India Vs South Africa fourth T20: టీమిండియా, సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న అయిదు టి20 మ్యాచ్ల సీరీస్లో నాలుగో మ్యాచ్ నిర్వహణ అసాధ్యంగా కనిపిస్తోంది. అదృష్టం బాగుంటే తప్ప ఈ మ్యాచ్ నిర్వహించే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే మైదానంలో ప్రేక్షకులు భారీగా ఉన్నారు.. వాస్తవానికి బుధవారం సాయంత్రం ఏడు గంటల 30 నిమిషాల నుంచి మ్యాచ్ మొదలు కావాల్సి ఉండేది. కానీ, ఊహించని విధంగా మ్యాచ్ నిర్వహణకు అడ్డంకులు ఏర్పడ్డాయి.. దీంతో మైదానంలో ఉన్న ప్రేక్షకులు నిరాశలో మునిగిపోయారు.
ఐదు టి 20 మ్యాచ్ల సీరీస్ ను మేనేజ్మెంట్ ఇప్పటివరకు రకరకాల మైదానాలలో నిర్వహించింది. కటక్ లో తొలి మ్యాచ్, చండీగఢ్ లో రెండవ మ్యాచ్, మూడో మ్యాచ్ ధర్మశాలలో జరిగింది. కటక్, ధర్మశాలలో జరిగిన మ్యాచ్లలో టీమిండియా విజయం సాధించింది. అయితే బుధవారం జరగాల్సిన లక్నో మ్యాచ్ రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం వర్షం లాంటిది కురువక పోయినప్పటికీ.. మ్యాచ్ జరగకపోవడానికి ప్రధాన కారణం విపరీతంగా పొగ మంచు కురవడమే. అందువల్లే మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోవచ్చని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
వాస్తవానికి మనదేశంలో శీతాకాలంలో ఉత్తర భారత దేశంలో విపరీతంగా మంచు కురుస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం హిమాలయ పర్వతాల నుంచి చల్లటి గాలులు వీస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా చలి తీవ్రత అధికంగా ఉంది. ఉత్తర భారత దేశంలో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని వేదికలు నిర్ణయించాల్సిన బిసిసిఐ.. అలాంటిదేమీ లేకుండానే లక్నోను ఎంపిక చేసింది. వాస్తవానికి ఈ టి20 సిరీస్ మ్యాచ్ లు మొత్తం ఉత్తర భారత దేశంలోనే జరుగుతున్నాయి. సహజంగానే చలికాలంలో ఉత్తర భారత దేశంలో ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ఇక రాత్రిపూట ప్రత్యేకంగా పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు.
ఇప్పటివరకు కటక్ నుంచి మొదలు పెడితే ధర్మశాల వరకు రాత్రిపూట డ్యూ అధికంగా ఉండడంతో బౌలర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇక బ్యాటర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. వాస్తవానికి ఇలాంటి వాతావరణంలో మ్యాచ్ లు నిర్వహించడం కత్తి మీద సాము లాంటిది. ఇక ప్లేయర్ల ఇబ్బందుల గురించి వివరించాల్సిన అవసరం లేదు.. ఏది ఏమైనప్పటికీ బీసీసీఐ తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల వేలకు వేలు పెట్టి టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకులు మ్యాచ్ చూడకుండానే ఇంటి దారి పట్టాల్సిన దుస్థితి ఏర్పడింది.