ఇండియన్ ప్రీమియర్ లీగ్ అత్యంత కట్టుదిట్టమైన చర్యల నడుమ మొదలైంది. వేలాది కోట్ల రూపాయల వ్యవహారంతో కూడుకున్నది గనక.. వైరస్ చొరబడకుండా బయోబబూల్ వాతావరణం ఏర్పాటు చేయడంతోపాటు.. ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంత చేసినా.. బయోబబూల్ ఛేదించుకొని మరీ వైరస్ లోనికి ఎలా చొచ్చుకొచ్చిందన్నది బీసీసీఐకి అర్థం కాలేదు. దీంతో.. వెంటనే విచారణ చేపట్టారు. దీంతో.. ఎలా చొరబడిందన్న విషయం తేలిందట.
అందుతున్న సమాచారం ప్రకారం.. మే 1వ తేదీన అహ్మదాబాద్ లో హోటల్ లో ఉన్న కోల్ కతా జట్టు సభ్యుడు వరుణ్ కు కడుపులో కాస్త ఇబ్బందిగా అనిపించిందట. దీంతో.. హోటల్ నుంచి బయటకు వెళ్లి, స్కానింగ్ చేయించుకొని వచ్చాడట. అతను బయటకు వెళ్లడమే కాకుండా.. లోనికి వచ్చి బయోబబూల్ రూల్ ను బ్రేక్ చేశాడట.
ఈ రూల్ ప్రకారం.. బబూల్ నుంచి ఎవరైనా బయటకు వెళ్తే.. రెండు వారాలపాటు అతడు మిగిలిన సభ్యులతో కలవకుండా వేరుగా ఉంచుతారు. అంతటి ముఖ్యమైన రూల్ ను బ్రేక్ చేశాడట వరుణ్. హోటల్ కు వచ్చి, ఆ తర్వాత జట్టు సహచరులతో కలిసిపోయాడట.
సహచరుడు సందీప్ వారియర్ తో కలిసి భోజనం చేసి, ఆ తర్వాత వారిద్దరూ జట్టు సభ్యులతో కలిసి బస్సులో స్టేడియం చేరుకున్నారు. కలిసి ప్రాక్టీస్ చేశారు. స్టేడియానికి వెళ్లిన తర్వాత తనకు ఒంట్లో బాగోలేదని చెప్పి, గదిలో ఉన్నాడు. మిగిలినవారు ప్రాక్టీస్ కు వెళ్లారు.
ఇదిలా ఉంటే.. రెండోసారి బయోబబూల్ బ్రేక్ జరిగింది. నిబంధన ప్రకారం.. ఏ రెండు జట్లూ కలిసి ప్రాక్టీస్ చేయకూడదు. కానీ.. అక్కడ స్టేడియంలో కోల్ కతా, ఢిల్లీ జట్ల ఆటగాళ్లు కలిసి ప్రాక్టీస్ చేశారు. ఈ సమయంలోనే పరిస్థితి కీలక మలుపు తిరిగిందట.
వరుణ్ తో కలిసి భోజనం చేసిన సందీప్.. నెట్ ప్రాక్టీస్ చేస్తున్న ఢిల్లీ స్పిన్నర్ అమిత్ మిశ్రాను కలిశాడు. ఇద్దరు కొంతసేపు మాట్లాడుకున్నారట. అనంతరం మిశ్రా జట్టు సభ్యులతో కలిసి హోట్ కు వెళ్లాడు. అక్కడికి వెళ్లగానే.. అతడికి అస్వస్థత అనిపించిందట.ఆ సమయంలోనే సందీప్ కు కరోనా లక్షణాలు కనిపించడంతో కలకలం మొదలైంది. మిగిలిన వారిలోనూ లక్షణాలు కనిపించడం.. అందరికీ పాజిటివ్ రావడం మొదలైంది.
ఆ విధంగా.. కేవలం ఒక్క ఆటగాడు బయోబబూల్ ను బ్రేక్ చేయడం వల్ల ఏకంగా వేలాది కోట్ల రూపాయల విలువైన ఐపీఎల్ టోర్నీ అర్ధంతరంగా నిలిచిపోయింది. కరోనా వైరస్ దేశంలో ఏ విధంగా విస్తరిస్తోందో దీన్ని అప్లై చేసుకుంటే క్లియర్ గా అర్థమైపోతుంది.