
India Vs England 5Th test: ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా (Team India) అదరగొడుతోంది. 50 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఓవల్ మైదానంలో జరిగిన 4వ టెస్టులో అద్వితీయమైన అసామాన విజయాన్ని అందుకుంది. సోమవారం ముగిసిన నాలుగో టెస్టులో భారత్ చరిత్ర సృష్టించింది. ఏకంగా 157 పరుగుల తేడాతో ఇంగ్లండ్ జట్టును చిత్తు చేసింది. 4వ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో వెనుకబడి ఓటమి బారి నుంచి గెలుపు దిశగా మారిన టీమిండియా పోరాటం అనన్యసామాన్యం అని చెప్పొచ్చు. ప్రత్యర్థి పేస్ బౌలింగ్ ను తట్టుకుంటూ ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ కు దిమ్మదిరిగే షాకులు ఇస్తూ జయకేతనం ఎగురవేసింది. అచ్చిరాని ఓవల్ మైదానంలో అసాధారణ విజయంతో ఐదు టెస్టుల సిరీస్ లో 2-1తో ఆధిక్యంలో నిలిచి సేఫ్ గా నిలిచింది. ఆఖరి టెస్టులో డ్రా చేసుకున్నా టీమిండియాదే సిరీస్.
ఐదో టెస్టు మిగిలి ఉండడంతో ఒత్తిడి అంతా ఇంగ్లండ్ పైనే. ఇండియా డ్రా చేసుకుంటే చాలు సిరీస్ సొంతం అవుతుంది. ఇంగ్లండ్ గడ్డపై 50 ఏళ్ల తర్వాత ఇండియా చారిత్రిక టెస్ట్ సిరీస్ గెలిచినట్టు అవుతుంది. ఇరు జట్ల మధ్య 5వ టెస్ట్ శుక్రవరం నుంచి మాంచెస్టర్ వేదికగా జరుగనుంది. ప్రస్తుతం ఈ విజయ ఉత్సాహంలో ఉన్న భారత్..రెండు రోజుల విరామం తర్వాత ఆఖరి టెస్టు కోసం సన్నాహాలు ప్రారంభించనుంది. రెట్టించిన ఉత్సాహంతో రెడీ అవుతోంది.
ఇక చివరి టెస్టులో బరిలోకి దిగే భారత్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఓవల్ లో సెంచరీ హీరో, భారత విజయంలో కీలక పాత్రధారి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయిన రోహిత్ శర్మ (Rohith Sharma) ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి. నాలుగో టెస్ట్ సందర్భంగా బ్యాటింగ్ చేస్తూ రోహిత్ శర్మ గాయపడ్డాడు. రోజంతా బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ తొడలు ఎర్రగా కమిలిపోయాయి. బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే థై ప్యాడ్స్ రాసుకొని ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్ల బంతులు బలంగా తాకడంతో రెండు తొడలకు గాయలయ్యాయి. ఆ గాయం తీవ్రత గురించి తెలియకపోయినప్పటికీ హిట్ మ్యాన్ రెండు రోజులు ఫీల్డింగ్ చేయలేదు. అతడికి విశ్రాంతి ఇస్తారని అనుకుంటున్నారు.
రోహిత్ టీమిండియాకు దూరం కావడం పెద్ద దెబ్బనే. ఎందుకంటే ప్రస్తుతం కోహ్లీ(Virat Kohli), రహానే, పంత్ , పూజారా ఎవరూ ఫామ్ లో లేరు. ఉన్నదల్లా ఓపెనర్లు రాహుల్, రోహిత్ లే. రోహిత్ 4వ టెస్టులో సెంచరీ కూడా చేశాడు. సో హిట్ మ్యాన్ లేకుంటే ఆఖరి టెస్టులో భారత్ కు కష్టకాలమే.. రోహిత్ స్థానంలో ఫృథ్వీ షా లేదా మయాంక్ అగర్వాల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇక వరుసగా విఫలం అవుతున్న రహానేపై వేటు పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఐదు ఇన్నింగ్స్ లో రహానే చేసింది కేవలం 107 పరుగులే కావడం గమనార్హం. ఇందులో లార్డ్స్ టెస్టులో మినహా ఏ మ్యాచ్ లోనే రాణించలేదు. రహానే దూరమైతే హనుమ విహారీ లేదా సూర్యకుమార్ యాదవ్ లలో ఒకరికి అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది.
ఇక నయావాల్ పూజారా కూడా గాయపడడం టీమిండియాకు పెద్దదెబ్బగా చెప్పొచ్చు. రోహిత్ శర్మతో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడిన పూజారా వికెట్ల మధ్య పరుగులు తీసే క్రమంలో మడమ మడత పడింది. ఆ నొప్పితోనే ఆటను కొనసాగించాడు. పెయిన్ కిల్లర్ తీసుకొని మ్యాచ్ ఆడాడు. గాయ కారణంగానే రెండు రోజులు పూజారా ఫీల్డింగ్ చేయలేదు. ఈ క్రమంలోనే చివరి టెస్టులో అతడు ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. అదే జరిగితే టెస్ట్ స్పెషలిస్ట్ హనుమా విహారి, సూర్యకుమార్ యాదవ్ లలో ఒకరు బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.
అశ్విన్ కు ఈ ఆఖరి టెస్టులో ప్లేస్ డౌటే అని చెప్పొచ్చు. బుమ్రా, ఉమేశ్, శార్ధుల్ గ్యారెంటీగా ఉంారు. సిరాజ్ స్థానంలో షమీ రావచ్చు. సిరాజ్ కు విశ్రాంతినిచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐదో టెస్టులో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.