Ind W Vs Aus W Semi Final 2025 Shapali Verma: పడుతూ లేస్తూ.. వన్డే వరల్డ్ కప్ లో భారత మహిళల జట్టు(team India) సెమీఫైనల్ చేరుకుంది. ఆస్ట్రేలియా జట్టుతో సెమి ఫైనల్లో తలపడబోతోంది. లీగ్ దశలో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు ఓడిపోయింది. 300 కు మించి పరుగులు చేసినప్పటికీ.. ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో టీమిండియా విఫలమైంది. మరోసారి ఆ వైఫల్యాన్ని ప్రదర్శించకూడదని.. సమష్టిగా అదరగొట్టాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్ టీమ్ ఇండియాకు అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే స్వదేశంలో ఈ ట్రోఫీ జరుగుతున్న నేపథ్యంలో.. ఎలాగైనా సరే టీమ్ ఇండియా గెలిచి.. విజేతగా నిలవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.
సెమీఫైనల్ కు ముందు టీమ్ ఇండియా ఓపెనర్ ప్రతీక గాయపడింది. దీంతో ఆమె ఈ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఆమె స్థానంలో ఒకప్పటి భీకరమైన ఓపెనర్ షపాలి వర్మ(Shefali Verma)కు మేనేజ్మెంట్ అవకాశం వచ్చింది.. వాస్తవానికి వర్మ కూడా గాయంతోనే జట్టుకు దూరమైంది. దీనికి తోడు నిలకడలేని ఫామ్ వల్ల ఆమె తీవ్రంగా ఇబ్బంది పడింది.. కొంతకాలంగా దేశీయ టోర్నీలలో స్థిరమైన ప్రదర్శన చేస్తున్న నేపథ్యంలో.. మేనేజ్మెంట్ వర్మ మీద దృష్టి సారించింది. జట్టులోకి పిలుపు రావడంతో వర్మ మైదానంలో తీవ్రంగా కసరత్తు చేస్తూ కనిపించింది. కొన్నిసార్లు బ్యాటింగ్.. ఇంకొన్నిసార్లు ఫీల్డింగ్ లో సాధన చేసింది. నెట్స్ లో దాదాపు 50 నిమిషాల పాటు బ్యాటింగ్ సాధన చేసింది. షార్ట్ పిచ్ బంతులను పదేపదే ప్రాక్టీస్ చేసింది. కొన్ని సందర్భాలలో రివర్స్ స్విప్ షాట్లను కూడా ప్రయత్నించింది.. చివర్లో లాఫ్టెడ్ షాట్లను కూడా ఆమె ఆడేందుకు ప్రయత్నించింది.
చాలా రోజులుగా ఆమె జట్టుకు దూరంగా ఉంది. విధ్వంసకరమైన ఓపెనర్ గా పేరుపొందిన వర్మ ఐసీసీ ఉమెన్స్ వన్డే ఛాంపియన్షిప్ లో దారుణమైన ప్రదర్శన చేసింది. 14 ఇన్నింగ్స్ లలో కేవలం 277 పరుగులు మాత్రమే చేసింది. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఈ క్రమంలో ఆమె తోటి ఓపెనింగ్ భాగస్వామి స్మృతి మందాన మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ తన కెరియర్ లో అత్యంత ఉచ్చ స్థితిని చూస్తోంది. కానీ వర్మ మాత్రం నిలకడ లేకుండా ఆడుతుండడంతో జట్టుకు దూరమైంది. విలువైన అవకాశాలను కోల్పోయింది.
వర్మ తన పూర్వపు లయను అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. 2024 -25 మహిళల సీనియర్ క్రికెట్ వన్డే ట్రోఫీలో హర్యానా జట్టు తరపున ఆడిన వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఏడు ఇన్నింగ్స్ లలో ఏకంగా 527 పరుగులు చేసింది.. బెంగాల్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 197 పరుగులు చేసింది. కేవలం 115 బంతుల్లోనే ఆమె ఈ ఘనత అందుకోవడం విశేషం. అయితే అప్పుడు ఆమె దేశవాళి టోర్నీలో ఉండడంతో వెస్టిండీస్ జట్టుతో జరిగిన టోర్నీకి దూరంగా ఉంది.. ఐర్లాండ్ జట్టుతో జరిగే టోర్నీలో ఆడే అవకాశం వస్తుందనుకున్నప్పటికీ.. ఆమెకు మేనేజ్మెంట్ మొండి చేయి చూపింది. ఐర్లాండ్ జట్టుతో సిరీస్ జరుగుతున్నప్పుడు వర్మ సీనియర్ ఉమెన్స్ వన్డే ఛాలెంజర్స్ ట్రోఫీలో భారత A జట్టుకు నాయకత్వం వహించింది. ఆ టోర్నీలో 414 పరుగులు చేసి హైయెస్ట్ స్కోరర్ గా నిలిచింది.. కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న వర్మకు.. ఊహించని విధంగా మేనేజ్మెంట్ నుంచి పిలుపు వచ్చింది.. ఈ నేపథ్యంలో ఆమె తన పూర్వపు లయను ప్రదర్శిస్తే ఆస్ట్రేలియా జట్టుపై టీమిండియా ఆధిపత్యం కొనసాగిస్తుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం స్మృతి(Smriti mandhana) భీకరమైన ఫామ్ లో ఉంది.. స్మృతికి వర్మ తోడైతే తిరుగు ఉండదు. గతంలో వీరిద్దరూ టీమిండియా కు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించారు. అన్నింటికంటే ముఖ్యంగా ఓపెనింగ్ భాగస్వామ్యంతో పరుగుల వరద పారించారు.