Ind Vs Pak Women World Cup: పహల్గాం ఘటన తర్వాత.. భారతదేశం పాకిస్తాన్ దేశాన్ని ఏమాత్రం ఉపేక్షించడం లేదు. సింధూ నది జలాల నుంచి మొదలు పెడితే క్రికెట్ వరకు ఏ విషయంలో కూడా తగ్గడం లేదు. గతంలో పాకిస్తాన్ రకరకాల విధానాలకు పాల్పడి అంతర్జాతీయంగా మన మీద ఒత్తిడి తీసుకొచ్చేది. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం అటువంటి ఒత్తిళ్లకు తలవంచడం లేదు. పైగా పాకిస్తాన్ దేశంపై ఎంత దాకా అయినా సరే వెళ్లడానికి సిద్ధంగా ఉంది. ఇటీవల భారత వాయుసేన అధిపతి పాకిస్తాన్ దేశానికి భీకరమైన హెచ్చరికలు పంపించారు. తిక్క తిక్క వేషాలు వేస్తే ప్రపంచ పటంలోనే పాకిస్తాన్ ఉండదని స్పష్టం చేశారు.
ఇటీవల ఆసియా కప్ జరిగినప్పుడు.. టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ పాకిస్తాన్ సారధికి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. లీగ్ నుంచి మొదలుపెడితే ఫైనల్ వరకు గెలిచిన ప్రతి మ్యాచ్ లోను టీమ్ ఇండియా ప్లేయర్లు పాకిస్తాన్ ప్లేయర్లతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. దీనిని పాకిస్తాన్ క్రికెట్ జట్టు రచ్చ రచ్చ చేసింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లింది. అయినప్పటికీ పాకిస్తాన్ కోరుకున్న విధంగా జరగలేదు. ఒకరకంగా పాకిస్తాన్ పరువు పోయింది. చివరికి ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధిపతి నుంచి భారత ప్లేయర్లు ట్రోఫీ ని తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. అతడు ట్రోఫీ ఇవ్వడానికి వస్తుంటే భారత ప్లేయర్లు మైదానంలో సరదాగా కాలక్షేపం చేశారు.
పురుషుల క్రికెటర్లు మాత్రమే కాదు మహిళ క్రికెటర్లు కూడా ఇప్పుడు అదే ధోరణి కొనసాగిస్తున్నారు. మహిళల వన్డే వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా, పాకిస్తాన్ కొలంబోలోని ప్రేమ దసరా స్టేడియంలో తలపడుతున్నాయి. ఈ క్రమంలో టాస్ వేసే ప్రక్రియ జరిగింది. టాస్ వేసే సమయంలో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. కనీసం ఆమెతో మాట కూడా మాట్లాడలేదు. టాస్ వేసే ప్రక్రియలో ఒకరి మొఖం ఒకరు చూసుకోలేదు. పాకిస్తాన్ కెప్టెన్ టాస్ నెగ్గింది. బౌలింగ్ ఎంచుకుంది. అయితే భారత ఓపెనర్లు పాకిస్తాన్ బౌలింగ్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు. ఈ కథనం రాసే సమయం వరకు టీమిండియా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 7.4 ఓవర్లలో 41 పరుగులు చేసింది. ప్రతీక (23), స్మృతి మందాన (17) పరుగులు చేశారు.