Homeక్రీడలుక్రికెట్‌India vs South Africa : సౌతాఫ్రికాతో ఫైనల్ ఫైట్.. టీమిండియా చేయాల్సింది ఇదే

India vs South Africa : సౌతాఫ్రికాతో ఫైనల్ ఫైట్.. టీమిండియా చేయాల్సింది ఇదే

India vs South Africa : 2007లో.. ధోని సారథ్యంలో టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచింది. మరో పొట్టి ప్రపంచ కప్ కోసం 17 సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాచేలాగా ఎదురుచూస్తోంది. ఇక వన్డేల్లో విశ్వకప్ సొంతం చేసుకొని 13 సంవత్సరాలు దాటింది. ఈ గ్యాప్ లో రెండుసార్లు టైటిల్స్ గెలిచే అవకాశం వచ్చినప్పటికీ దురదృష్టం వెంటాడింది. ఈ నేపథ్యంలో ప్రపంచ కప్ ను మరోసారి దర్జాగా అందుకునేందుకు టీమిండియా కు అవకాశం వచ్చింది. అందుకే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ టైటిల్ పట్టేయాలని అభిమానులు కోరుతున్నారు. రోహిత్ సేన ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా పై గట్టి పట్టుదల ప్రదర్శించి, పొట్టి ప్రపంచ కప్ అందుకోవాలని కోరుకుంటున్నారు.. ఇక చోకర్స్ అనే ముద్రతో టి20 వరల్డ్ కప్ లో సంచలన ఆటతీరుతో ఫైనల్ లాగా వచ్చింది దక్షిణాఫ్రికా జట్టు. మరి ఈ రెండు జట్లలో విజేతగా నిలిచేది ఎవరనేది మరికొద్ది గంటల్లో తేలిపోతుంది.

ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా..

ఈ ప్రపంచ కప్ చరిత్రలో అటు టీమిండియా, ఇటు దక్షిణాఫ్రికా ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. టి20 ప్రపంచ కప్ చరిత్రలోనూ బహుశా ఇదే తొలిసారి. 2007లో ఆరంభ టి20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత భారత జట్టు పొట్టి ఫార్మాట్లో మరోసారి విజేతగా ఆవిర్భవించలేకపోయింది. 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచి.. గత ఏడాది అజేయంగా ఫైనల్ దాకా వెళ్లినప్పటికీ చివరికి నిరాశ ఎదురయింది. అయితే ఈ రెండు ఫార్మాట్లలో అభిమానుల నిరీక్షణకు తెరదించాలని రోహిత్ శర్మ ఆధ్వర్యంలోని టీమిండియా ఉంది. మరోవైపు ఏ ప్రపంచ కప్ లోనైనా దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. దాదాపు ఐదుసార్లు వన్డే, రెండుసార్లు t20 వరల్డ్ కప్ లో సెమీస్ దాకా వెళ్ళిపోయారు. అందులో ఓడిపోయి నిరాశతో వెనుదిరిగారు. అందుకే మార్క్రం సేన ఈ మ్యాచ్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.

ఎవరూ ఊహించలేదు

వాస్తవానికి దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఈ స్థాయిలో ప్రదర్శన చేస్తారని ఎవరూ ఊహించలేదు. టీమిండియా లాగా కాకుండా.. ఈ జట్టుకు గ్రూప్, సూపర్ -8 లో విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ.. అయినప్పటికీ ఒత్తిడిని దరిచేరనీయకుండా గట్టెక్కగలిగింది. చివరికి నేపాల్ లాంటి జట్టుపై ఒక్క పరుగు తేడాతో చివరి బంతికి గెలిచింది. దక్షిణాఫ్రికా జట్టు విజయాలలో బౌలర్లు కీలకపాత్ర పోషించారు. టి20 వరల్డ్ కప్ లో టాప్ -5 బ్యాటర్లలో ఒక దక్షిణాఫ్రికా ఆటగాడు లేకపోవడం విశేషం. డికాక్ (204) పర్వాలేదనిపిస్తున్నప్పటికీ, స్టబ్స్, మార్క్రం, మిల్లర్, క్లాసెన్ ఆశించినంత స్థాయిలో ఆటం లేదు. ఒకవేళ వీరు కనక నిలదొక్కుకుంటే భారత బౌలర్లకు కష్టాలు తప్పవు. మరోవైపు పేస్ బౌలర్లు నోకియా (13), రబాడ(12), స్పిన్నర్ శంసీ(11) ప్రత్యర్థి ఆటగాళ్లను ముప్పు తిప్పలు పెడుతున్నారు.. ముఖ్యంగా సెమీస్ పోరు లో ఆఫ్ఘనిస్తాన్ జట్టును కేవలం 56 పరుగులకే కట్టడి చేశారు. ఇక శనివారం జరిగే ఫైనల్ మ్యాచ్లో దుర్భేద్యంగా ఉన్న భారత బ్యాటింగ్ లైనప్ ను వీరు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది.

