Lionel Messi Bodyguard: వర్తమాన ఫుట్ బాల్ చరిత్రలో మెస్సీ గురించి తెలియని వారుండరు. ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ ఆటగాడిగా మెస్సి కొనసాగుతున్నాడు. అతడిని అభిమానించే వారి సంఖ్య కోట్లల్లో ఉంటుంది. అతడు ఒక్కసారి చూస్తే చాలు, అతడి చేతిని ఒక్కసారి పట్టుకుంటే చాలు జీవితం ధన్యమైపోతుంది అనుకునేవాళ్లు బిలియన్ల లోనే ఉంటారు. కొంతకాలంగా మెస్సీ మియామీ జట్టుకు ఆడుతున్నాడు. ఆ జట్టుకు ఆడుతున్న క్రమంలో ఒక అభిమాని మెస్సి వైపు దూసుకు వచ్చాడు. ఇదే క్రమంలో ఫీల్డ్ అవతల ఉన్న మెస్సి అంగరక్షకుడు ఒక్క ఉదుటన పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ అభిమానిని తన రెండు చేతులతో అవలీలగా అవతలపడేశాడు. అంతేకాదు మెస్సీ కి అడ్డుగోడలా నిలబడ్డాడు. అతడు పరిగెత్తిన వేగాన్ని చూసి చాలామంది ఆశ్చర్యపోయారు .. వామ్మో ఇతడేంటి చిరుతపులిలా పరుగులు తీస్తున్నాడని ముక్కున వేలేసుకున్నారు. అయితే అతడు అలాంటి ఇలాంటి అంగరక్షకుడు కాదు.
అతని పేరు యస్సీనో చ్యూకో. అమెరికాలో నేవీలో సీల్ గా పనిచేశాడు. అమెరికా ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ పై యుద్ధాలు చేసినప్పుడు.. అందులో పాల్గొన్నాడు. యుద్ధ రంగంలో అత్యంత కీలకంగా పనిచేశాడు. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లో తీవ్రవాదులను కాల్చి చంపాడు. అంతేకాదు శారీరక దృఢత్వంలో యస్సీ కి యస్సే సాటి. అయితే యస్సీని బాడీగార్డ్ గా నియమించుకోవాలని మెస్సికి ఇంటర్ మియామీ క్లబ్ అధ్యక్షుడు డేవిడ్ బెక్ హమ్ సూచించాడు. దీంతో యస్సీని మెస్సీ బాడీగార్డ్ గా నియమించుకున్నాడు. నాటి నుంచి మైదానం బయట, లోపల మెస్సికి అడ్డుగోడలా ఉండటమే యస్సీ ప్రధాన బాధ్యత. అతడిని అభిమానుల తాకిడి నుంచి కాపాడటమే యస్సీ విధి.
ఫుట్ బాల్ మ్యాచ్ లు ముగిసిన తర్వాత మెసేజ్ కి షాపింగ్ చేయడం అలవాటు. కుటుంబంతో సరదాగా బయటికి వెళ్లడం ఇష్టం. ఆ సమయంలో అభిమానులు మెస్సిని చుట్టుముట్టకుండా చూసుకోవడం యస్సీ ప్రధాన బాధ్యత. అందుకే మెస్సీ ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు.. అతని కుటుంబం వెంట యస్సీ కచ్చితంగా ఉంటాడు. యస్సీ కి సోషల్ మీడియాలో విపరీతంగా అభిమానులు ఉన్నారు. అతడు గతంలో మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ పోటీలలో పాల్గొన్నాడు. తన వర్క్ అవుట్, ట్రైనింగ్ కు సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు ఇన్ స్టా లో పోస్ట్ చేస్తూ ఉంటాడు.. కండలు తిరిగిన దేహాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. అతడిని ఫిట్ నెస్ ప్రీక్ అని పిలుస్తుంటారు. బెక్ హమ్ సూచనతో యస్సీ ని బాడీగార్డ్ గా పెట్టుకున్నానని.. అతని వల్ల నాకు చాలా ప్రశాంతత లభిస్తోందని పలుమార్లు మెస్సీ వ్యాఖ్యానించాడు. యస్సీ బాడీగార్డ్ గా వ్యవహరిస్తున్నందుకు మెస్సీ మిలియన్ డాలర్ల వేతనం అతడికి చెల్లిస్తున్నాడు.