90 ఓవ‌ర్లలో 157 పరుగులే.. అయినా భ‌యం ఎందుకంటే?

టార్గెట్ 157 ప‌రుగులు. చేతిలో ఉన్న‌వి 9 వికెట్లు. మిగిలి ఉన్న‌ది ఒక రోజు(90 ఓవ‌ర్లు) ఆట‌! ఈ ల‌క్ష్యం ఛేదించ‌డం పెద్ద క‌ష్ట‌మా? ప్రత్యర్థి ఎవ‌రైనా కావొచ్చు.. టీమిండియా లాంటి జ‌ట్టుకు ఇది అసాధ్య‌మా? సాంకేతికంగా చూసిన‌ప్పుడు ఇది ఛేదించ‌లేని టార్గెట్ కానే కాదు. కానీ.. అభిమానులు మాత్రం ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఇంగ్లండ్ తో జ‌రుగుతున్న తొలి టెస్టులో భార‌త్ సాధించాల్సిన ల‌క్ష్యం ఇది. కొట్టేస్తారా లేదా? అన్న‌దే ఇప్పుడు ఆందోళ‌న‌. ఈ చిన్న ల‌క్ష్యానికి […]

Written By: Bhaskar, Updated On : August 8, 2021 2:45 pm
Follow us on

టార్గెట్ 157 ప‌రుగులు. చేతిలో ఉన్న‌వి 9 వికెట్లు. మిగిలి ఉన్న‌ది ఒక రోజు(90 ఓవ‌ర్లు) ఆట‌! ఈ ల‌క్ష్యం ఛేదించ‌డం పెద్ద క‌ష్ట‌మా? ప్రత్యర్థి ఎవ‌రైనా కావొచ్చు.. టీమిండియా లాంటి జ‌ట్టుకు ఇది అసాధ్య‌మా? సాంకేతికంగా చూసిన‌ప్పుడు ఇది ఛేదించ‌లేని టార్గెట్ కానే కాదు. కానీ.. అభిమానులు మాత్రం ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఇంగ్లండ్ తో జ‌రుగుతున్న తొలి టెస్టులో భార‌త్ సాధించాల్సిన ల‌క్ష్యం ఇది. కొట్టేస్తారా లేదా? అన్న‌దే ఇప్పుడు ఆందోళ‌న‌. ఈ చిన్న ల‌క్ష్యానికి కూడా ఎందుకు టెన్ష‌న్ ప‌డుతున్నార‌న్న‌ది ఇప్పుడు చూద్దాం.

విదేశాల్లో, బౌన్సీ పిచ్ ల‌లో భార‌త ఆట‌గాళ్లు బ్యాట్ ఎత్తేస్తార‌న్న‌ది అనాదిగా ఉన్న విమ‌ర్శ‌. విమ‌ర్శే కాదు.. వాస్త‌వం కూడా. స‌క్సెస్ ఫుల్ కెప్టెన్ ధోనీ అర్దంత‌రంగా కెప్టెన్సీని వ‌దిలేసుకోవ‌డానికి ఫాస్ట్ పిచ్ ల‌పై టీమిండియా ప్ర‌ద‌ర్శ‌నే కార‌ణ‌మ‌ని తెలిసిందే. విరాట్ కెప్టెన్సీలోనూ మార్పేమీ లేదు. మొన్న‌టి ఆస్ట్రేలియా సిరీస్ లో (కోహ్లీ ఇంటికి వెళ్లిన త‌ర్వాత‌) ఊహించ‌ని గెలుపు మిన‌హాయిస్తే.. బౌన్సీ పిచ్ ల మీద టీమిండి ఆట‌గాళ్ల ప్ర‌భావం పెద్ద‌గా లేదు. మొన్న ఇంగ్లండ్ లోనే జ‌రిగిన‌ వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ ఫైనల్లో ఓడిపోవ‌డాన్ని కూడా ఇక్క‌డ ప్ర‌స్తావించుకోవాల్సి ఉంటుంది.

ఇలాంటి ప‌రిస్థితుల్లో ఇంగ్లీష్ జ‌ట్టుతో టెస్టు సిరీస్ మొద‌లైంది. క్రికెట్ పుట్టినిల్లుతో హోరాహోరీగానే త‌ల‌ప‌డుతోంది భార‌త్. మొద‌టి నాలుగు రోజుల్లో టాప్ ప్లేయ‌ర్స్ గా ఉన్న‌వారు ఆశించిన విధంగా రాణించ‌లేదు. ఓపెన‌ర్ రాహుల్‌, లోయ‌ర్ ఆర్డ‌ర్ లో వ‌చ్చిన ర‌వీంద్ర జ‌డేజా మాత్ర‌మే మంచి స్కోర్ చేయ‌గ‌లిగారు. వీళ్లిద్ద‌రు కూడా ఆదుకోక‌పోయి ఉంటే.. ఇంగ్లండ్ ప్లేయ‌ర్స్ ఆటాడేసుకునేవాళ్లే.

ఈ ప‌రిస్థితికి కార‌ణం ఏంట‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన అవ‌స‌రం లేదు. బౌన్సీ పిచ్ లే కార‌ణం. చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్నా.. చివ‌రి రోజు గెలుపుకోసం 157 ప‌రుగులు మాత్ర‌మే చేయాల్సి ఉన్నా.. టెన్ష‌న్ ఫీల‌వ‌డానికి కార‌ణం బౌన్సీ పిచ్ లే. అంతేకాదు.. మ‌రో రెండు డ్రా బ్యాక్స్ కూడా టీమిండియాను, ఫ్యాన్స్ ను టెన్ష‌న్ పెడుతున్నాయి.

పిచ్ తో సంబంధం లేకుండా.. టెస్టులో నాలుగో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయ‌డం ఖ‌చ్చితంగా స‌వాలే. పిచ్ పూర్తిగా దెబ్బ‌తిని ఉంటుంది కాబ‌ట్టి బ్యాట్స్ మెన్ కు ఏమాత్రం స‌హ‌క‌రించ‌దు. అందుకే.. స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని కూడా ఛేదించ‌లేక చాలా జ‌ట్లు మ్యాచ్ ను కోల్పోతుంటాయి. ఇప్పుడు 90 ఓవ‌ర్ల‌లో 157 పరుగులు ఛేదిస్తుందా లేదా? అని భ‌య‌ప‌డ‌డానికి కార‌ణం ఇదే.

దీంతోపాటు మ‌రో స‌మ‌స్య ఏమంటే.. ఇంగ్లండ్ మీద భార‌త రికార్డు చెత్త‌గా ఉంది. గ‌తంలో ఆడిన టెస్టుల్లో టీమిండియా ఓట‌మినే మూట‌గ‌ట్టుకుంది. 1971లో, 1986లో, 2007లో మొత్తం మూడుసార్లే ఇంగ్లండ్ పై టార్గెట్ ను ఛేదించింది భార‌త్‌. మిగిలిన అన్ని సార్లూ ఓడిపోయింది. అందుకే.. విజ‌యం సాధ్య‌మవుతుందా? అనే ఆందోళ‌న కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం రోహిత్ శ‌ర్మ‌, పూజారా క్రీజులో ఉన్నారు. వీళ్ల‌లో ఏ ఒక్క‌రు నిల‌బ‌డ్డా.. మ్యాచ్ మ‌న చేతుల్లోకి వ‌చ్చేసిన‌ట్టే. మ‌రి, ఏం జ‌రుగుతుంది? చ‌రిత్ర సృష్టిస్తారా? పరాజయాన్ని రిపీట్ చేస్తారా అన్నది చూడాలి.