Homeక్రీడలుక్రికెట్‌IND Vs BAN Champions Trophy 2025: బంగ్లా అని నిర్లక్ష్యం వద్దు..భారత్ దుమ్మురేపాల్సిందే..

IND Vs BAN Champions Trophy 2025: బంగ్లా అని నిర్లక్ష్యం వద్దు..భారత్ దుమ్మురేపాల్సిందే..

IND Vs BAN Champions Trophy 2025: ఛాంపియన్ ట్రోఫీ (ICC Champions trophy 2025) లో గ్రూప్ – ఏ లో భారత్, బంగ్లాదేశ్ గురువారం తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో రోహిత్ ఆధ్వర్యంలోని టీమిండియా బలంగా కనిపిస్తున్నప్పటికీ.. బంగ్లాదేశ్ జట్టును అంత తక్కువగా చూసేందుకు అవకాశం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు టీమిండియా స్వదేశంలో ఇంగ్లాండ్ జట్టుతో టీ20, వన్డే సిరీస్ లు గెలిచింది. తద్వారా సూపర్ జోష్ లో ఉంది. కటక్ లో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. చాలాకాలం తర్వాత టచ్ లోకి వచ్చాడు. విరాట్ కోహ్లీ అహ్మదాబాద్ వేదికగా జరిగిన వన్డేలో హాఫ్ సెంచరీ చేశాడు. సుదీర్ఘ సమయం తర్వాత ఫామ్ లోకి వచ్చాడు.. అయితే రాహుల్ బ్యాటింగ్ స్థానం విషయంలో ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అయితే అతడు ఐదో నెంబర్లో బ్యాటింగ్ కు అవకాశం ఉంది. అయితే మ్యాచ్ పరిస్థితి ఆధారంగా అతని బ్యాటింగ్ ఆర్డర్ పై మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఎవరికి అవకాశం లభిస్తుందో

బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరంగా ఉండడంతో అతడి స్థానంలో.. అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణాలలో ఎవరో ఒకరికి అవకాశం లభిస్తుంది. చివరి ఓవర్లలో అర్ష్ దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ వేస్తాడు. బహుశా అతడికి అవకాశం ఇవ్వచ్చు. మహమ్మద్ షమీ భారత పేస్ దళాన్ని ముందుకు నడిపిస్తాడు.. హార్దిక్ పాండ్యా తో పాటు ముగ్గురు స్పిన్నర్లతో రంగంలోకి దిగాలని మేనేజ్మెంట్ భావిస్తోంది.. ఈ క్రమంలో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, మూడో స్పిన్నర్ గా కులదీప్ యాదవ్ ను జట్టులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

బంగ్లా జట్టు లో షకిబుల్, తమీమ్ లేకపోవడంతో బలహీనంగా కనిపిస్తోంది. బంగ్లా కెప్టెన్ శాంటో ఫామ్ లేని ఆ జట్టును ఇబ్బందికి గురిచేస్తోంది.. మిడిల్ ఆర్డర్లో మహమ్మదుల్లా, ముష్పికర్ పర్వాలేదనిపిస్తున్నారు. స్పిన్ బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టును ఇబ్బంది పట్టాలని బంగ్లా జట్టు భావిస్తోంది.. నహీద్ రాణా, టస్కిన్ భారత బ్యాటర్లను ఒకవేళ గనుక కట్టడి చేస్తే బంగ్లాదేశ్ జట్టుకు అవకాశాలు మెరుగుపడతాయి.

పిచ్ ఎలా ఉందంటే

గత రెండు రోజులుగా దుబాయ్ లో వర్షం కురుస్తోంది. దీంతో మైదానం బావులర్లకు సహకరించే అవకాశం కల్పిస్తోంది. తాజాగా సిద్ధం చేసిన వికెట్లను ఈ మ్యాచ్ కోసం ఉపయోగిస్తారని తెలుస్తోంది. వర్షం కురిసే అవకాశం తక్కువేనని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే మంచు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

తుది జట్ల అంచనా ఇలా

భారత్

రోహిత్ (కెప్టెన్), గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్ దీప్ సింగ్/ హర్షిత్ రాణా, కులదీప్ యాదవ్, మహమ్మద్ షమీ.

బంగ్లాదేశ్

హసన్, సౌమ్య సర్కార్, షాంటో(కెప్టెన్), తౌహీద్ హ్రుదయ్, ముష్ఫికర్ రహీం, మహమ్మదుల్లా మెహదీ హసన్, రిషద్ హుస్సేన్, తస్కిన్, ముస్తాఫిజర్, నహీద్ రాణా.

మ్యాచ్ ఒంటిగంట 30 నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18, జియో హాట్ స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular