India Vs England 3rd Test: ఉప్పల్ లో ఇంగ్లాండ్ షాక్ ఇస్తే.. వైజాగ్ విజయం ద్వారా భారత్ జట్టు సరైన సమాధానం చెప్పింది. దీంతో అందరి దృష్టి గురువారం రాజ్ కోట్ వేదికగా ప్రారంభమయ్యే మూడో టెస్ట్ పై పడింది.. ఐదు టెస్టుల సిరీస్ లో 1_1 తో రెండు జట్లు సమానంగా ఉన్నాయి. దీంతో మూడో టెస్ట్ లో ఎవరు గెలుస్తారోననే ఉత్కంఠ సగటు క్రికెట్ అభిమానుల్లో పెరిగిపోయింది.
వేధిస్తున్న గాయాల బెడద
భారత జట్టును గాయాల బెడద వేధిస్తోంది. స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ దూరం కావడంతో జట్టు తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. వీరిద్దరూ లేకపోవడంతో మిడిల్ ఆర్డర్ బలహీనంగా కనిపిస్తోంది.. వికెట్ కీపర్ కేఎస్ భరత్ విఫలమవుతుండడం కూడా జట్టుకు ఇబ్బందిగా మారుతోంది. శ్రేయాస్ అయ్యర్ గాయపడటంతో అతడి స్థానంలో రజిత్ పాటిధార్ వచ్చాడు. ఇక గిల్ రెండవ టెస్టులో సెంచరీ సాధించి భారత జట్టులో ఆశలు రేపుతున్నాడు. స్థానిక ఆటగాడు జడేజా జట్టులోకి రావడం కొంత సానుకూల అంశం. పైగా ఈ మైదానంపై అతడికి అంచనా ఉంది. మెరుగైన ట్రాక్ రికార్డు కూడా ఉంది. మొదటి, రెండు టెస్టుల్లో స్పిన్నర్లు పరుగులు సమర్పించుకోవడం భారత జట్టును ఆందోళనకు గురిచేస్తోంది..పేసర్ లలో బుమ్రా ను కనుక ఆడిస్తే అతడికి సిరాజ్ అండగా కొనసాగుతాడని జట్టు ఇప్పటికే ప్రకటించింది. ఇద్దరు పేస్ బౌలర్లతో వెళితే మాత్రం కులదీప్ యాదవ్ రిజర్వ్ బెంచ్ కే అయ్యే అవకాశం ఉంది. ఇక ఆల్రౌండర్లు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, అశ్విన్ తుది జట్టులో స్థానం సంపాదించుకున్నారు.
ఇంగ్లాండ్ జట్టుకు సంబంధించి
మొదటి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లాండ్ జట్టు.. రెండవ టెస్టులో ఆ ఒరవడి కొనసాగించలేకపోయింది. ముఖ్యంగా స్టార్ బ్యాట్స్మెన్ భారత పేస్ బౌలర్లకు దాసోహం అయ్యారు. రెండవ టెస్ట్ అనంతరం ఇంగ్లాండ్ జట్టు వారం పాటు అబుదాబి వెళ్లి విశ్రాంతి తీసుకుంది.. అయితే ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టులలో ఇంగ్లాండ్ జట్టు భారత జట్టుపై దూకుడు శైలి కనబరిచింది. ఈ టెస్టులో కూడా అదే ధోరణి ప్రదర్శించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అలా వారు దూకుడు ప్రదర్శించిన తర్వాత భారత జట్టు తప్పులు చేస్తుందని.. ఆ తర్వాత అసలైన ఆటను పరిచయం చేస్తామని ఇంగ్లాండ్ జట్టు చెబుతోంది. రాజ్ కోట్ లో జరిగే మ్యాచ్ ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కు 100వ టెస్ట్.. 2016లో స్టోక్స్ ఇక్కడ జరిగిన టెస్ట్ మ్యాచ్లో శతకం సాధించాడు. అతనితోపాటు జో రూట్ కూడా 100 పరుగులు సాధించాడు.. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు స్పిన్నర్ షోయబ్ బషీర్ స్థానంలో మార్క్ వుడ్ ను దించింది. తురుపు ముక్కలు క్రాలే, పోప్.. ఈ మ్యాచ్ లోనూ ఇంగ్లాండ్ జట్టుకు కీలకం కానున్నారు. ఐతే జో రూట్ ఆట తీరుపై ఇంగ్లాండ్ జట్టు ఇప్పటికీ ఆందోళనగా ఉంది. హార్ట్ లీ, రెహాన్ మెరుగ్గా బౌలింగ్ వేస్తుండడంతో ఇంగ్లాండ్ సంతృప్తికరంగా ఉంది. ఇక మ్యాచ్ ద్వారా ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 100 టెస్ట్ ఆడుతున్నాడు. భారత స్పిన్నర్ అశ్విన్ మరో వికెట్ పడగొడితే టెస్టుల్లో 500 వికెట్లు తీసిన బౌలర్ల క్లబ్లో చేరుతాడు.
జట్ల అంచనా ఇలా
రోహిత్ శర్మ (కెప్టెన్), జై స్వాల్, గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్, ధృవ్, జడేజా, అశ్విన్, అక్షర్, బుమ్రా, సిరాజ్.
ఇంగ్లాండ్
క్రాలే, డకెట్, పోప్, రూట్, బెయిర్ స్టో, బెన్ స్టోక్స్( కెప్టెన్), ఫోక్స్, రెహాన్ అహ్మద్, హార్ట్ లీ, మార్క్ ఉడ్, అండ్ర్సన్.