IND Vs NZ Surya Kumar Yadav: బంతి ఎలాంటిదైనా సరే గట్టిగా కొడతాడు. బౌలర్ ఎవరైనా సరే చుక్కలు చూపిస్తాడు. మైదానం ఎలా ఉన్నా సరే రెచ్చిపోతాడు. అందువల్లే అతడిని మిస్టర్ 360 అని పిలుస్తుంటారు. మిగతా ఫార్మాట్ ల గురించి అతడు పట్టించుకోడు. టి20 లో మాత్రం పూనకం వచ్చినట్టుగా బ్యాటింగ్ చేస్తుంటాడు. స్వదేశం, విదేశం అని తేడా ఉండదు.. ఎక్కడైనా సరే నా థియరీ ఇంతే అన్నట్టుగా బ్యాటింగ్ చేస్తుంటాడు.
అటువంటి సూర్య కుమార్ యాదవ్ కొంతకాలంగా సరిగ్గా ఆడటం లేదు. నాయకుడిగా జట్టుకు వరుస ట్రోఫీలు అందిస్తున్నప్పటికీ.. వ్యక్తిగతంగా అతని ప్రదర్శన అంత గొప్పగా లేదు. టి20 లో వేగవంతంగా సెంచరీలు చేసిన అతడి సామర్థ్యం రోజు రోజుకు చేవగారి పోతుంది. టి20 వరల్డ్ కప్ ముందున్న నేపథ్యంలో అతడు సరిగ్గా ఆడ లేకపోవడం విమర్శలకు కారణమైంది. ఇదే క్రమంలో అతడు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనికి తోడు న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న ప్రస్తుత టి20 సిరీస్లో తొలి మ్యాచ్లో 32 పరుగులు చేశాడు సూర్య కుమార్ యాదవ్. వాస్తవానికి అతడు ఆ స్థాయిలో పరుగులు చేసినప్పటికీ.. అతడి రేంజ్ ఇన్నింగ్స్ అది కాదు. దీంతో సూర్యకుమార్ యాదవ్ పై మరింత ఒత్తిడి పెరిగిపోయింది.
ఇక రెండవ టి20 మ్యాచ్లో 6 పరుగులకే ఇద్దరు ఓపెనర్లు అవుట్ అయ్యారు. దీంతో సూర్య కుమార్ యాదవ్ పై విపరీతమైన ఒత్తిడి పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో కిషన్ తో కలిసి అతడు మూడో వికెట్లు ఏకంగా 122 పరుగులు జోడించాడు. అంతేకాదు 23 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. తద్వారా ఈ ఏడాది కంటే ఎక్కువ కాలం తర్వాత టి20 లలో సూర్య కుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ చేశాడు. ఈ హాఫ్ సెంచరీ ద్వారా సూర్య కుమార్ యాదవ్ తన మీద ఉన్న ఒత్తిడి మొత్తం తగ్గించుకున్నాడు. టి20 వరల్డ్ కప్ కు ముందు మరింత సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకున్నాడు.. సూర్య కుమార్ యాదవ్ ఈ స్థాయిలో బ్యాటింగ్ చేయడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి.
ఈ మ్యాచ్లో డఫి, సోది బౌలింగ్ ను సూర్య కుమార్ యాదవ్ ఊచకోత కోశాడు. ఇప్పట్లో వారిద్దరు సూర్యకుమార్ యాదవ్ ను మర్చిపోయే అవకాశం లేదంటే.. అతని బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సూర్య కుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత.. మైదానంలో అభిమానులు మిస్టర్ 360 అంటూ ఫ్ల కార్డులు ప్రదర్శించడం విశేషం.