https://oktelugu.com/

Asian champions trophy : చైనా చిత్తు.. ఫైనల్ లో భారత్ అద్భుత విజయం.. మరోసారి ఛాంపియన్ గా నిలిచి చరిత్ర

అనుకున్నదే అయింది. సగటు భారత అభిమాని ఊహించిందే జరిగింది. చైనా జట్టుపై భారత్ దిగ్విజయాన్ని సాధించింది. హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ లో భారత జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 17, 2024 / 08:26 PM IST

    Asian champions trophy

    Follow us on

    Asian champions trophy : పురుషుల హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత్ మరోసారి విజేతగా నిలిచింది. డిపెండింగ్ ఛాంపియన్ హోదాను నిలబెట్టుకుంది. చైనా జట్టుతో మంగళవారం హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ 1-0 తేడాతో అద్భుతమైన విజయం సాధించి.. టైటిల్ దక్కించుకుంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీకి 13 సంవత్సరాల చరిత్ర ఉంటే.. అందులో భారత్ 5 టైటిల్స్ సొంతం చేసుకోవడం విశేషం. భారత జట్టు తరఫున జుగ్ రాజ్ సింగ్ ఆట 50వ నిమిషంలో గోల్ చేశాడు. దీంతో భారత్ 1-0 తేడాతో చైనాను చిత్తు చేసింది. హర్మన్ ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో భారత హాకీ జట్టు ఓటమి అనేదే లేకుండా దూసుకుపోయింది. చైనాను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. ప్రారంభం నుంచి ఫైనల్ వరకు దాదాపు 7 మ్యాచ్ లలో వరుసగా గెలుపులను సొంతం చేసుకుంది. పారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు కాంస్యం దక్కించుకుంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీలోనూ అదే దూకుడు కొనసాగించింది.

    గట్టి పోటీ ఇచ్చిన చైనా

    లీగ్ మ్యాచ్ లో భారత జట్టుతో తలపడిన చైనా తేలిపోయింది. ఫైనల్ మ్యాచ్లో మాత్రం టప్ ఫైట్ ఇచ్చింది. భారత జట్టు గోల్స్ చేయకుండా చైనా జట్టు పటిష్టంగా అడ్డుకుంది. మూడు క్వార్టర్స్ ముగిసిపోయినప్పటికీ అటు చెైనా, ఇటు భారత్ ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. మ్యాచ్ పది నిమిషాలలో ముగుస్తుందనుకుంటున్న తరుణంలో జుగ్ రాజ్ సింగ్ బంతిని గోల్ పోస్టులోకి మెరుపు వేగంతో కొట్టాడు. భారత జట్టుకు 1-0 లీడ్ అందించాడు.

    అవకాశాలు వృథా చేసుకుంది

    భారత జట్టుకు తొలి క్వార్టర్స్ లో అద్భుతమైన అవకాశాలు లభించాయి. అయితే వాటిని చైనా డిఫెన్స్ విభాగం పట్టిష్టంగా అడ్డుకున్నది. చివరికి భారత జట్టు పెనాల్టీ కార్నర్ ను వినియోగించుకోలేకపోయింది. ఇక రెండవ క్వార్టర్ ప్రారంభ సమయంలో భారత జట్టు ఆటగాడు మహమ్మద్ రహీల్ మ్యాచ్ రిఫరీ నుంచి గ్రీన్ కార్డ్ హెచ్చరిక కు గురికావాల్సి వచ్చింది. దీంతో అతడు మైదానానికి రెండు నిమిషాల పాటు దూరంగా ఉన్నాడు.

    గోల్స్ చేయకపోయినప్పటికీ..

    ఒకవైపు గోల్స్ రాకపోయినప్పటికీ భారత జట్టు మ్యాచ్ పై సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బంతిని తన ఆధీనంలో ఉంచుకుంది. పదేపదే ప్రత్యర్థి గోల్ పోస్ట్ పై దాడులు చేసింది. ఫస్టాఫ్ లో రెండు జట్లూ గోల్స్ చేయలేకపోయాయి. ఇక మూడవ క్వార్టర్లో చైనా జట్టుకు పెనాల్టీ లభించింది. అయితే దానిని భారత జట్టు సమర్థవంతంగా నిలువరించింది. ఇదే సమయంలో చైనా జట్టు ఆటగాళ్లు భారత గోల్ పోస్ట్ పై దాడులు చేయడం మొదలుపెట్టారు. అయితే ఒత్తిడికి గురికాకుండా భారత ఆటగాళ్లు తమ ప్రదర్శన కొనసాగించారు. చివరికి క్వార్టర్లో జుగ్ రాజ్ సింగ్ గోల్ సాధించడంతో భారత్ విజయం సాధించింది.