India Vs West Indies 2nd Test: వన్డేలలో, టి20 లలో టీమ్ ఇండియాకు తిరుగులేదు. గత కొంతకాలంగా ఆ రెండు ఫార్మాట్లలో టీమిండియా మొదటి స్థానంలో కొనసాగుతోంది. బలమైన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లను ఓడించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. కానీ సుదీర్ఘ ఫార్మాట్ విషయానికి వచ్చేసరికి టీమిండియా ఆ స్థాయిలో సత్తా చాట లేకపోతోంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్లో టీమిండియా ఐదు మ్యాచ్లు ఆడి.. రెండు ఓటములు.. రెండు విజయాలు సాధించింది. మరో మ్యాచ్ డ్రా అయింది.
ఈ నేపథ్యంలోనే టీం ఇండియా స్వదేశం వేదికగా వెస్టిండీస్ జట్టుతో రెండు టెస్టుల సిరీస్ ఆడింది. చివరి టెస్టులో కూడా విజయం సాధించి క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఇంతటి విజయం సాధించినప్పటికీ టీమ్ ఇండియా ర్యాంక్ మారలేదు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో టీమిండియా మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. శ్రీలంక రెండవ స్థానంలో కొనసాగుతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ 2025 -27 కాలానికి టీమిండియా ఇప్పటివరకు 7 టెస్టులు ఆడింది. ఇందులో నాలుగు విజయాలు సాధించింది. రెండు ఓటములు ఎదుర్కొంది. టీమిండియా ఖాతాలో ప్రస్తుతం 52 పాయింట్లు ఉన్నాయి.. పాయింట్ పర్సంటేజ్ 55.56 గా ఉంది. ఆస్ట్రేలియా మూడు టెస్టులు ఆడి.. మూడిట్లోనూ గెలిచింది. ఆస్ట్రేలియా ఖాతాలో 36 పాయింట్లు ఉన్నాయి. పాయింట్ల పర్సంటేజీ 100% గా ఉంది. శ్రీలంక రెండు టెస్టులు అడగా.. ఒకదాంట్లో విజయం.. మరొకదాన్ని డ్రా చేసుకొని రెండవ స్థానం. శ్రీలంక ఖాతాలో 16 పాయింట్లు ఉన్నాయి. పాయింట్లు పర్సంటేజ్ 66.67 గా ఉంది..
వెస్టిండీస్ జట్టుతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐదో రోజు విజయానికి 58 పరుగుల లక్ష్యంతో ఆట మొదలుపెట్టిన టీమిండియా మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపట్లోనే టార్గెట్ ఫినిష్ చేసింది. కేఎల్ రాహుల్ 58, జురెల్ ఆరు పరుగులు చేసి టీమ్ ఇండియాను గెలిపించారు. తద్వారా టీమిండియా ఈ సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. సారధిగా గిల్ కు తొలి టెస్ట్ సిరీస్ విజయం. ఈ టెస్టులో వెస్టిండీస్ జట్టు ముందుగా బౌలింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో టీం ఇండియా 518 పరుగులు చేసింది. వెస్టిండీస్ 248 పరుగులు చేసింది. ఫాలో ఆన్ లో వెస్టిండీస్ 390 రన్స్ చేసింది. వెస్టిండీస్ విధించిన టార్గెట్ ను టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి ఫినిష్ చేసింది. తద్వారా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి టెస్టును భారత్ ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది. టీమిండియా రెండో స్థానంలోకి రావాలంటే తదుపరి టెస్టులు మొత్తం గెలవాల్సి ఉంటుంది. ఇందులో ఒక ఓటమి కూడా ఎదురు కాకూడదు. అప్పుడే మెరుగైన నెట్ రన్ రేట్ తో టీమిండియా దూసుకుపోతుంది.