Ind vs Aus 4th Test: ఈ దశలో 8వ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ కు వచ్చాడు. వచ్చి రాగానే దూకుడు మొదలుపెట్టలేదు. ఆస్ట్రేలియా బౌలర్ల పై ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయలేదు. ముఖ్యంగా వారితో గొడవ పెట్టుకోలేదు. నిదానంగా ఆడుకుంటూ పోయాడు. వాషింగ్టన్ సుందర్ తో చాప కింద నీరు లాగా ఇన్నింగ్స్ ను విస్తరించాడు.. మధ్యలో వర్షం కురిసి ఏర్పర్చిన అంతరాయాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. వేగంగా దూసుకు వస్తున్న బంతులను డిఫెన్స్ ఆడాడు. చెత్త బంతులను బౌండరీ వైపు మళ్ళించాడు. ముఖ్యంగా స్టార్క్ బౌలింగ్ సూపర్ ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ చేసిన తీరు.. మూడవరోజు ఇన్నింగ్స్ కే హైలెట్.. అక్కడితో నితీష్ ఆగలేదు.. అలాగని దూకుడు పెంచలేదు. మళ్ళీ నిదానాన్ని నమ్ముకున్నాడు. డిఫెన్స్ ఆడుతూనే.. ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాడు చివరికి తన తొలి టెస్ట్ సెంచరీ పూర్తి చేశాడు. వాషింగ్టన్ సుందర్ తో కలిసి మెల్బోర్న్ మైదానంపై ఎనిమిదో వికెట్ కు 127 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించాడు. దుర్భేద్యమైన ఆస్ట్రేలియా బౌలింగ్ ను ఎదుర్కొంటూ.. వారు సంధిస్తున్న షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కొంటూ అదరగొట్టాడు నితీష్ కుమార్ రెడ్డి. మెల్బోర్న్ మైదానంలో సూపర్ సెంచరీ చేసి తనకు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని తనే అందించుకున్నాడు. 221/7 నుంచి 358/9 దాకా భారత్ ను తీసుకెళ్లాడు. ఒకవేళ బుమ్రా లాగా సిరాజ్ హ్యాండ్ ఇవ్వకుంటే.. నాలుగు రోజు కూడా నితీష్ కుమార్ రెడ్డి నుంచి మెరుగైన ఇన్నింగ్స్ ఆశించవచ్చు. ఇప్పటికైతే ఆస్ట్రేలియా కంటే భారత్ 116 పరుగులు వెనుకబడి ఉంది.
కళ్ళు చెదిరే సాహసం
ఆస్ట్రేలియాలో.. ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కోవడం అంత సులభం కాదు. ముఖ్యంగా పేస్ బౌలింగ్ కు సహకరించే మెల్బోర్న్ లాంటి మైదానంపై నిలబడటం అంత ఆషామాషి వ్యవహారం కాదు. అది ఎంత కష్టమో నితీష్ కంటే ముందు బ్యాటింగ్ చేసిన వారు చూపించారు. కానీ నితీష్ అలా చేయలేదు. కష్టంలో హ్యాండ్ ఇవ్వలేదు. ఆస్ట్రేలియా బౌలర్లకు వెన్ను చూపలేదు. నిదానంగా ఆడాడు. అవసరమైన సందర్భంలో దూకుడు కొనసాగించాడు. క్లిష్టమైన పరిస్థితుల్లో గోడలాగా నిలబడ్డాడు. అందువల్లే టీమిండియా మూడో రోజు ఆస్ట్రేలియా పై పై చేయి సాధించింది.. తొలి ఇన్నింగ్స్ తొలి రోజు 165 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడితే.. శనివారం నాటికి నాలుగు వికెట్ల కోల్పోయి 193 పరుగులు చేసింది. టీమిండియా సాధించిన 193 పరుగుల్లో.. నితీష్ కుమార్ రెడ్డి వే 105 పరుగులు ఉండడం విశేషం. దీనిని బట్టి అతడు బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. కాగా నితీష్ సూపర్ సెంచరీ చేసిన నేపథ్యంలో..” అద్భుతమైన శతకంతో ఆకట్టుకున్నావ్.. మెల్బోర్న్ మైదానానికి రుణపడి ఉండు” అంటూ క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.