Ind Vs SA Odi Squad 2025: దక్షిణాఫ్రికా తో జరిగిన రెండు టెస్టుల సిరీస్లో టీమిండియా దారుణంగా ఓడిపోయింది. కనీసం పోటీ ఇవ్వకుండా దక్షిణాఫ్రికా జట్టు ఎదుట చేతులెత్తేసింది. టీమిండియా ఆట తీరు పట్ల ఇంటా బయట తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలకు బలమైన సమాధానం చెప్పాలంటే టీమిండియా దక్షిణాఫ్రికా జట్టుతో త్వరలో జరిగే వన్డే, టీ 20 సిరీస్లలో సత్తా చాటాలి.
దక్షిణాఫ్రికా జట్టుతో వన్డే, టీ 20 సిరీస్ లో టీమిండియాలో బుమ్రా, గిల్, అయ్యర్, సిరాజ్ లాంటివారు లేరు. ఈ క్రమంలో కొంతమంది ప్లేయర్లకు మేనేజ్మెంట్ అవకాశం వచ్చింది. టీమిండియాలో అవకాశం లభించడం అంటే అంత ఈజీ కాదు. వచ్చిన అవకాశాలను ఈ ప్లేయర్లు సద్వినియోగం చేసుకోవాలి. టెస్ట్ సిరీస్ ఓటమికి వన్డే, టీ 20 సిరీస్ లో విజయాలు సాధించి లేపనం పూయాలి.
రవీంద్ర జడేజా
రవీంద్ర జడేజా కు ఒకప్పుడు జట్టులో స్థిరమైన స్థానం ఉండేది. ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిన జట్టులో అతడు కీలక సభ్యుడు. అయినప్పటికీ అతడిని ఆస్ట్రేలియా సిరీస్ కు మేనేజ్మెంట్ దూరం పెట్టింది. ప్రస్తుత దక్షిణాఫ్రికా సిరీస్లో అతనికి అవకాశం లభించింది. ప్రస్తుతం జడ్డు 36వ పడిలో ఉన్నాడు. ఇటీవల అతని బౌలింగ్లో పదును తగ్గిందని విమర్శలు వినిపిస్తున్నాయి. 2027 వరల్డ్ కప్ ను లక్షంగా పెట్టుకున్న టీమిండియా.. రవీంద్ర జడేజా స్థానాన్ని భర్తీ చేయడానికి అక్షర్, సుందర్ వైపు చూస్తోంది.. దక్షిణాఫ్రికా సిరీస్ కు అక్షర్ కు మేనేజ్మెంట్ రెస్ట్ ఇచ్చింది. ఒకవేళ రవీంద్ర జడేజా ఈ సిరీస్ లో కనుక ఆకట్టుకోలేక పోతే వన్డేలలో అతని స్థానం ప్రశ్నార్ధకమవుతుంది.
అర్షదీప్ సింగ్
దక్షిణాఫ్రికా సిరీస్లో టీమిండియా బౌలింగ్ స్క్వాడ్ ను అర్షదీప్ సింగ్ ముందుండి నడిపించబోతున్నాడు. టి20 లలో అర్షదీప్ సింగ్ కు తిరుగులేదు. వన్డేలలో 11 మ్యాచులు ఆడిన అర్షదీప్ సింగ్.. 17 వికెట్లు పడగొట్టాడు.. ప్రస్తుత సిరీస్లో గనుక అతడు అదరగొడితే స్థానం స్థిరంగా ఉంటుంది.
హర్షిత్ రాణా
గంభీర్ సపోర్ట్ తో టీమిండియాలో చోటు సంపాదించుకుంటున్న హర్షిత్..అర్షదీప్ సింగ్ తో బంతిని పంచుకోబోతున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్ లో హర్షిత్ రాణా అంతంతమాత్రంగా రాణించాడు. ఈ సిరీస్లో అతడు తన ముద్ర వేసుకోవాల్సి ఉంది. లేకపోతే జట్టులో స్థానం ప్రశ్నార్ధకమవుతుంది
ప్రసిద్ కృష్ణ
ఐపీఎల్ లో ప్రసిద్ అదరగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్లో ఏమాత్రం రాణించలేకపోయాడు. ఈ క్రమంలో వచ్చిన అవకాశాన్ని అతను ఎంత మాత్రం ఉపయోగించుకుంటాడనేది చూడాల్సి ఉంది
యశస్వి జైస్వాల్
మెరుపు వేగంతో బ్యాటింగ్ చేస్తాడు జైస్వాల్. అతడికి ఫార్మాట్ తో సంబంధం ఉండదు. వేగంగా పరుగులు తీయడం పైనే అతడు దృష్టి పెడతాడు.. అయితే అతడికి టి20, వన్డేలలో మాత్రం చెప్పుకునే స్థాయిలో అవకాశాలు రాలేదు. ఇప్పుడు దక్షిణాఫ్రికా సిరీస్ ద్వారా అతనికి అవకాశం వచ్చింది. రోహిత్తో కలిసి అతడు ఓపెనింగ్ జోడిగా మైదానంలో అడుగుపెట్టబోతున్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్ లో అతడు సత్తా చూపిస్తే జట్టులో స్థానం సుస్థిరంగా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.