IND Vs SA: వికెట్ కాదు కదా.. కనీసం బ్యాటర్లను ఇబ్బంది కూడా పెట్టలేకపోతోంది బంతి. స్వింగ్ అవడం లేదు. యార్కర్ వేస్తే బ్యాట్ మీదకు వస్తోంది.. బంతి సుడి తిరగడం కాదు కదా.. కనీసం బౌన్స్ కూడా కాలేకపోతోంది. వాస్తవానికి ఇటువంటి పిచ్ ను ఇటీవల కాలంలో తాను చూడలేదని రవి శాస్త్రి లాంటి మాజీ క్రికెటర్ వ్యాఖ్యానించాడంటే గుహవాటిలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
గుహవాటిలో రెడ్ పిచ్ రూపొందించామని క్యూరేటర్ ప్రకటించారు. తొలి రోజు మధ్యాహ్నం వరకు పేస్ బౌలర్లకు.. ఆ తర్వాత స్పిన్ బౌలర్లకు సహకరిస్తుందని పేర్కొన్నాడు. కానీ అతడు చెప్పినట్టుగా పేస్ బౌలర్లకు సహకరించలేదు.. స్పిన్ బౌలర్లకు అనుకూలంగా మారలేదు. తొలి రోజు ఆరు వికెట్లు పడగొట్టిన టీమ్ ఇండియా.. లంచ్ విరామానికి ఒక్క వికెట్ మాత్రమే సాధించింది. బంతి ఏమాత్రం టర్న్ కాకపోవడంతో బౌలర్లు బంతులు వేసి అలసిపోతున్నారు. బంతి నేరుగా బ్యాట్ మీదకు వస్తుండడంతో దక్షిణాఫ్రికా బ్యాటర్లు పండగ చేసుకుంటున్నారు. 246/6 వద్ద ఉన్న దక్షిణాఫ్రికా.. ఏడో వికెట్ కు 88 పరుగులు జోడించింది. ఇక ఎనిమిదో వికెట్ కైతే ఏకంగా 94* పరుగులు జోడించింది. ముత్తుస్వామి (107*) తన కెరియర్లో తొలి సెంచరీ సాధించాడు. బౌలర్ జాన్సన్ (51*) పరుగులు చేశాడు. బుమ్రా నుంచి మొదలు పెడితే కులదీప్ యాదవ్ వరకు దక్షిణాఫ్రికా బ్యాటర్ల మీదికి ప్రయోగించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.
పిచ్ లో జీవం లేకపోవడంతో దక్షిణాఫ్రికా బ్యాటర్లు పండగ చేసుకుంటున్నారు. వాస్తవానికి ఈ పిచ్ మీద పచ్చ గడ్డిని అలానే ఉంచితే బాగుండేది. దానిని కత్తిరించడం వల్ల బంతికి ఏమాత్రం టర్న్ లభించడం లేదు. తొలి రోజు బౌలర్లకు కాస్త గ్రిప్ లభించినప్పటికీ.. రెండవ రోజు మాత్రం దారుణంగా ఉంది. ఎన్ని విధాలుగా బంతులు వేసినా ఉపయోగం లేకపోవడంతో టీమ్ ఇండియా బౌలర్లు అలసిపోతున్నారు.
ఈడెన్ గార్డెన్స్ లో రూపొందించిన పిచ్ స్పిన్ బౌలర్లకు అనుకూలంగా మారింది. పేస్ బౌలర్లు కూడా ఈ పిచ్ మీద వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసిపోవడంతో.. పిచ్ ను రెడ్ సాయిల్ తో రూపొందించారు. గడ్డిని కూడా కత్తిరించారు. దీంతో బౌలర్ల సహనానికి ఈ పిచ్ పరీక్ష పెడుతోంది. వాస్తవానికి ఈ మైదానంలో టెస్ట్ మ్యాచ్ అంటేనే చాలామంది నోర్లు వెళ్లబెట్టారు. అసలు ఈ గ్రౌండ్ మీద టెస్ట్ మ్యాచ్ ఏంటని ఆశ్చర్యపోయారు. “ఘనత వహించిన బీసీసీఐ దిక్కుమాలిన పెద్దలు ఈ మైదానం లో టెస్ట్ మ్యాచ్ ఆడించడమే పెద్ద హాస్యాస్పదం. పెళ్లిలకు, పెద్ద మనుషుల ఫంక్షన్లకు రెంట్ కు ఇవ్వాల్సిన గ్రౌండ్లో టెస్ట్ మ్యాచ్ ఆడిస్తే ఇలానే ఉంటుందని” సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనిని బట్టి గుహవాటి మైదానంలో ఎటువంటి పరిస్థితి నెలకొందో అర్థం చేసుకోవచ్చు.