Homeక్రీడలుYashasvi Jaiswal: పానీపూరి అమ్మిన యశస్వి.. ఎంత సాధించావయ్యా!

Yashasvi Jaiswal: పానీపూరి అమ్మిన యశస్వి.. ఎంత సాధించావయ్యా!

Yashasvi Jaiswal: పాండవులకు విలు విద్యలో శిక్షణ ఇచ్చిన ద్రోణాచార్యుడు.. శిక్షణలో భాగంగా ఓ రోజు పరీక్ష నిర్వహించాడట. ఓ చెట్ట వద్దకు తీసుకెళ్లి.. దానిపై కూర్చున్న పిట్టను కొట్టాలని సూచించాడట. విల్లు ఎక్కుపెట్టే ముందు అందరినీ ఓ ప్రశ్న అడిగాడట.. చెట్టుపైన ఏం కనిపిస్తుంది అని. అందరూ పిట్ట, చెట్టు, కొమ్మలు, ఆకులు అని సమాధానం చెప్పారట. అర్జునుడు మాత్రం చెట్టుపై ఉన్న పిట్ట కన్ను కనిపిస్తుందని సమాధానం చెప్పాడట. అంతేకాదు పిట్టను కొట్టాడు. ఇప్పుడు ఐపీఎల్‌లో రాజస్థాన్‌ తరపున ఆడుతున్న యశస్వి జైస్వాల్‌ కూడా ఇందుకు అతీతుడేం కాదు. చిన్నతనం నుంచి క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న యశస్వి.. ఎన్నటికైనా టీమిండియా తరఫున ఆడాలని తన 11 ఏళ్ల వయసులోనే డిసైడ్‌ అయ్యాడు. అందుకు పేదరికం, ఆర్థిక సమస్యలు ఏవీ అడ్డుకాలేదు. లక్ష్యం ముందు సవాళ్లు చిన్నబయాయి. భారత జాతీయ క్రికెట్‌ జట్టులో చోటే లక్ష్యంగా సత్తాచాటుతున్న యశస్వి జైస్వాల్‌ ఆకలితో పడుకున్న సందర్భాలు కోకొల్లలు. అతని కష్టాల జాబితా చూస్తే అంతు లేదు. కానీ అతను వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అన్ని బాధలు భరిస్తూ కూడా క్రికెటర్‌ కావాలనే తన లక్ష్యానికి మాత్రం దూరం కాలేదు. ఇప్పుడు అదే అతన్ని కరోడ్‌పతిని చేసింది. పానీపూరి అమ్మే స్టేజ్‌ నుంచి కోట్లకు పడగలు ఎత్తేలా చేసింది అతను నమ్ముకున్న క్రికెట్‌ జీవితం.

11 ఏళ్ల వయసులోనే
యశస్వి 11 ఏళ్ల వయసులోనే పెద్ద క్రికెటర్‌ కావాలనేది కల కన్నాడు. అది నెరవేర్చుకోవాలంటే స్వస్థలం భదోహీ (ఉత్తరప్రదేశ్‌)లో మాత్రం సాధ్యం కాదు. అందుకే దేనికైనా సిద్ధం అంటూ ‘చలో ముంబై’ అన్నాడు. సొంతూర్లో తండ్రిది చిన్న కిరాణా కొట్టు. ఇద్దరు పిల్లల పోషణ కూడా ఆయనకు భారంగా అనిపించి నీ ఇష్టం అనేశాడు. దూరపు బంధువొకరు ముంబైలో ఉంటే ఆయనను నమ్ముకొని బయల్దేరాడు. ఏదైనా పని ఇప్పిస్తానంటూ డెయిరీ దుకాణంలో నౌకరీ ఇప్పించిన ఆ బంధువు ఇల్లు మాత్రం రెండో మనిషికి అవకాశమే లేనంత చిన్నది! దాంతో తను పని చేస్తున్న చోటే రాత్రి కూడా పడుకోవడం మొదలు పెట్టాడు. అయితే రోజంతా పనికంటే క్రికెట్‌పైనే ఎక్కువ శ్రద్ధ పెట్టడంతో వారు పనికిరావంటూ పంపించేశారు. దాంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. మళ్లీ అదే బంధువు ఆదుకుంటూ తాను పని చేస్తున్న ‘ముస్లిం యునైటెడ్‌ క్లబ్‌’ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఒక మూలన ఉండే టెంట్‌లో ఆ అబ్బాయిని ఉంచేందుకు అనుమతి తీసుకున్నాడు.

