IND Vs SA: దక్షిణాఫ్రికా జట్టుతో టీమిండియా రెండు టెస్టుల సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా కోల్ కతా వేదికగా శుక్రవారం తొలి టెస్ట్ మొదలైంది. ఈ టెస్టు రకరకాల మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే రెండు జట్లు తొలి ఇన్నింగ్స్ ను ముగించాయి. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 159 పరుగులకు ఆల్ అవుట్ అయింది.. ఆ తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా 189 పరుగులకు ఇన్నింగ్స్ ముగించింది. పిచ్ నుంచి వస్తున్న సహకారాన్ని రెండు జట్ల బౌలర్లు అద్భుతంగా ఉపయోగించుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లలో రెండు జట్ల పేస్ బౌలర్లు అదరగొట్టారు. కీలకమైన వికెట్లు తీసి సంచలనం సృష్టించారు.
తొలి ఇన్నింగ్స్ ను 189 పరుగుల వద్ద ముగించిన టీమిండియా.. రెండవ ఇన్నింగ్స్ లో పర్యాటక జట్టుకు చుక్కలు చూపించడం మొదలుపెట్టింది. ముఖ్యంగా దక్షిణాఫ్రికాను 93 పరుగులకే 7 వికెట్లు కోల్పోయేలా చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో బవుమా(29), బాష్(1) ఉన్నారు. టీం ఇండియా బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు పడగొట్టాడు. కులదీప్ యాదవ్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. వీరిద్దరి బౌలింగ్ ను ఎదుర్కోవడంలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. కెప్టెన్ బవుమా మినహా మిగతా వారంతా తేలిపోయారు. తొలి ఇన్నింగ్స్ లో సత్తా చూపించిన రికెల్టన్, మార్క్రం, ముల్డర్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు.
ఈడెన్ గార్డెన్స్ లో పిచ్ పరిస్థితి చూస్తుంటే మూడో రోజే ఆట ముగిసే విధంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా 63 పరుగుల లీడ్ లో ఉంది. భారత బౌలర్లు గనుక ఆదివారం దూకుడు కొనసాగిస్తే.. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సమయం పట్టదు. ఇప్పటివరకు కేవలం 63 పరుగుల లీడ్ మాత్రమే ఉంది కాబట్టి… మహా అయితే టీమ్ ఇండియా ఎదుట 100 పరుగులకు మించి లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఉంచకపోవచ్చని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
భారత స్పిన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నారు. బంతి విపరీతంగా టర్న్ అవుతున్న నేపథ్యంలో.. బ్యాటర్లు నిలబడలేక పోతున్నారు. ఒకవేళ భారత జట్టు ముందు కఠినమైన టార్గెట్ విధించాలంటే దక్షిణాఫ్రికా అద్భుతం చేయాలి. బవుమాకు బ్యాటింగ్ పరంగా వంక పెట్టే అవకాశం లేకపోయినప్పటికీ.. అతనికి సహకరించే ప్లేయర్లు లేరు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు ఇబ్బంది పడక తప్పదు.
తొలి ఇన్నింగ్స్ లో టీమ్ ఇండియా బ్యాటర్లు అంతగా ఆకట్టుకోలేదు. సొంత మైదానంపై పరుగుల వరద పారించలేదు. కేవలం 189 పరుగులు మాత్రమే చేయగలిగారు. కెప్టెన్ గిల్ రిటైర్డ్ హర్ట్ గా వెను తిరిగాడు. దీంతో టీమ్ ఇండియా 189 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. గిల్ కు మెడ కండరాలు పట్టేయడంతో అతడు బ్యాటింగ్ చేయలేకపోయాడు.