Team India Cricket: టీం ఇండియా క్రికెట్ జట్టు పయనమెటు.. భవిష్యత్ ప్రశ్నార్థయమేనా.. అంటే అవుననే సమాధానం వస్తోంది క్రికెట్ విశ్లేషకుల నుంచి ప్రస్తుతం విజయాలు వస్తున్నా.. జట్టు పరిస్థితి చూస్తే మాత్రం రాబోయే రోజుల్లో మరో జింబాబ్వే అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఎందుకీ పరిస్థితి.. ఎవరిది తప్పు అనేవి మాత్రం సమాధానం లేని ప్రశ్నలే.
మరో జింబాబ్వే అవుతుందా?
బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఇప్పటికే రెండు టెస్టులు గెలిచింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో 2–0 లీడ్ సాధించింది. ఇండోర్‌లో జరుగుతున్న మూడో టెస్టులో ఓటమి దాదాపు ఖాయమే. అయినా మళ్లీ పుంజుకునే అవకాశం అయితే ఉంది. కానీ.. పరిస్థితి చూస్తుంటే రానున్న కాలంలో టీమిండియా పరిస్థితి జింబాబ్వే కంటే దారుణంగా మారుతుంది క్రికెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం విజయాల కోసం టీమిండియా ఇలాంటి పిచ్‌లకు అలవాటు పడి, స్పిన్నర్లనే తమ బలంగా మార్చుకుంటే.. భవిష్యత్తులో ఊహించని విధంగా దెబ్బపడుతుందని అంటున్నారు.
స్వదేశంలో పులి.. విదేశాల్లో పిల్లి..
టీమిండియా స్వదేశంలో టెస్టు క్రికెట్ కోసం స్పిన్ పిచ్‌లను తయారు చేయించుకుని, ఏకంగా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగి, ఒక్కరు లేదా, ఇద్దరు పేసర్లతోనే సరిపెట్టుకుంటుంది. ఒకరిద్దరు పేసర్లు జట్టులో ఉన్నా వారితో చాలా తక్కువ ఓవర్లు వేయిస్తూ.. స్పిన్నర్లనే ఎక్కువ వాడుతోంది. పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో అలా చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. గతం నుంచి కూడా టీమిండియాకు స్పిన్ బలంగానే ఉన్నా.. ఈ మధ్య కాలంలో ఈ ధోరణి మరీ ఎక్కువైంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాకిస్థాన్ లాంటి జట్లకు మనకు ఉన్న పెద్ద తేడా పేస్ ఎటాక్. చాలా కాలం నుంచి ఈ తేడా అలాగే కొనసాగుతూ వస్తోంది. దీంతో హోం గ్రౌండ్‌లో స్పిన్నర్లతో పులిలా గర్జిస్తున్న టీం ఇండియా విదేశీ గడ్డపై మాత్రం పేసర్లను ఎదుర్కొవడంతో ఇబ్బంది పడుతోంది. తడబడుతోంది.
పేసర్లు ఉన్నా స్పిన్ పిచ్‌లపైనే మక్కువ..
ఇండియన్‌క్రికెట్‌లో ఒకప్పుడు వేళ్లమీద లెక్కబెట్టే పేసర్లు ఉన్నారు. కపిల్ దేవ్, శ్రీనాథ్, జహీర్‌ఖాన్ గొప్ప పేసర్లుగా, నెహ్రా, ఇర్ఫాన్ పఠాన్, బుమ్రా పర్వాలేదనిపించేలా ఉన్నారు. కానీ.. ఇప్పుడిప్పుడే టీమిండియాలో పేస్ బౌలర్లు పెరుగుతున్నారు. బుమ్రా, షమీ, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ఉమేష్ యాదవ్, అర్షదీప్ సింగ్ ఇలా పేస్ ఎటాక్ కాస్త బలంగానే కనిపిస్తోంది. అయినా కూడా టీమిండియా కెప్టెన్లు తమ హయాంలో టీమిండియాకు రికార్డు విజయాలు అందించాలనే మితిమీరిన స్వార్థంతో స్వదేశంలో పిచ్‌లను స్పిన్‌కు అనుకూలంగా మార్చేస్తున్నారు. గతంలో ఇండియా పిచ్ కండీషన్స్ స్పిన్‌కు అనుకూలంగా ఉన్నా.. మరి ఇంత కళ్లు తిరిగిపోయే టర్న్ ఉండేది కాదు. చెన్నై, ఢిల్లీ పిచ్‌లు తప్పితే.. మిగతా పిచ్‌లు బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్‌లే. వాటిలో స్పిన్‌తోపాటు పేసర్లకు కూడా రాణించే అవకాశం ఉండేది.
కచ్చితంగా గెలవాలనే..
ధోని తర్వాత.. కెప్టెన్లుగా చేస్తున్న వారు కచ్చితంగా గెలవాలనే ధోరణితో తమకు స్పిన్ పిచ్‌లే కావాలని పట్టుబడుతున్నారు. ఎందుకంటే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి జట్లు స్పిన్ అంత బాగా ఆడలేవని వారి నమ్మకం. ఆ నమ్మకంతోనే స్పిన్ పిచ్‌లపై ఎక్కువగా ఆధారపడి పేసర్లను పక్కనపెట్టి ముగ్గురు స్పిన్నర్లతో విజయాలు సాధిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు తాత్కాలిక ఆనందం ఇవ్వచ్చు కానీ భవిష్యత్తులో పెద్ద ఎదురుదెబ్బగా మారుతాయి. ఎందుకంటే.. మ్యాచ్‌లు స్వదేశంలో జరుగుతున్నంత సేపు బాగానే ఉంటుంది. విదేశాలకు పోతే అక్కడ మన స్పిన్ అంతగా పనిచేయదు. ప్రత్యర్థులను ఆపాలంటే పేసర్లు కావాల్సిందే. కోహ్లీ కెప్టెన్సీ టీమిండియా ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల్లో విజయం సాధించిందంటే అంది పేసర్ల పుణ్యమే.
కెప్లెన్లు స్వార్థం వీడితేనే
గతంలో పెద్దగా పేస్ ఎటాక్‌లేని టీమిండియాకు.. ఇప్పుడిప్పుడే 150 ప్లస్ వేగంతో వేస్తున్న పేస్ బౌలర్లు జట్టులోకి వస్తున్నారు. ఈ తరుణంలో మళ్లీ అదే మూస పద్ధతులతో స్పిన్‌ను నమ్ముకుని విదేశాల్లో దెబ్బతినే పరిస్థితి తెచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. కెప్టెన్ల స్వార్థంతోనే ఇండియాలోని పిచ్‌లన్నీ స్పిన్‌కు అనుకూలంగా మారుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. టీమిండియా అంటే స్పిన్ తప్ప ఇంకోటి కాదు అనే పరిస్థితి వస్తుంది. వరల్డ్ చాంపియన్ కావాలంటే అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉండాలి. బ్యాటింగ్ విషయంలో టీమిండియా ఎదురులేని బలం ఉంది. కానీ.. ఇండియాలో కేవలం స్పిన్‌ను మాత్రమే ఎదుర్కొంటూ.. విదేశాలకు వెళ్లి నిప్పులు చెరిగే బంతులను ఇప్పటి యువ క్రికెటర్లు తట్టుకోగలరా? అక్కడ కూడా వారు పేస్ సమర్థవంతంగా ఆడాలంటే.. ఇండియాలోని కొన్ని పిచ్‌లనైనా పేస్‌కు అనుకూలంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. లేకుంటే భవిష్యత్ జింబాబ్వేగా టీం ఇండియా మారడం ఖాయం అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్.