India Vs England: రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది.. టెస్టుల సిరీస్ లో భాగంగా 2_1 తో ముందంజ వేసింది. హైదరాబాద్ టెస్ట్ ను కోల్పోయిన భారత జట్టు విశాఖపట్నం, రాజ్ కోట్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లలో ఘనవిజయం సాధించింది. అటు బ్యాట్, ఇటు బంతి తో టీం ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించిన అతడు.. రెండవ ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసి.. ఇంగ్లాండ్ జట్టు పతనాన్ని శాసించాడు.
తొలి ఇన్నింగ్స్ లో కీలకమైన ఆటగాళ్లు పెవీలియన్ చేరుకున్నప్పటికీ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా సెంచరీలు చేయడంతో భారత్ 445 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ డక్కెట్ సెంచరీ సాయంతో 319 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ సాధించడంతో నాలుగు వికెట్ల నష్టానికి 430 పరుగులు చేసింది. రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో ఇంగ్లాండ్ జట్టు 557 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగింది.
లక్ష్యం కొండంత ఉన్న నేపథ్యంలో… ఇంగ్లాండ్ బ్యాటర్లు ఏ దశలోనూ దానిని చేదించేలాగా కనిపించలేదు. 15 పరుగులకు తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు.. ఏ దశలోనూ భారత బౌలర్లను ప్రతిఘటించలేకపోయింది. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించిన డక్కెట్ ఈ ఇన్నింగ్స్ లో తేలిపోయాడు. కేవలం 4 పరుగులు చేసి రన్ ఔట్ అయ్యాడు. క్రావ్ లే 11, పోప్ 3, రూట్ 7, బెయిర్ స్టో 4, బెన్ స్టోక్స్ 15, ఫోక్స్ 16, రేయాన్ అహ్మద్ 0, పరుగులకే అవుట్ అయ్యారు. ముఖ్యంగా జట్టు స్కోర్ 50 పరుగుల వద్ద ఉన్నప్పుడు రూట్, బెయిర్ స్టో , బెన్ స్టోక్స్ ఒకరి వెంట ఒకరు అవుట్ కావడం విశేషం. 8 వ వికెట్ కు హార్ట్ లీ, ఫోక్స్ నెలకొల్పిన 30 భాగస్వామ్యమే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో అత్యధికమంటే వారి ఆట తీరు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ జట్టులో మార్క్ వుడ్ 33 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అండర్సన్, మార్క్ వుడ్ చివరి వికెట్ కు 31 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
రాజ్ కోట్ లో లోకల్ బాయ్ రవీంద్ర జడేజా మెరుపులు మెరిపించాడు. ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించి ఆకట్టుకున్న అతడు.. రెండవ ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. పోప్, రూట్ , బెయిర్ స్టో, ఫోక్స్, మార్క్ వుడ్ వికెట్లు తీసి ఇంగ్లాండ్ జట్టును చావు దెబ్బతీశాడు. కులదీప్ యాదవ్ రెండు, అశ్విన్ 1, బుమ్రా 1 వికెట్ తీసి ఇంగ్లాండ్ జట్టును 122 పరుగులకే ఆల్ అవుట్ చేశారు. ఫలితంగా ఒకరోజు ఆట మిగిలి ఉండగానే 434 పరుగుల తేడాతో భారత్ జట్టు విజయం సాధించింది.