ING Vs ENG: ఛాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఉత్కంఠ పెరిగిపోతోంది. టీమిండియా ఇప్పటివరకు టెస్టులు, టీ 20 లు ఆడి సందడి చేసింది. ఇప్పుడు అకస్మాత్తుగా గేర్ మార్చింది. 50 50 ఫైట్ కు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 6 నుంచి టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య 3 వన్డేల సిరీస్ మొదలుకానుంది. ఈ సిరీస్లో గెలిచి.. ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా మార్చుకోవాలని టీమ్ ఇండియా భావిస్తోంది.. 50 ఓవర్ల ఫార్మాట్ కు పూర్తిస్థాయిలో అలవాటు పడటం.. స్క్వాడ్ ను మరింత బలోపేతం చేసుకోవడం.. వ్యూహాలను మరింత పటిష్టంగా అమలు చేయడం వంటి వాటికి దీనిని మెరుగైన అవకాశంగా మలుచుకోవాలని భావిస్తోంది. భారత్ – ఇంగ్లాండ్ మధ్య గురువారం నుంచి వన్డే సిరీస్ మొదలవుతుంది. ఈ మ్యాచ్ నాగ్ పూర్ వేదికగా వీసీఏ స్టేడియంలో జరుగుతుంది. గురువారం మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాలకు మ్యాచ్ మొదలవుతుంది. రెండవ మ్యాచ్ ఫిబ్రవరి 9న ఒడిశా రాష్ట్రం కటక్ లోని బారాబతి స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ కూడా మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాలకు మొదలవుతుంది. ఇక ఈ సిరీస్ లో చివరి మ్యాచ్ ఫిబ్రవరి 12న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ కూడా మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాలకే మొదలవుతుంది. ఈ సిరీస్ లోని అన్ని మ్యాచ్లు స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్ 18 నెట్వర్క్ ఛానల్స్ లో ప్రసారమవుతాయి.
లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఇంగ్లాండ్ – భారత్ మధ్య జరిగే వన్డే సిరీస్ మ్యాచ్లు మొత్తం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ లో లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వెబ్సైట్లో కూడా లైవ్ టెలికాస్ట్ ను తిలకించవచ్చు.. ఈ సిరీస్ కోసం 14 మంది ఆటగాళ్లతో జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది.. కెప్టెన్ గా రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, వరుణ్ చక్రవర్తి, అర్ష్ దీప్ సింగ్ , హర్షిత్ రాణా, కులదీప్ యాదవ్ వంటి వారికి జట్టులో చోటు లభించింది.. అయితే వీళ్ళల్లో ఎవరు ప్లే -11 లో చోటు దక్కించుకుంటారో చూడాల్సి ఉంది.. ఇటీవల కాలంలో టీమిండియా టెస్ట్, టి20 ఫార్మాట్ ఎక్కువగా ఆడింది. గత ఏడాది శ్రీలంకతో టీమిండియా వన్డే సిరీస్ ఆడింది. ఆ తర్వాత ఇప్పటివరకు మరో సిరీస్ ఆడలేదు. బంగ్లాదేశ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తో టెస్ట్, టీ 20 సిరీస్ లు ఆడింది.. ఛాంపియన్స్ ట్రోఫీ మరికొద్ది రోజుల్లో జరగనుంది.. దానికంటే ముందు ఈ ట్రోఫీ జరుగుతున్న నేపథ్యంలో టీమిండియా సన్నాహకంగా మార్చుకుంటున్నది. రోహిత్, విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా ఫామ్ లో లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ను వారు తమ పూర్వఫామ్ అందుకోవాలని భావిస్తున్నారు..