King Maha Vajiralongkorn: వేలాది ఎకరాల భూమి.. వందల కిలోల బంగారం.. పదులకొద్ది భవంతులు.. లెక్కలేనంత ఆస్తి.. రాజసానికి పర్యాయపదం.. దర్పానికి నానార్థం.. అతడే వచిరలాంగ్ కాన్.. ఇంతటి ఆస్తి ఉందంటే అతడేమీ వ్యాపారి కాదు. ఓ దేశానికి రాజు. ఔను మీరు వెంటనే అది నిజమే. రాజు వెడలె రవితేజము లలరగ అన్నట్టు.. అనితర సాధ్యమైన సంపాదనతో ప్రపంచమే తన వైపు చూసుకునేలాగా చేసుకున్నాడు ఈ థాయ్ లాండ్ రాజు.
వచిరలాంగ్ కాన్ ను థాయ్ ప్రజలు కింగ్ రామా X గా పిలుస్తుంటారు. వచిరలాంగ్ కాన్ ది రాజ కుటుంబం. ఈయన పూర్వికులు థాయ్ లాండ్ ను పాలించుకుంటూ వస్తున్నారు. వంశపారంపర్యంగా వస్తున్న సంప్రదాయాన్ని వచిరలాంగ్ కాన్ పాటిస్తున్నాడు. ప్రస్తుతం అతడు థాయ్ లాండ్ రాజుగా కొనసాగుతున్నాడు. అయితే కేవలం ఇది మాత్రమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత సంపన్న రాజ కుటుంబానికి చెందిన రాజుగా ఆయన పేరు గడించాడు. ఇతడి సంపద విలువ మొత్తం మూడు లక్షల కోట్లకు పైచిలుకు ఉంటుంది. వేల ఎకరాల భూమి, 38 విమానాలు, వందల కార్లు, సుమారు 100 కోట్ల విలువైన వజ్రవైఢూర్యాలు, ఇలా ఎన్నో రకాల విలువైన వస్తువులు ఆయన వద్ద ఉన్నాయి. 16,210 ఎకరాల భూమి, థాయ్ దేశవ్యాప్తంగా 40 వేల భవంతులు ఉన్నాయి. వీటితోపాటు ప్రభుత్వ భవనాలు, షాపింగ్ మాల్స్ కూడా థాయ్ రాజు వద్ద ఉన్నాయి. థాయ్ లోని అతిపెద్ద సియామ్ కమర్షియల్ బ్యాంకులో 23% వాటా ఉంది. సియామ్ సిమెంట్ లోనూ 36.3% వాటా ఉంది.
వచిరలాంగ్ కాన్ కుటుంబానికి బోయింగ్, ఎయిర్ బస్ విమానాలు ఉన్నాయి. 21 హెలిక్యాప్టర్లతో కలిసి వీటి సంఖ్య 38 వరకు ఉంటుందని అక్కడి ప్రజలు చెబుతుంటారు.. వీటి వార్షిక నిర్వహణ కోసం రాజకుటుంబం ఏకంగా 524 కోట్లు ఖర్చు చేస్తుంది. ఇవి మాత్రమే కాకుండా అత్యంత విలాసవంతమైన మెర్సిడేజ్ బెంజ్, లిమజీన్ తో సహా అత్యంతలా లగ్జరీ కార్లు, బంగారు తాపడంతో కూడిన 52 పడవలు కూడా ఈ రాజ కుటుంబానికి ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 545 క్యారెట్ గోల్డెన్ జూబ్లీ డైమండ్ కూడా వీరి వద్ద ఉంది. దీని విలువ ఏకంగా 98 కోట్లకి పైగానే ఉంటుంది. 1782లో రాజ కుటుంబం కోసం నిర్మించిన భవనం విస్తీర్ణం 23 లక్షల అడుగుల్లో ఉంటుంది. అయితే ఇందులో రాజు నివసించడం లేదు. ఈ భవనంలో ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగుతున్నాయి.. కొంత ప్రాంతంలో మ్యూజియంలు ఏర్పాటు చేశారు. థాయ్ రాజు సంపాదన లో మాత్రమే కాదు… దాతృత్వ కార్యక్రమాలకు కూడా భారీగా విరాళాలు ఇస్తూ ఉంటారు. కోవిడ్ సమయంలో థాయిలాండ్ ప్రజల కోసం వందల కోట్లు ఖర్చు చేశారు. తన భవనాల్లో కొన్నింటిని కొవిడ్ క్వారంటైన్ సెంటర్లుగా మార్చారు. వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన కూలీలకు కూడా ఉచితంగా భోజన సదుపాయాలు కల్పించారు.