IND Vs SA: టెస్ట్ సిరీస్ ఓడిపోయింది. వన్డే సిరీస్ గెలిచింది. ఒక రకంగా టీమ్ ఇండియా రివెంజ్ తీర్చుకున్నప్పటికీ.. అభిమానులలో దక్షిణాఫ్రికా జట్టు మీద ఇంకా కోపం ఉంది.. గట్టి సమాధానం చెప్పాలని.. టెస్ట్ సిరీస్ ఓటమికి ఇంకా బలమైన ప్రతీకారం తీర్చుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.
టీమిండియా, సౌత్ ఆఫ్రికా మధ్య మంగళవారం నుంచి ఐదు టి20 మ్యాచ్ల సీరీస్ మొదలవుతుంది. ఒరిస్సాలోని కటక్ వేదికగా టి20 సిరీస్ మొదలవుతుంది. తొలి మ్యాచ్ సాయంత్రం 7 గంటల నుంచి రెండు జట్ల మధ్య మొదలవుతుంది. ఎప్పటిలాగే ఈ మ్యాచ్లో కూడా టాస్ విన్నింగ్ రోల్ ప్లే చేయనుంది. ఇప్పటికే రెండు జట్లు కటక్ చేరుకున్నాయి. కటక్ మైదానం హై స్కోరింగ్ కు సపోర్ట్ చేస్తుంది. అందువల్లే ఈ మైదానం లో మరోసారి భారీగా పరుగులు నమోదు అవుతాయని క్యూరేటర్లు చెబుతున్నారు. రెండు జట్లలో కూడా భీకరమైన ప్లేయర్లు ఉన్నారు. వీరంతా కూడా భారీగా పరుగులు చేయగల సమర్థులు.. మరోవైపు టీమ్ ఇండియా సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలో ఇంతవరకు ఒక్క టి20 సిరీస్ కూడా కోల్పోలేదు. చివరికి దక్షిణాఫ్రికాలో టి20 సిరీస్ ఆడిన టీమిండియా.. ఆ జట్టుపై వరుస విజయాలు సాధించి సిరీస్ సొంతం చేసుకుంది.
కటక్ మైదానంలో టీమిండియా కు మంచి చరిత్ర లేదు. ఈ మైదానంలో టీమిండియా దక్షిణాఫ్రికా జట్టుతో 2015, 2022లో పోటీపడింది. రెండుసార్లు కూడా ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే మ్యాచ్లో ఎలాగైనా గెలిచి, గత చెత్త రికార్డుకు చరమగీతం పాడాలని భారత అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. వాస్తవానికి ఈ పిచ్ ను ఎంపిక చేయడం పట్ల అభిమానులు కూడా అంతగా సానుకూల దృక్పథంతో లేరు. ఎందుకంటే ఈ పిచ్ మీద టీమిండియా రెండుసార్లు ఓడిపోవడం అభిమానులకు ఏమాత్రం మింగుడు పడడం లేదు. పైగా దక్షిణాఫ్రికా తో రెండుసార్లు ఓడిపోయిన ఈ మైదానంలో మరోసారి టీమిండియా పోటీ పడుతుండడం ఒక రకంగా అభిమానుల్లో కలవరాన్ని కలిగిస్తోంది. ఈ పిచ్ మీద సరికొత్త ఆట తీరు ప్రదర్శించి.. అదరగొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు..
కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అంతగా ఫామ్ లో లేడు. కొంతకాలంగా అతని బ్యాట్ నుంచి ఆశించిన స్థాయిలో పరుగులు రావడం లేదు. చివరికి ఆస్ట్రేలియా సిరీస్ లో కూడా సూర్య కుమార్ యాదవ్ తేలిపోయాడు. స్వదేశంలో జరుగుతున్న టి20 సిరీస్లో కచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లోకి రావాలని అభిమానులు భావిస్తున్నారు. ఎందుకంటే త్వరలో మన దేశం వేదికగా టి20 వరల్డ్ కప్ జరగనుంది. దానికి సన్నాహకంగా ఈ సిరీస్ ను భావిస్తున్నారు. అలాంటప్పుడు సూర్య కుమార్ యాదవ్ కచ్చితంగా ఫామ్ లోకి వచ్చి.. తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి.