IND vs ENG 2nd Test Akash Deep: తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. రెండవ ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు సాధించాడు. మొత్తంగా పది వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. విజయం అంటే ఏంటో తెలియని ఎడ్జ్ బాస్టన్ వేదికపై సత్తా చూపించాడు.. అంతేకాదు ఈ మైదానంపై తొలిసారి టీమిండియా సాధించిన విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. దీంతో అతని గురించి ప్రధాన మీడియాలో విపరితమైన చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో అతడి ప్రస్తావనే కొనసాగుతోంది. ఇంతకీ ఆటగాడు మరెవరో కాదు.. అతడే ఆకాష్ దీప్.
Also Read: గిల్ శతకాల మోత, ఆకాష్, సిరాజ్ వికెట్ల వేట.. రెండో టెస్టులో టీమిండియా విజయానికి కారణాలివే!
ఇంగ్లాండ్ జట్టుపై విజయం సాధించిన తర్వాత ఆకాష్ పేరు మార్మోగిపోతున్నది. క్రికెట్ వర్గాల్లో అతని గురించి విపరీతంగా చర్చ నడుస్తున్నది. వాస్తవానికి బుమ్రా లేకపోతే ఇంగ్లాండ్ చేతిలో టీమిండియాకు ఓటమి తప్పదని అందరూ అనుకున్నారు. కానీ ఆకాష్ 10 వికెట్లు సాధించి అదరగొట్టాడు. భారత జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఈ విజయం టీం ఇండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే మరుపు రానిదిగా మిగిలిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. బుమ్రా ను మరిపిస్తూ 10 వికెట్ల విజయం సాధించడం అంత సులువైన విషయం కాదు. ఏమాత్రం భయపడకుండా.. ఇంగ్లాండ్ పిచ్ లు చూసి వెనకడుగు వేయకుండా కట్టుదిట్టంగా బంతులు వేశాడు ఆకాష్.. ప్లాట్ మైదానంపై పరుగులు ఇవ్వకుండా వికెట్లు ఎలా తీయాలో నిరూపించాడు.
గతంలో ఆకాష్ గబ్బా మైదానంలో ఆడాడు..అక్కడి పిచ్ పై అద్భుతమైన స్వింగ్, బౌన్స్ రాబట్టాడు. దీంతో ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు కనిపించాయి.ఈ నేపథ్యంలో నాటి ఆస్ట్రేలియా ఆటగాడు స్మిత్ మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రత్యేకంగా ఆకాశ్ గురించి మాట్లాడాడు. “అతని బంతి వేగంగా దూసుకు వస్తున్నది. ఏం చేయాలో అనుకునే లోపే నష్టం చేసి వెళ్తోంది. ఇటువంటి బౌలింగ్ ఆడటం చాలా కష్టం. అతడికి అద్భుతమైన ప్రతిభ ఉంది. దాన్ని గనుక సాన పెడితే తిరుగు ఉండదని” స్మిత్ వ్యాఖ్యానించాడు. అతడు ఆ రోజుల్లో అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశాడో ఇప్పుడు అర్థమవుతోంది. ఇంగ్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించే విధంగా బౌలింగ్ వేశాడు ఆకాష్. ఒకానొక దశలో రెండవ ఇన్నింగ్స్ లో సిరాజ్ వికెట్లు తీయలేకపోయిన సందర్భంలో.. ఆకాష్ ఆరు వికెట్లు దక్కించుకోవడం విశేషం. తొలి ఇన్నింగ్స్ లోను అతడు 4 వికెట్ల ఘనతను అందుకోవడం గమనార్హం.
రెండవ టెస్టులో 10 వికెట్లు సాధించిన తర్వాత ఆకాష్ ఉద్వేగంగా మాట్లాడాడు. అయితే ఈ ఘనతను క్యాన్సర్ తో బాధపడుతున్న తన సోదరికి అంకితం ఇస్తున్నట్టు అతని ప్రకటించాడు. దీంతో ఆట ద్వారానే కాకుండా తన సోదరికి ఈ ఘనతను అంకితం ఇచ్చి హృదయాలు గెలిచావని క్రికెటర్లు అంటున్నారు.. మరోవైపు ఆకాష్ బీహార్ క్రికెట్ అసోసియేషన్ బ్యాన్ విధించడంతో కుటుంబంతో సహా ఆ రాష్ట్రాన్ని వీడి వచ్చాడు. అనంతరం మూడు నెలల వ్యవధిలోనే తండ్రిని సోదరుడిని కోల్పోయాడు. ఆ సమయంలో అతడు తీవ్రమైన నిర్వేదంలో మునిగిపోయాడు. చివరికి ఆ బాధ నుంచి తేరుకున్నాడు.