Ind Vs Aus 2nd T20: గంటల వ్యవధిలో టీమ్ ఇండియాకు దిమ్మతిరిగే ఫలితం వచ్చింది.. కొన్ని గంటల క్రితం భారత మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్ సెమి ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టుపై అద్భుతమైన విజయాన్ని సాధించింది. 339 రన్స్ టార్గెట్ ను ఫినిష్ చేసేసింది. ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన గెలుపును దక్కించుకుంది. చేజింగ్ లో సరికొత్త ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. తద్వారా వన్డే వరల్డ్ కప్ ఫైనల్లోకి ప్రవేశించింది. మెగా ట్రోఫీకి అడుగు దూరంలో నిలిచింది.
Also Read: వాళ్లంతా సర్వనాశనం అయిపోతారు అంటూ శాపనార్ధాలు పెట్టిన మంచు లక్ష్మి!
అమ్మాయిలు చూపించిన తెగువ అబ్బాయిలతో కనిపించలేదు. ఆస్ట్రేలియా పురుషుల జట్టుతో జరిగిన టి20 మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయింది. దారుణమైన బ్యాటింగ్ తో అభిమానులకు కన్నీళ్లు తెప్పించింది.. అభిషేక్ శర్మ (68), హర్షిత్ రాణా (35) పరుగులు చేశారు.. వీరిద్దరూ ఏకంగా 103 పరుగులు చేశారు. టీమ్ ఇండియా మొత్తం చేసిన స్కోరు 125. ఈ ప్రకారం మిగతా ఆటగాళ్లు 22 పరుగులు మాత్రమే చేశారు. దీన్నిబట్టి టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గిల్(5), సూర్య కుమార్ యాదవ్ (1), సంజు శాంసన్(2), తిలక్ వర్మ(0), అక్షర్ పటేల్(7), శివం దూబే(4), కుల దీప్ యాదవ్(0), బుమ్రా(0) పరుగులకు అవుట్ కావడం విశేషం. ఆస్ట్రేలియా బౌలర్లలో హెజిల్ వుడ్ మూడు వికెట్లు పడగొట్టాడు. బార్ట్ లెట్ 2, ఎల్లిస్ 2 వికెట్లు సొంతం చేసుకున్నారు.
భారత జట్టు విధించిన 126 పరుగుల లక్ష్యాన్ని 13.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఫినిష్ చేసింది. మార్ష్(46), హెడ్(28), ఇంగ్లిస్(20) పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా విజయం నల్లేరు మీద నడకయింది. బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కులదీప్ యాదవ్ తలా రెండు వికెట్లు సాధించారు. వాస్తవానికి లక్ష్యం మరీ అంత అయినప్పటికీ.. టీమిండియా బౌలర్లు ఆస్ట్రేలియా ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా బంతులు వేశారు. అందువల్లే ఆస్ట్రేలియా జట్టు సులువుగా విజయం సాధించింది.
ప్రారంభం నుంచి టీమిండియా బౌలర్లు కట్టదిట్టంగా బౌలింగ్ వేసి ఉంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది. ఇప్పటికే తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. రెండవ మ్యాచ్ లో దారుణమైన పరాజయం ఎదురయింది. మరి ఇప్పటికైనా టీం ఇండియా ఓటమి నుంచి పాఠం నేర్చుకుంటుందా.. టీమిండియా మహిళల నుంచి స్ఫూర్తి పొందుతుందా.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. ఈ మ్యాచ్ ద్వారా టీం ఇండియాలో ఉన్న లోపాలు బయటపడ్డాయి. ఈ క్రమంలో ఆ లోపాలను సవరించుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.