https://oktelugu.com/

IND VS BAN T20 Match : గ్వాలియర్లో హార్దిక్ పాండ్యా పెను విధ్వంసం.. బంగ్లాకు ఘోర పరాభవం.. భారత్ ఎంత తేడాతో గెలిచిందంటే..

గ్వాలియర్ మైదానంలో మోత మోగిపోయింది. హార్దిక్ పాండ్యా విధ్వంసానికి ప్రేక్షక పాత్రకు పరిమితమైంది. సిక్సర్లు, ఫోర్లు ఇష్టానుసారంగా కొడుతుంటే మైదానం చిన్న పోయింది. వెరసి బంగ్లాదేశ్ పై భారత్ మరో భారీ విజయాన్ని సాధించింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 7, 2024 / 07:39 AM IST

    IND VS BAN T20 Match

    Follow us on

    IND VS BAN T20 Match :  ఇప్పటికే టెస్ట్ సిరీస్ ను 2-0 తేడాతో భారత్ సొంతం చేసుకుంది. దీంతో టి20 టోర్నీ లోనూ అలాంటి ఫలితమే పునరావృతం అవుతుందని అభిమానులు అనుకున్నారు. వారు అనుకున్నట్టుగానే భారత్ అలాంటి ఫలితాన్నే సాధించింది. గ్వాలియర్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ పై భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 127 పరుగులకు కుప్పకూలింది. బంగ్లాదేశ్ ఆటగాళ్లలో హసన్ మిరాజ్ 35 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అర్ష్ దీప్ సింగ్ చెరో మూడు వికెట్లు దక్కించుకున్నారు. మాయాంక్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా తలా ఒక వికెట్ సొంతం చేసుకున్నారు.. మైదానంపై ఉన్న తేమను భారత బౌలర్లు సద్వినియోగం చేసుకున్నారు. పదునైన బంతులు వేస్తూ బంగ్లా బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. దీంతో బంగ్లా జట్టు భారత బౌలర్ల ఎదుట చేతులెత్తేసింది. 127 పరుగులకే ఆల్ అవుట్ అయింది.

    ఆడుతూ పాడుతూ

    లక్ష్యం చిన్నది కావడంతో భారత్ ఆడుతూ పాడుతూ మ్యాచ్ ముగించింది.. హార్దిక్ పాండ్యా (39) తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టి బంగ్లా బౌలర్లకు పీడకలను మిగిల్చాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (29), సంజు సాంసన్(29) దూకుడుగా బ్యాటింగ్ చేశారు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (16) దురదృష్టవశాత్తు రన్ అవుట్ అయ్యాడు. లేకుంటే మ్యాచ్ ముగిసే విధానం మరో విధంగా ఉండేది. సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్, అభిషేక్ శర్మ వేగంగా ఆడే క్రమంలో అవుటైనప్పటికీ.. మిగతా ఆటగాళ్లు నితీష్ రెడ్డి (16), హార్దిక్ పాండ్యా ఆకాశమహద్దుగా చెలరేగిపోయారు. టి20 వరల్డ్ కప్ తర్వాత .. హార్దిక్ పాండ్యా తన విశ్వరూపం చూపించాడు. బంగ్లా బౌలర్లతో దీర్ఘకాలం విరోధం ఉన్నట్టుగా ఆడాడు. బౌలర్ ఎవరనేది లెక్క పెట్టలేదు. 16 బంతులు ఎదుర్కొన్న అతడు ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 39 పరుగులు చేసి.. అజేయంగా నిలిచాడు. ఈ గెలుపు ద్వారా 3 t20 ల సిరీస్ లో భారత్ 1-0 తేడాతో ముందంజ వేసింది. ఇక ఈ రెండు జట్ల మధ్య రెండవ టి20 అక్టోబర్ 10 న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. కాగా, ఇప్పటికే బంగ్లాదేశ్ 2-0 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయింది. ఆ జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. భారత జట్టు ముందు తేలిపోయారు. ముఖ్యంగా యువ బౌలర్లు బంగ్లా జట్టును ముప్పు తిప్పలు పెట్టారు. అద్భుతమైన బంతులు వేస్తూ పరుగులు తీయకుండా చేశారు. అంతేకాదు వికెట్లు కూడా వెంట వెంటనే పడగొట్టారు. దీంతో బంగ్లా జట్టు ఏ దశలోనూ భారీ స్కోర్ చేసేలా కనిపించలేదు.