https://oktelugu.com/

India vs England : బజ్ బాల్ కు ఇంగ్లాండ్ జట్టు గుడ్ బాయ్ చెప్పినట్టేనా?

మరోవైపు జో రూట్ బ్యాటింగ్ ను మైఖేల్ వాన్, సునీల్ గవాస్కర్ లాంటివారు అభినందిస్తున్నారు. మరో వైపు బజ్ బాల్ అప్రోచ్ తో జాక్ క్రాలీ(42), బెన్ డక్కెట్(11), పోప్(0) బెయిర్ స్టో(38), బెన్ స్టోక్స్(3) విఫలమయ్యారు.

Written By: , Updated On : February 23, 2024 / 10:19 PM IST
Follow us on

India vs England : భారత్ లో పర్యటించే కంటే ముందు ఇంగ్లాండ్ జట్టు బజ్ బాల్ క్రికెట్ ఆడింది. వరుసగా సిరీస్ లు నెగ్గింది. దీంతో భారత్ లో కూడా బజ్ బాల్ క్రికెట్ ఆడతామని పర్యటనకు ముందు ఇంగ్లాండ్ జట్టు ప్రకటించింది. ఐదు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా హైదరాబాద్లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు గెలిచింది. బజ్ బాల్ విధానంలో ఆడి ఇంగ్లాండ్ జట్టు భారత్ పై విజయం సాధించింది.

మొదటి టెస్టులో ఓడిపోయిన తర్వాత ఇంగ్లాండ్ జట్టు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తే.. భారత్ లో ఆందోళన పెరిగింది. అయితే రెండవ టెస్టులో భారత్ విజృంభించడంతో ఇంగ్లాండ్ జట్టు ఓడిపోయింది. అప్పుడు బజ్ బాల్ పై విమర్శలు వచ్చినప్పటికీ ఇంగ్లాండ్ జట్టు వెనుకడుగు వేయలేదు. మూడో టెస్ట్ లోనూ భారత్ దూకుడుగా ఆడి ఇంగ్లాండ్ జట్టును భారీ తేడాతో ఓడించింది. అయినప్పటికీ ఇంగ్లాండ్ జట్టు బజ్ బాల్ ను విడిచి పెట్టేది లేదని స్పష్టం చేసింది. శుక్రవారం రాంచీ వేదికగా ప్రారంభమైన నాలుగవ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 57 పరుగులకు మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ కు వచ్చిన జో రూట్ ఆట స్వరూపాన్ని పూర్తిగా మార్చాడు.

గత రెండు టెస్టుల్లో పరాభవం ఎదురైన నేపథ్యంలో బజ్ బాల్ క్రికెట్ కు దూరంగా జరిగాడు. తన బజ్ బాల్ అప్రోచ్ కు వీడ్కోలు పలికాడు. సహజ శైలికి తగినట్టుగా ఆడి ఇంగ్లాండ్ జట్టును ఆదుకున్నాడు. తను టెస్ట్ బ్యాటింగ్ చేయడం వల్ల నాలుగో వికెట్ నుంచి ఏడో వికెట్ వరకు స్టోక్స్ తో మినహా వారందరితో కీలకమైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఫలితంగా ఇంగ్లాండ్ జట్టు 57 – 3 నుంచి 302-7 పటిష్ట స్థితికి చేరుకుంది. ఈ క్రమంలో జో రూట్ హాఫ్ సెంచరీ, సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం 106 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.

రూట్ ఆట తీరుపై మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ” రూట్ తన ఆట తీరు మార్చుకున్నాడు. బజ్ బాల్ కాదు.. ప్లే బాల్ కు కాస్త రెస్ట్ ఇవ్వాలి. ఒకవేళ భారత్ అద్భుతంగా ఇన్నింగ్స్ ఆరంభిస్తే.. ఇంగ్లాండ్ జట్టు అసాధారణంగా పోరాడే అవకాశం ఉంది. మొత్తానికి అభిమానులకు ఇది మంచి టెస్ట్ క్రికెట్ సందర్భం” అని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డివిలియర్స్ వ్యాఖ్యానించాడు. మరోవైపు జో రూట్ బ్యాటింగ్ ను మైఖేల్ వాన్, సునీల్ గవాస్కర్ లాంటివారు అభినందిస్తున్నారు. మరో వైపు బజ్ బాల్ అప్రోచ్ తో జాక్ క్రాలీ(42), బెన్ డక్కెట్(11), పోప్(0) బెయిర్ స్టో(38), బెన్ స్టోక్స్(3) విఫలమయ్యారు.