రోటీలు చేశాడు..
కనీసం విద్యుత్‌ సౌకర్యం కూడా లేకుండా ప్లాస్టిక్‌ కవర్లతో కప్పి ఉంచిన ఆ టెంటే అప్పటి నుంచి యశస్వి ప్రపంచమైపోయింది. స్థానికంగా క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడటం, యునైటెడ్‌ క్లబ్‌కు సంబంధించి గ్రౌండ్స్‌మన్‌తోనే ఉంటూ వారికి రోటీలు చేసి పెట్టడం అతని రోజువారీ పని. తనకంటే వయసులో పెద్దవారితో క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడితే రూ.200–300 వచ్చేవి. వాటినే ఎంతో పొదుపుగా వాడుకోవాల్సి వచ్చేది.

ఉత్సవాల్లో పానీపూరి అమ్మి..
ముంబైలోని ఆజాద్‌ మైదాన్‌లో రామ్‌లీలా ఉత్సవాలు, ఇతర కార్యక్రమాలు జరిగినప్పుడు యశస్వి అక్కడ పానీ పూరీలు కూడా అమ్మాడు. తనతో ఆడే కుర్రాళ్లు ఆ సమయంలో పానీపూరీ తినేందుకు తన వద్దకు రావద్దని అతను కోరుకునే పరిస్థితి. టెంట్‌లో ఉంటున్న సమయంలో తాను ఆకలితో పడుకున్న రాత్రులు కూడా ఎన్నో ఉన్నాయి. కష్టాల జాబితా చూస్తే అంతు లేదు. కానీ అతను వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అన్ని బాధలు భరిస్తూ కూడా క్రికెటర్‌ కావాలనే తన లక్ష్యానికి మాత్రం దూరం కాలేదు.

సొంత టాలెంట్‌తో..
యశస్వి గాధలు ఆజాద్‌ మైదాన్‌లో చాలా మందికి చేరాయి. సహజ ప్రతిభావంతుడైన ఒక కుర్రాడిని అండగా నిలవాల్సిన అవసరం తెలిసింది. వీరిలో ఒక స్థానిక కోచ్‌ జ్వాలా సింగ్‌ అందరికంటే ముందుగా స్పందించాడు. ఈ కుర్రాడిని చేరదీసి ఆటను తీర్చిదిద్ది ముందుకు నడిపించాడు. అతని ప్రోత్సాహంతో ముందుకు వెళ్లిన యశస్వి స్థానిక లీగ్‌లలో పరుగుల వరద పారించాడు. గత ఐదేళ్లలో అన్ని స్థాయిల మ్యాచ్‌లలో కలిపి అతను దాదాపు 50 సెంచరీలు బాదాడు. వేర్వేరు వయసు విభాగాల్లో ఈ అసాధారణ ప్రదర్శన అతడికి ముంబై అండర్‌–19 జట్టులో, ఆ తర్వాత భారత అండర్‌–19 జట్టులో చోటు కల్పించింది.

ఇంగ్లండ్‌ టూర్‌లో నాలుగు హాఫ్‌ సెంచరీలు..
ఆగస్టులో ఇంగ్లండ్‌లో అండర్‌–19 ముక్కోణపు టోర్నీలో ఫైనల్లో సహా మొత్తం నాలుగు అర్ధ సెంచరీలతో జట్టుకు టైటిల్‌ అందించిన అతను ఇప్పుడు సీనియర్‌ స్థాయిలో కూడా సత్తా చాటుతున్నాడు. సరిగ్గా రెండేళ్ల క్రితం జరిగిన అండర్‌–19 ఆసియా కప్‌ టోర్నీతో యశస్వికి మొదటిసారి గుర్తింపు లభించింది. భారత్‌ విజేతగా నిలిచిన ఆ టోర్నీలో యశస్వి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ పురస్కారాన్ని అందుకున్నాడు. అప్పటి నుంచి అతని ఆట మరింత జోరందుకుంది. ముంబై సీనియర్‌ టీమ్‌కు ఎంపిక కావడం అతని కెరీర్‌లో కీలక మలుపు. ఐపీఎల్‌లో తాజా ప్రదర్శన యశస్విని భవిష్యత్‌ తారగా ఆశలు రేపేలా చేసింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular