి మాన్ సాహా 39 బంతుల్లో ఒక సిక్సు, ఐదు ఫోర్లు సహాయంతో 138.46 స్ట్రైక్ రేటుతో 54 పరుగులు చేశాడు. అలాగే, టోర్నీ మొత్తం అద్భుతంగా రాణిస్తున్న సుబ్ మన్ గిల్ ఈ మ్యాచ్ లో కూడా రాణించాడు. 20 బంతుల్లో ఏడు ఫోర్లు సహాయంతో 195 స్ట్రైక్ రేటుతో 39 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్. 47 బంతుల్లో ఆరు సిక్సులు, ఎనిమిది ఫోర్లు సహాయంతో 204.26 స్ట్రైక్ రేటుతో 96 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించి పెట్టాడు. హార్దిక్ పాండ్యా 12 బంతుల్లో రెండు సిక్సులు సహాయంతో 175 స్ట్రైక్ రేటుతో 21 పరుగులు చేయడంతో గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. గుజరాత్ జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఓపెనర్లు ఈ మ్యాచ్ లో కూడా 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో జట్టుకు భారీ స్కోరు లభించినట్టు అయింది.
అద్భుతాన్ని చేసిన రవీంద్ర జడేజా..
చెన్నై జట్టు 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగాల్సి వచ్చింది. భారీ లక్ష్యమే అయినప్పటికీ చెన్నై జట్టులో మంచి ఆటగాళ్లు ఉండడంతో విజయంపై ఆ జట్టు ఆటగాళ్లతో పాటు అభిమానులు ధీమాను వ్యక్తం చేశారు. అయితే, పలుమార్లు మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను 15 ఓవర్లకు కుదించారు. డక్ వర్త్ లూయిస్ ప్రకారం 15 ఓవర్లలో లక్ష్యాన్ని 171గా ఎంపైర్లు నిర్ణయించారు. ఇది కూడా భారీ లక్ష్యమే. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఓవర్ కు 12 పరుగులు చొప్పున రన్ రేటుతో పరుగులు చేయడంతో చెన్నై జట్టు విజయం దిశగా ముందుకు సాగింది. రుతురాజ్ గైక్వాడ్ 16 బంతుల్లో 26 పరుగులు, డెవాన్ కాన్వే 25 బంతుల్లో 47 పరుగులు చేయడంతో 6.2 బంతుల్లోనే 74 పరుగులు చేసింది చెన్నై జట్టు.ఆ తరువాత వచ్చిన శివం దూబే 21 బంతుల్లో 32 పరుగులు, అజంక్య రహనే 13 బంతుల్లో 27 పరుగులు, అంబటి రాయుడు 8 బంతుల్లో 19 పరుగులు, రవీంద్ర జడేజా ఆరు బంతుల్లో 15 పరుగులు చేయడంతో చెన్నై జట్టు చివరి బంతికి విజయాన్ని నమోదు చేసింది. భారీ లక్ష్యం కావడంతో మొదటి బంతి నుంచే వేగంగా ఆడాల్సిన పరిస్థితి చెన్నై జట్టుకు ఏర్పడింది.
గుజరాత్ జట్టు బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చివరి ఓవర్ వరకు మ్యాచ్ వెళ్ళింది. చివరి ఓవర్ లో 13 పరుగులు చేస్తే చెన్నై జట్టు విజయం సాధిస్తుంది. ఈ దశలో శివం దూబే, రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు. బౌలింగ్ మోహిత్ శర్మ చేశాడు. తొలి బంతిని శివం దూబే ఆడగా పరుగు రాలేదు. రెండో బంతికి దూబే సింగిల్ రన్ తీశాడు. మూడో బంతికి జడేజా సింగిల్ తీశాడు. దీంతో చివరి మూడు బంతుల్లో 11 పరుగులు అవసరం ఏర్పడింది చెన్నై జట్టుకు. మొదటి మూడు బంతులు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ జట్టు విజయం సాధిస్తుందని అంతా భావించారు. నాలుగో బంతికి శివం దూబె సింగిల్ పరుగు తీశాడు. దీంతో చివరి రెండు బంతుల్లో పది పరుగులు చేయాల్సిన పరిస్థితి చెన్నై జట్టుకు ఏర్పడింది. ఐదో బంతిని జడేజా లాంగాన్ మీదుగా సిక్స్ బాధడంతో చివరి బంతికి నాలుగు పరుగులు అవసరమయ్యాయి. ఫైనల్ బంతిని లో ఫుల్ టాస్ వేశాడు మోహిత్ శర్మ. ఈ బంతిని షార్ట్ ఫైన్ దిశగా మళ్ళించడంతో ఫోర్ వచ్చింది. దీంతో చెన్నై జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. ఐదోసారి టైటిల్ గెలవడంతో చెన్నై జట్టు ఆనందానికి హద్దే లేకుండా పోయింది. అయితే, మ్యాచ్ ఆద్యంతం అత్యంత ఆసక్తికరంగా సాగింది. ఒక రకంగా చెప్పాలంటే గుజరాత్ టైటాన్స్ జట్టు ఈ మ్యాచ్ లో పోరాడి ఓడింది. గెలుపు ముంగిట ఒత్తిడికి తలొగ్గాల్సిన పరిస్థితి ఆ జట్టుకు ఏర్పడింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా డెవాన్ కాన్వే ఎంపిక కాగా, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా సుబ్ మన్ గిల్ ఎంపికయ్యాడు. విజయం ఎవరిని వరించినా గొప్ప మ్యాచ్ జరిగిందని అభిమానులు పేర్కొంటున్నారు. ఫైనల్ మ్యాచ్ స్థాయిలో కావాల్సిన ఎంటర్టైన్మెంట్ దొరికిందని అభిమానులు పేర్కొంటున్నారు.
మూడు రోజులు జరిగిన ఫైనల్ మ్యాచ్..
ఇక ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక మలుపులు తిరుగుతూ సాగింది. ఒకరకంగా చెప్పాలంటే మూడు రోజులపాటు ఫైనల్ మ్యాచ్ నిర్వహించినట్లు అయింది. ఆదివారం రాత్రి షెడ్యూల్ ప్రకారం ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉండగా వర్షం అంతరాయం కలిగించడంతో సోమవారానికి వాయిదా వేశారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు వరకు వాతావరణం అనుకూలించకపోవడంతో సోమవారం కూడా మ్యాచ్ ఆలస్యంగానే ప్రారంభమైంది. గుజరాత్ జట్టు ఇన్నింగ్స్ పూర్తయిన తర్వాత మళ్లీ వర్షం పడటంతో.. చెన్నై జట్టు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించడానికి అవాంతరం ఏర్పడింది. వర్షం తగ్గుముఖం పట్టడంతో 15 ఓవర్లకు మ్యాచ్ కుదించి నిర్వహించారు. మ్యాచ్ పూర్తయ్యేసరికి మంగళవారం తెల్లవారుజాము రెండు గంటలు అయింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆదివారం, సోమవారం, మంగళవారం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించినట్టు అయింది.
We are not crying, you are
The Legend continues to grow #TATAIPL | #Final | #CSKvGT | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/650x9lr2vH
— IndianPremierLeague (@IPL) May 30, 2023