India Vs England: ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా భారత్ లో పర్యటిస్తున్న ఇంగ్లాండ్ జట్టు 1 – 2 తేడాతో వెనుకబడి ఉంది. హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించిన ఇంగ్లాండ్ జట్టు..ఆ తర్వాత విశాఖపట్నం, రాజ్ కోట్ వేదికల్లో జరిగిన మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ముఖ్యంగా రాజ్ కోట్ లో 434 పరుగుల భారీ తేడాతో భారత జట్టు పై ఓటమిపాలైంది. ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టు బెయిర్ స్టో, జో రూట్, బెన్ స్టోక్స్ నుంచి మెరుగైన ఇన్నింగ్స్ ఆశించింది. కానీ వారు ఈ టెస్ట్ సిరీస్ లో మెరుగైన పరుగులేమీ చేయలేదు. దీంతో ఇంగ్లాండ్ జట్టును మొదటి టెస్ట్ మ్యాచ్లో పోప్, మూడవ టెస్ట్ మ్యాచ్లో డకెట్ ఆదుకున్నారు. మొదటి టెస్ట్ మినహా మిగతా మ్యాచ్లలో ఇంగ్లాండ్ నెగ్గలేదు.
ఈ సిరీస్ ప్రారంభం కంటే ముందు బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ కంటే జో రూట్ మీదే ఇంగ్లాండ్ జట్టు ఎక్కువ ఆశలు పెంచుకుంది. కానీ అతడు ఆశలను వమ్ము చేశాడు. భారత జట్టుతో జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్ లలో ఆరు ఇన్నింగ్స్ లు ఆడి కేవలం 77 పరుగులు మాత్రమే చేశాడు. అండ్రూ ప్లింటాఫ్ తర్వాత ఆ స్థాయిలో ఆల్రౌండర్ గా పేరు తెచ్చుకుంటాడు అని భావిస్తున్న అతడు ఈ టెస్ట్ సిరీస్ లో తేలిపోవడం ఇంగ్లాండు జట్టుకు పెద్ద ప్రతిబంధకంగా నిలిచింది.. అతడి తీరు పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. శుక్రవారం నాలుగో టెస్టులో హాఫ్ సెంచరీ సాధించాడు. ఐదు వికెట్లు కోల్పోయి జట్టు పీకల లోతు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజ్ లోకి వచ్చిన అతడు తన మునుపటి ఆట తీరును ప్రదర్శించాడు.
జాక్ క్రావ్ లే మూడో వికెట్ గా జరిగిన తర్వాత జో రూట్ క్రీజ్ లోకి వచ్చాడు. అప్పటికి 11.3 ఓవర్లలో ఇంగ్లాండ్ జట్టు స్కోరు 57 పరుగులుగా ఉంది. గత టెస్ట్ మ్యాచ్ లలో భారీగా పరుగులు చేయని పక్షంలో జో రూట్ మీద ఇంగ్లాండ్ జట్టుకు పెద్దగా ఆశలేవీ లేవు. దీంతో తన మీద ఉన్న అపప్రదను తొలగించుకోవడం కోసం జో రూట్ మరో బ్యాటర్ బెయిర్ స్టో తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. అలా జట్టు స్కోరును 109 పరుగుల వద్దకు చేర్చేసరికి.. బెయిర్ స్టో ఔట్ అయ్యాడు. అతడు అవుట్ అయిన తర్వాత కెప్టెన్ బెన్ స్టోక్స్ క్రీజ్ లోకి వచ్చాడు. 3 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు. అప్పటికి ఇంగ్లాండ్ స్కోర్ 24.1 ఓవర్లకు 112.. ఈ దశలో వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ క్రీజ్ లోకి వచ్చాడు.
వీరిద్దరూ కలిసి భారత బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే జో రూట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఫోక్స్ తో కలిసి ఆరో వికెట్ కు ఇప్పటివరకు 86 పరుగులు జోడించాడు. 7 ఫోర్ల సహాయంతో రూట్ 67 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. మరో వైపు ఫోక్స్ 28 పరుగులతో ఇంగ్లాండ్ జట్టుకు అడ్డుగోడలా నిలబడ్డాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. ఆ రంగేట్ర బౌలర్ ఆకాష్ మూడు వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ తీశారు.