Mohammad Rizwan: ఈ ట్రోఫీ పాకిస్తాన్ దేశంలో జరుగుతున్న నేపథ్యంలో.. అక్కడికి తమ జట్టును పంపించబోమని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది.. ఐసీసీకి పలుమార్లు ఇదే విషయాన్ని వివరించింది. భారత్ ఆడే మ్యాచ్ లను హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది. ఇక మొన్నటిదాకా బీసీసీఐ చైర్మన్ గా జై షా ఉన్నారు. ఆయన ఇప్పుడు ఏకంగా ఐసిసి చైర్మన్ గా ఎన్నికయ్యారు. దీంతో ఈ ట్రోఫీని హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెటర్లు రోజుకో తీరుగా ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో పాకిస్తాన్ వైట్ బాల్ టీం కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ కూడా చేరాడు. ఇటీవల అతడు కెప్టెన్ గా ఎన్నికయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తున్న నేపథ్యంలో.. భారత జట్టు తమ దేశానికి రావాలని అతడు కోరుతున్నాడు. భారత ఆటగాళ్లకు తాము అద్భుతమైన స్వాగతం పలుకుతామని.. జీవితంలో మర్చిపోలేని ఆతిథ్యం ఇస్తామని పేర్కొన్నాడు. పాకిస్తాన్ అభిమానులు భారత ఆటగాళ్లను విపరీతంగా ఆరాధిస్తారని.. వారి అభిమానాన్ని మన్నించైనా సరే పాక్ గడ్డపై భారత ఆటగాళ్లు అడుగుపెట్టాలని అతడు విన్నవించాడు. ” పాకిస్తాన్ అభిమానులు భారత ఆటగాళ్లను విపరీతంగా ఆరాధిస్తారు. 2023 వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు మేము భారత్ వెళ్లాం.. అక్కడి భారత అభిమానులు మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. వారు మమ్మల్ని అభిమానించారు. అదే సన్నివేశం కూడా మా దేశంలో పునరావృతం కావాలని మేం భావిస్తున్నాం. అందువల్లే భారత ఆటగాళ్లను మా దేశానికి రమ్మని కోరుతున్నాం. అయితే మా విజ్ఞప్తిని మన్నించి భారత జట్టు వస్తే మేము సంతోషిస్తాం. భారత్ మా దేశానికి వస్తుందా? రాదా? అనే విషయాలపై నాకు ఎటువంటి స్పష్టత లేదు. అయితే ఇందులో ఒకటి మాత్రం నిజం. పాకిస్తాన్ గడ్డపై భారత జట్టుకు అద్భుతమైన స్వాగతం లభిస్తుంది. మీరు లేకపోతే ఛాంపియన్స్ ట్రోఫీకి అర్థమే లేదు.. దయచేసి టీమిండియా మా దేశానికి రావాలని” రిజ్వాన్ వ్యాఖ్యానించాడు.
షెడ్యూల్ ప్రకారం..
ఐసీసీకి పాకిస్తాన్ వెల్లడించిన డ్రాఫ్ట్ ప్రకారం.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ వేదికగా జరుగుతుంది. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించే రావల్పిండి, కరాచీ, గడాఫీ మైదానాలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆధునికీకరిస్తోంది. దీనికోసం ఏకంగా 12.80 బిలియన్ పాకిస్తాన్ రూపాయలను ఖర్చు చేస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాలలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పోస్ట్ చేస్తోంది. ఇక ఇటీవల బాబర్ స్థానంలో మహమ్మద్ రిజ్వాన్ కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాడు. అతడు టి20, వన్డే జట్లకు సారధిగా ఉంటాడు. 2023 వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ దారుణమైన ఆట తీరు ప్రదర్శించింది. దీంతో జట్టు ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అజాం కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అనంతరం షాన్ మసూద్ కు టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతను అప్పగించారు. టి20 బాధ్యతలను అప్పగించారు. టెస్ట్ ఫార్మాట్ కు ఇప్పటికీ మసూద్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. టి20 జట్టు కెప్టెన్ గా ఉన్న షాహిన్ అఫ్రిదిని తొలగించారు. అనంతరం బాబర్ అజాం కు వైట్ బాల్ ఫార్మాట్ కెప్టెన్సీ అప్పగించారు. అయితే టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు దారుణమైన ఆట తీరు ప్రదర్శించిన నేపథ్యంలో బాబర్ తన కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు.