Virat Kohli: వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తొలగించాక అతడిలో చాలా మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. టీం కోసం ఎంతో కష్టపడ్డా తనకు జరుగుతున్న అవమానాలపై మీడియా ముఖంగానే విరాట్ కోహ్లీ అప్పట్లో అసహనం వ్యక్తం చేయడం తెలిసిందే. అయితే సౌతాఫ్రికా వెళ్లి తొలి టెస్ట్ గెలిచాక విరాట్ కోహ్లీ అనూహ్యంగా రెండో టెస్టు మొదలు కావడానికి కేవలం గంట ముందు వైదొలిగాడు. ఇదిప్పుడు సంచలనమైంది.
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ లో విరాట్ కోహ్లీకి తిరుగులేని రికార్డ్ ఉంది. అక్కడ మూడు టెస్టులు ఆడిన కోహ్లీ ఏకంగా 310 పరుగులు చేశాడు. ఒక సెంచరీ కూడా ఉంది. నూతన సంవత్సరం 2022లోనైనా కోహ్లీ ఫాంలోకి వస్తాడని.. ఇక్కడ సెంచరీ చేస్తాడని అందరూ అనుకున్నారు.
కానీ సడెన్ గా రెండో టెస్టు టాస్ కు ముందు వరకూ కోహ్లీనే కెప్టెన్ అని అంతా అనుకున్నారు. కానీ కోహ్లీ టాక్ కు రాకుండా కేఎల్ రాహుల్ రావడంతో అంతా షాక్ అయ్యారు. టాస్ కు ముందు వరకూ విరాట్ కోహ్లీ రెండో టెస్టులో ఆడబోవట్లేదనే విషయాన్ని టీమిండియా మేనేజ్ మెంట్ గోప్యంగా ఉంచడం గమనార్హం. దాంతో సడెన్ గా కేఎల్ రాహుల్ టాస్ కు రావడంతో ‘కోహ్లీకి ఏమైంది’ అని అందరూ ఆరాతీయడం మొదలుపెట్టారు.
తొలిటెస్టులో ఘనవిజయం సాధించాక బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన విరాట్ కోహ్లీ రెండో టెస్టుకు ముందు వెన్నునొప్పితో బాధపడుతున్నాడని.. అందుకే తప్పుకున్నాడని తెలిసింది. సిరీస్ కు వైస్ కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ చేతికి పగ్గాలు అప్పజెప్పారు.
టాస్ కు వచ్చిన కేఎల్ రాహుల్ సైతం కోహ్లీ గైర్హాజరుపై స్పందించాడు. ‘దురదృష్టవశాత్తూ విరాట్ కోహ్లీకి వెన్నునొప్పి వచ్చింది. అతడు తర్వాత టెస్టుకు కోలుకుంటాడని ఆశిస్తున్నా’ అని చెప్పుకొచ్చాడు.
అయితే వన్డే కెప్టెన్సీ నుంచి తనను తొలగించడం.. రోహిత్ గైర్హాజరీలో తనకు కెప్టెన్సీ ఇవ్వకుండా కేఎల్ రాహుల్ కు అప్పగించడంతోనే విరాట్ మనస్థాపం చెందారని.. అందుకే టెస్ట్ కెప్టెన్సీ కూడా చేయాలని అనుకోవడం లేదని.. ఇలా సడెన్ గా వైదొలిగాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. కోహ్లీ నిరసన తెలుపడానికే ఇలా షాకిచ్చాడని.. టీమిండియా లోపల ఏదో జరుగుతుందన్న టాక్ వినిపిస్తోంది.
నిజానికి కోహ్లీ గైర్హాజరైతే రోహిత్ శర్మ కెప్టెన్సీ చేయాల్సింది. కేఎల్ రాహుల్ కేవలం ఓపెనర్ గానే ఎంపికయ్యాడు. కానీ కోహ్లీ గాయపడడం.. రోహిత్ గాయంతో ముందే వైదొలగడంతో ఆయాచితంగా ఏకంగా కేఎల్ రాహుల్ తన జీవితంలోనే టీమిండియా తరుఫున తొలి టెస్ట్ కు కెప్టెన్సీ వహించాడు.