Pakistan Vs UAE: చచ్చిన పామును మళ్లీ మళ్లీ చంపడం అంటే ఇదే కాబోలు. ఇప్పటికే పాకిస్తాన్ ఆసియా కప్ లో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. భారత్ గ్రూప్ దశలో కొట్టిన దెబ్బకు ఓడిపోయింది. ఓటమి అనంతరం పాకిస్తాన్ జట్టుకు మరింత పరాభవం ఎదురయింది. భారత్ గెలిచిన తర్వాత కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా ఒప్పుకోలేదు. దీంతో ఈ విషయాన్ని పాకిస్తాన్ రచ్చ రచ్చ చేసింది.. ఎన్ని రకాలుగా ప్రయాసపడినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. భారత జట్టును నేరుగా ప్రశ్నించే దమ్ము లేక మ్యాచ్ రిఫరీ మీద మండిపడింది పాకిస్తాన్. ఏకంగా ఆసియా కప్ నుంచి తప్పుకుంటామని బెదిరించింది. దీంతో రెఫరీని తప్పిస్తామని ఐసిసి ప్రకటించినట్టు వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ నిజం కాదని తేలిపోయింది.
బుధవారం యూఏఈ తో జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్తాన్ ఆడుతుందా? లేదా? అనే ప్రశ్నలు తలెత్తాయి. దీనికి తోడు పాకిస్తాన్ ప్లేయర్లు హోటల్ గది నుంచి బయటికి రాలేదు. దీంతో మ్యాచ్ జరగదని.. పాకిస్తాన్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే చివర్లో పాకిస్తాన్ ఆడేందుకు ముందుకు వచ్చింది. బ్యాటింగ్ మొదలు పెట్టిన పాకిస్తాన్ యూఏఈ జట్టు బౌలర్ల ఎదుట తేలిపోయింది. ఈ కథనం రాసే సమయం వరకు నాలుగు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 17 పరుగులు మాత్రమే చేసింది.. తొలి ఓవర్ లోనే ఓపెనర్ ఆయూబ్ ను అవుట్ చేసి యూఏఈ పాకిస్తాన్ జట్టుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇటీవల భారత జట్టుతో జరిగిన మ్యాచ్లో కూడా అతడు 0 పరుగులకే అవుట్ అయ్యాడు.
ఇక ఈ మ్యాచ్లో రిఫరీగా ఆండీ ఫ్రై క్రాఫ్ట్ ను ఐసీసీ కొనసాగించింది. పాకిస్తాన్ డిమాండ్ ను పక్కన పెట్టింది. దీంతో పాకిస్తాన్ పరువు మరొకసారి పోయింది. వాస్తవానికి మ్యాచ్ రిఫరీ ని మార్చుతారని వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదని ఐసీసీ స్పష్టం చేసింది. అదే కాదు పాకిస్తాన్ ఒత్తిడికి తలవంచేది లేదని పేర్కొంది. ఇక ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ లో ఆడేందుకు భారత జట్టు నిరాకరించింది. దీనిపై పాక్ నానా యాగీ చేసింది. చివరికి ఐసీసీ చెప్పినట్టు వినాల్సి వచ్చింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ని ప్రదర్శించాలని పాకిస్థాన్ అనుకుంది. భారత్ అడ్డు చెప్పడంతో.. ఐసీసీ రంగంలోకి దిగింది. దీంతో పాకిస్తాన్ వెనక్కి వెళ్ళక తప్పలేదు. ఇప్పుడు ఆసియా కప్ లో కూడా పాకిస్తాన్ జట్టుకు ఐసిసి నుంచి మళ్లీ అదే ప్రతికూల ఫలితం ఎదురయింది.