కోహ్లీ, దూబే ను మినహాయిస్తే.

ఇక ఈ టోర్నీలో భారత జట్టు నల్లేరు మీద నడకలాగా ప్రయాణ సాగిస్తోంది. గ్రూప్, సూపర్ -8, సెమీస్ మ్యాచ్లలో సత్తా చాటింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ వంటి జట్లను మట్టికరిపించింది. వాస్తవానికి ఈ జట్లపై పోరు హోరాహోరీగా సాగుతుందనుకుంటే.. భారత జట్టు పూర్తిగా మార్చింది. ఏకంగా ఏడు విజయాలతో ఫైనల్ దాకా వెళ్ళింది. కెనడాతో మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఒకవేళ వర్షం కురవకుంటే.. ఈ మ్యాచ్లు కూడా భారత్ గెలిచేది. స్లో మైదానాలపై తక్కువ స్కోర్లు నమోదయినప్పటికీ.. భారత బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేశారు.. పేస్, స్పిన్ అని తేడా లేకుండా సమస్య ప్రదర్శన చేశారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల పై ప్రతీకారం తీర్చుకొని భారత జట్టును టైటిల్ వేటకు మరింత చేరువగా తీసుకెళ్లారు. కెప్టెన్ రోహిత్ శర్మ సమర్థ నాయకత్వంతో పాటు, దూకుడయిన బ్యాటింగ్ తో ప్రత్యర్థి బౌలర్లకు సింహ స్వప్నం లాగా మారాడు. ఈ టోర్నీలో 248 పరుగులు చేసి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. మరో 33 పరుగులు చేస్తే టోర్నీ టాపర్ అవుతాడు. సూర్య కుమార్ యాదవ్ తన సహజ శైలని కొనసాగిస్తున్నాడు. హార్దిక్ పాండ్యా తన ఆల్ రౌండర్ ప్రతిభను ప్రదర్శిస్తున్నాడు. పంత్ ధనాధన్ ఆటతో ఆకట్టుకుంటున్నాడు. బ్యాటింగ్ భాగంలో ఓపెనర్ గా విరాట్ కోహ్లీ, మిడిల్ విభాగంలో శివం దూబే మాత్రమే నిరాశ పరుస్తున్నారు. ఐపీఎల్ లో అద్భుతంగా ఆడిన వీరిద్దరూ ఇక్కడ మాత్రం తేలిపోతున్నారు. ఫైనల్ మ్యాచ్లో విరాట్ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే దూబే స్థానంలో యశస్వి జైస్వాల్ లేదా సంజు సాంసన్ ను ఆడించే అవకాశం ఉంది. ఇక బౌలింగ్లో కులదీప్ యాదవ్, అక్షర్ పటేల్ అదరగొడుతున్నారు. అర్ష్ దీప్ సింగ్ 15, బుమ్రా 13 వికెట్లతో టాప్ ఫామ్ కొనసాగిస్తున్నారు. ఫైనల్ పోరులో భారత జట్టు అన్ని విభాగాలలో పైచేయి సాధిస్తే టైటిల్ నెగ్గడం పెద్ద కష్టం కాదు. ఇక ఐసిసి టోర్నమెంట్లో ఫైనల్ మ్యాచ్లో భారత్ – సౌత్ ఆఫ్రికా పోటీ పడటం ఇదే తొలిసారి.

పొంచి ఉన్న వాన ముప్పు..

కరేబియన్ దీవుల్లో ప్రస్తుతం వర్షాకాలం మొదలైంది. అక్కడ ప్రతిరోజు వర్షం కురుస్తోంది. శనివారం అక్కడ వర్షం కురిసేందుకు 78% అవకాశం ఉంది. రిజర్వ్ డే అయిన ఆదివారం కూడా వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు అక్కడి వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ శనివారం, ఆదివారం వర్షం కురిసి మ్యాచ్ నిర్వహించేందుకు అవకాశం లేకుంటే.. రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.. అయితే మ్యాచ్ నిర్వహించేందుకు 190 నిమిషాల అదనపు సమయం ఉంది కాబట్టి.. పెద్దగా ఇబ్బంది ఉండదని తెలుస్తోంది. ఒకవేళ విజేతను ఎవరనేది తేల్చేందుకు 10 ఓవర్ల మ్యాచ్ సరిపోతుంది.

తుది జట్ల అంచనా ఇలా

భారత్

రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్, బుమ్రా, అర్ష్ దీప్ సింగ్.

దక్షిణాఫ్రికా

మార్క్రం(కెప్టెన్) , క్లాసెన్, మిల్లర్, డికాక్, హెన్డ్రిక్స్, జాన్సెన్, కేశవ్ మహారాజ్, రబాడ, నోకియా, శంసి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular