Dinesh Karthik: నిన్న ముంబై వాంఖడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఆకట్టుకుంది. అసలైన ఐపీఎల్ మజా అంటే ఏంటో రుచి చూపించింది. ఇప్పటివరకు చప్ప చప్పగా సాగుతున్న మ్యాచ్ లను చూసిన అభిమానులకు.. ఈ మ్యాచ్ ఫుల్ కిక్ ఇచ్చింది. ఓటమి అంచుల్లో కూరుకుపోయిన బెంగుళూరు అనూహ్యంగా పుంజుకుని విజయం సాధించడం నిజంగా అద్భుతమే అని చెప్పాలి.
వరుసగా రెండు విజయాలతో జోరు మీద ఉన్న రాజస్థాన్ రాయల్స్ కు ఆర్సీబీ రూపంలో ఓటమి ఎదురైంది. ముఖ్యంగా 85 పరుగుల వద్ద సగం వికెట్లు కోల్పోయిన బెంగుళూరును షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ కలిసి విజయతీరాలకు చేర్చారు. ముఖ్యంగా దినేష్ కార్తీక్ చివరికంటా పోరాడిన తీరు అద్భుతం. ఈ మ్యాచ్ లో అతను 23 బంతుల్లో 7 ఫోర్లు ఒక సిక్సర్ తో 44 పరుగులు చేశాడు. చివరి నిమిషంలో ఎక్కువ పరుగులు చేసి జట్టును గెలిపించాడు.
జట్టు విజయం సాధించిన తర్వాత అతను మీడియాతో భావోద్వేగంగా మాట్లాడాడు. తన సక్సెస్ ప్రయాణం ఇక్కడితో అయిపోలేదని.. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందంటూ చెప్పుకొచ్చాడు. తన టార్గెట్ ను చేరుకోవడానికి తనను తాను మలుచుకున్నానని.. ఇందుకోసం కఠోర శ్రమను చేస్తున్నట్లు తెలిపాడు. కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు తనకు తాను కొత్తగా కనిపిస్తున్నానంటూ చెప్పాడు.
దినేష్ కార్తీక్ ఆడిన తీరు నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గతంలో కోల్ కత్తా కెప్టెన్ గా పనిచేసిన అనుభవం ఈ మ్యాచ్ లో బాగా పనిచేసింది. ఒత్తిడిని ఎదుర్కొని జట్టును విజయతీరాలకు చేర్చడం అంటే మామూలు విషయం కాదు. ఈ విషయంలో కార్తీక్ బాగా సక్సెస్ అయ్యాడు. రాబోయే రోజుల్లో అతను ఇలాగే ఆడితే ఆర్సిబికి తిరుగు ఉండదని చెప్పుకోవాలి.