India Vs England: హైదరాబాదులో గెలిచిన ఇంగ్లాండ్ ఆ తర్వాత వరుసగా రెండు ఓటములు ఎదుర్కొంది. హైదరాబాదులో ఓడిన భారత్.. వరుసగా రెండు విజయాలు దక్కించుకుంది. ఇప్పటికే మూడు టెస్టులు పూర్తయ్యాయి. రాంచి, ధర్మశాల మాత్రమే మిగిలి ఉన్నాయి.. భారత్ వీటిల్లో ఒక్క టెస్ట్ గెలిచినా సిరీస్ సొంతమవుతుంది. ఇంగ్లాండ్ సిరీస్ దక్కించుకోవాలంటే రాంచి, ధర్మశాలలో నెగ్గాలి. ఇలాంటి కీలకమైన సమీకరణాలున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య రాంచి వేదికగా నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది..
రాంచి టెస్ట్ కు గతంలో ఎన్నడూ లేనివిధంగా అత్యంత బలహీనమైన పేస్ బౌలింగ్ విభాగంతో భారత జట్టు బరిలోకి దిగుతోంది.. షమీ గాయం నుంచి కోలుకోకపోవడం.. బుమ్రా కు విశ్రాంతి ఇవ్వడంతో.. సిరాజ్ కు భారత పేస్ దళాన్ని నడిపించే అవకాశం కలిగింది.. ఆకాశ్ దీప్ అనే కొత్త కుర్రాడు ఈ మ్యాచ్ ద్వారా ఆరంగేట్రం చేసే అవకాశం ఉంది. పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ, మిడిల్ బలం రాహుల్ లేకపోయినప్పటికీ యువ ఆటగాళ్లు ఈ సిరీస్ లో దుమ్ము రేపుతున్నారు. యశస్వి జైస్వాల్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ లలో రెండు డబుల్ సెంచరీలతో కదం తొక్కాడు. 545 పరుగులు చేసి జోరు మీద ఉన్నాడు. సర్ఫ రాజ్, శుభ్ మన్ గిల్ కూడా కీలకమైన ఇన్నింగ్స్ లు ఆడుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుకు పెద్దన్న లాగా వ్యవహరిస్తున్నాడు. రవీంద్ర జడేజా అటు బంతి, ఇటు బ్యాట్ తో సత్తా చూపిస్తున్నాడు. ఈ మ్యాచ్లో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది.
బలహీనమైన పేస్ బౌలింగ్ ఉన్నప్పటికీ రాంచీ లో ఇండియా ఫేవరెట్ అనడానికి ప్రధాన కారణం యువ ఆటగాళ్లు తమకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడమే. యశస్వి జైస్వాల్ ఓపెనర్ గా భారత జట్టుకు కొండంత బలంగా ఉన్నాడు. ఇప్పటికే రెండు డబుక్ సెంచరీలు పూర్తి చేశాడు. సర్ఫరాజ్ ఆరంగేట్ర టెస్టులో రెండు అర్థ శతకాలతో ఆకట్టుకున్నాడు. ధృవ్ జురెల్ సత్తా చాటాడు. గిల్ కూడా టచ్ లోకి వచ్చాడు. రెండు వలస టెస్టులు గెలిచిన రోహిత్ సేన ఈ మ్యాచ్ గెలిచి సీరీస్ పట్టేయాలని చూస్తున్నది.
ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఓడిన ఇంగ్లాండ్ జట్టు..రాంచీ లో ఎలాగైనా గెలవాలనే కృత నిశ్చయంతో ఉంది.. అందుకే జట్టులో కొన్ని మార్పులు చేసింది. మార్క్ వుడ్ స్థానంలో ఒలీ రాబిన్ సన్ ను రెహాన్ అహ్మద్ స్థానంలో షోయబ్ బషీర్ కు స్థానం కల్పించింది. ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ జో రూట్ ఈ సిరీస్ లో అంతగా రాణించడం లేదు. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్ లో అతడు పదేపదే అవుట్ అవుతున్నాడు. అయితే ఈ మ్యాచ్లో అతడు సత్తా చూపుతాడా అనేది చూడాల్సి ఉంది. బజ్ బాల్ ఆట తీరు ప్రారంభించిన నాటి నుంచి ఇంగ్లాండ్ జట్టు ఇప్పటివరకు ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. అదే ఊపులో ఇంగ్లాండ్ హైదరాబాదులో తొలి టెస్ట్ గెలిచింది. కానీ ఆ తర్వాత విశాఖపట్నం, రాజ్ కోట్ లో వరుస విజయాలు సాధించింది. ఈ నేపథ్యంలో రాంచి టెస్ట్ గెలిచి సిరీస్ పై ఆశలు సజీవంగా నిలుపుకోవాలని ఇంగ్లాండ్ జట్టు భావిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన 3 టెస్ట్ మ్యాచ్ లలో దూకుడే మంత్రంగా ఇంగ్లాండ్ జట్టు చెలరేగింది. అయితే రాంచి మైదానాన్ని చూసి ఇంగ్లీష్ జట్టు తికమక పడుతోంది.. మరి బరిలోకి దిగిన తర్వాత ఎలాంటి ప్రదర్శన చేస్తుందో వేచి చూడాల్సి ఉంది.
జట్ల అంచనా ఇలా
భారత్
రోహిత్ శర్మ కెప్టెన్, యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, రజత్, సర్ఫ రాజ్, ధృవ్, జడేజా, అశ్విన్, కుల దీప్, సిరాజ్, ముఖేష్/ ఆకాష్ దీప్.
ఇంగ్లాండ్
స్టోక్స్ ( కెప్టెన్), క్రాలీ, డకెట్, రూట్, బెయిర్ స్టో, ఫోక్స్, హర్ట్ లీ, పోప్, రాబిన్ సన్, అండర్సన్.
రాంచీ పిచ్ పై పగుళ్లు ఉన్నాయి.. స్పిన్ బౌలింగ్ కు సహకరించే అవకాశాలు ఎక్కువ. గత మూడు మ్యాచ్ లు జరిగిన వేదికలతో పోల్చుకుంటే రాంచి పిచ్ చాలా విభిన్నం. మ్యాచ్ కు వర్షం అంతరాయం లేదు. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పేస్ బౌలర్ నాలుగు వికెట్లు తీస్తే 700 వికెట్ల మైలురాయి అందుకుంటాడు.. అతడి కంటే మురళీధరన్ (800), షేన్ వార్న్(708) ముందు స్థానంలో ఉన్నారు.